మాతృభాషలో తీర్పుల అనువాదం

ABN , First Publish Date - 2021-12-29T08:41:12+05:30 IST

న్యాయస్థానాలు తీర్పులను మాతృభాషల్లోకి అనువదించి, ఆ సమాచారాన్ని వెబ్‌సైట్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

మాతృభాషలో తీర్పుల అనువాదం

  • తెలుగు రాష్ట్రాల హైకోర్టులను ఆదేశిస్తా
  • మరోసారి గ్రంథాలయోద్యమం అవసరం
  • గ్రామీణ లైబ్రరీలను పునరుద్ధరించాలి
  • మాక్సిం గోర్కి ‘అమ్మ’ ప్రభావితం చేసింది
  • పైరసీకి పాల్పడితే కఠినంగా శిక్షించాలి
  • సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానాలు తీర్పులను మాతృభాషల్లోకి అనువదించి, ఆ సమాచారాన్ని వెబ్‌సైట్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సలకు ఆదేశాలిస్తానని తెలిపారు. జిల్లా కోర్టుల్లోని తీర్పులు తెలుగులో వెలువడేలా చూడాలంటూ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ కోరగా.. సీజేఐ ఈ మేరకు స్పందించారు. ఆంగ్లంలో వెలువడుతున్న సుప్రీంకోర్టు తీర్పులు సంక్లిష్టంగా, సామాన్యులకు అర్థంకాని విధంగా ఉంటున్నాయని రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ తనతో చెప్పడంతో, అప్పటి నుంచి కీలక తీర్పులను కొన్ని ప్రాంతీయ భాషల్లోనూ అనువదించి వైబ్‌సైట్లలో ఉంచుతున్నట్లు తెలిపారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టి్‌సగా ఉన్న రోజుల్లో తెలుగులోనే తీర్పులు వెలువడేలా చొరవ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మంగళవారం దోమల్‌గూడలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో 34వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో సీజేఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి గ్రంథాలయ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ప్రభుత్వాలు గ్రామీణ గ్రంథాలయాలను పునరుద్ధరించడంతోపాటు వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ప్రచురణకర్తల నుంచి పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా కొనుగోలు చేసి గ్రంథాలయాలకు ఇవ్వాలని సూచించారు. 


ప్రచురణకర్తల బాధలు తెలుసు..

తాను న్యాయశాస్త్ర విద్యను అభ్యసిస్తున్న రోజుల్లో ‘నడుస్తున్న చరిత్ర’ పేరుతో పక్ష పత్రిక నడిపిన అనుభవాన్ని సభలో సీజేఐ జస్టిస్‌ రమణ ప్రస్తావించారు. ప్రచురణకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసునన్నారు. పులిమీద పుట్రలాగా డిజిటల్‌ మాధ్యమాలు వచ్చాక.. అచ్చు అవ్వకముందే పుస్తకం పైరసీకి లోనవుతోందని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పైరసీ కేసుల్లో దోషులను కఠినంగా శిక్షించాలని న్యాయమూర్తులకు సీజేఐ సూచించారు. కొత్తగా వచ్చే సినిమాల గురించి మినహా మంచి పుస్తకాల గురించి సామాజిక మాధ్యమాల్లో సమీక్షలు పెద్దగా రావడం లేదన్నారు. సాహిత్యాన్ని, పుస్తకాన్ని బతికించడం ద్వారా మాత్రమే భాష, సంస్కృతులు వర్థిల్లుతాయని పేర్కొన్నారు. సభలు, సమావేశాల్లో శాలువాలు, పుష్పగుచ్ఛాలకు బదులు పుస్తకాలు ఇచ్చిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పైరసీ పుస్తకాలను ప్రోత్సహించవద్దని సీజేఐ జస్టిస్‌ రమణ అన్నారు.

చదువుతోపాటు వ్యాయామం, పుస్తక పఠనం అలవాట్లను పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా అలవాటు చేయాలని సూచించారు. రాచమల్లు రామచంద్రారెడ్డి, నిడమర్తి ఉమా మహేశ్వరరావు వంటి పెద్దలు అనువదించిన రష్యన్‌ సాహిత్యాన్ని చిన్నతనంలో తాను బాగా చదివానని సీజేఐ తెలిపారు. అందులో మాక్సిం గోర్కి ‘అమ్మ’ నవలను కొన్ని వందలసార్లు చదివానని, తనను అత్యంత ప్రభావితం చేసిందన్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లోని సందేశాలకు భాష, భావం సంక్రమంగా లేకపోవడం వల్ల అవి అనేక అపార్థాలకు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాలతో ఆ సమస్య చాలావరకు ఉండదన్నారు.

Updated Date - 2021-12-29T08:41:12+05:30 IST