‘ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలుపునకు కేసీఆర్‌ కృషి చేశారు’

ABN , First Publish Date - 2022-03-13T09:23:04+05:30 IST

‘ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలుపునకు కేసీఆర్‌ కృషి చేశారు...’

‘ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలుపునకు కేసీఆర్‌ కృషి చేశారు’

  • సోనియా, రాహుల్‌కు టీపీసీసీ మద్దతు
  • కార్యవర్గ సమావేశంలో తీర్మానం
  • డిజిటల్‌ సభ్యత్వ నమోదు 20 వరకే! 
  • త్వరలో రాష్ట్ర నేతలతో రాహుల్‌ భేటీ
  • పంజాబ్‌లో పార్టీ ఓటమిని చూసైనా 
  • రాష్ట్ర నేతలు నేర్చుకోవాలి: యాష్కీ


హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వానికి టీపీసీసీ సంపూర్ణ మద్దతు తెలిపింది. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కార్యవర్గం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించి ఏఐసీసీకి పంపింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపై చర్చించిన అనంతరం ఈ తీర్మానం చేసింది. ఇక రాజీవ్‌ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ చైర్మన్‌ జయంతి నటరాజన్‌ సోమవారం భూదాన్‌ పోచంపల్లిలో ప్రారంభించనున్న పాదయాత్రపైనా చర్చించారు. భూదాన్‌ పోచంపల్లి నుంచి ఆదిలాబాద్‌ వరకు 25 రోజులు సాగే ఈ పాదయాత్రలో పార్టీ ముఖ్యనేతలు అక్కడక్కడ భాగస్వామ్యం కావాలని, ఆయా చోట్ల సంపూర్ణ సహకారం అందించాలని నిర్ణయించారు. ఇక పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈనెల 20 కటాఫ్‌ తేదీని పెట్టుకుని ముగించాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీ సభ్యులకు ప్రమాద బీమా ప్రీమియం చెల్లించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.


గాంధీ కుటుంబం బలహీనులైతే మోదీ విమర్శలెందుకు?

తెలంగాణ రాష్ట్ర నాయకత్వంతో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ త్వరలోనే భేటీ కానున్నట్లు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ తెలిపారు. కార్యవర్గ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో ఉందని, తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. సోనియా, రాహుల్‌, ప్రియాంక బలహీనులైతే ప్రధాని మోదీ పదే పదే వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌, గోవాల్లో కాంగ్రెస్‌ గెలుపును టీఏంసీ లాంటి పార్టీలు దెబ్బతీశాయన్నారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలుపునకు కేసీఆర్‌ కూడా కృషి చేశారని ఆరోపించారు. మోదీ నిర్మాణం, పీకే దర్శకత్వంలో కేసీఆర్‌ నటిస్తున్నారన్నారు. పంజాబ్‌ ఓటమి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ చాలా నేర్చుకోవాలని, గొడవలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.


కొల్లాపూర్‌లో నేడు  ‘‘మన ఊరు-మన పోరు’’ 

నాగర్‌కర్నూల్‌/కొల్లాపూర్:  కాంగ్రెస్‌ పార్టీ ‘మన ఊరు-మన పోరు’ కార్యక్రమానికి నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం జరిగే ఈ సభకు లక్షకు తగ్గకుండా జనసమీకరణ చేసేలా ఏర్పాట్లు చేశారు. సభకు టీపీసీసీ చీఫ్‌  రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ హాజరవుతారు. 

Updated Date - 2022-03-13T09:23:04+05:30 IST