Revanth letter to kcr: మీరు చెప్పే గొప్పల వెనక కార్మికుల కష్టం దాగుంది

ABN , First Publish Date - 2022-09-22T18:03:56+05:30 IST

కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ఆర్టిజన్స్‌గా నియమించకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

Revanth letter to kcr: మీరు చెప్పే గొప్పల వెనక కార్మికుల కష్టం దాగుంది

హైదరాబాద్: కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ఆర్టిజన్స్‌గా నియమించకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) బహిరంగ లేఖ రాశారు. ‘‘మీరు ఇటీవలి కాలంలో విద్యుత్ రంగంపై చెప్పుకుంటున్న గొప్పల వెనుక ఎంతో మంది కార్మికుల కష్టం దాగి ఉంది. వారి శ్రమకు మీ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి మోసం’’ అని మండిపడ్డారు. కేటీపీఎస్(KTPS) 6వ దశ నిర్మాణంలో 2008 నుంచి 2013 వరకు పాలుపంచుకున్న వారిని ఆర్టిజన్స్‌గా నియమించుకుంటామని సంస్థ హామీ ఇచ్చిందని తెలిపారు.  కానీ 6వ దశ నిర్మాణం పూర్తైన్నప్పటికీ ఇంకా వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం క్షమించరాని విషయమని అన్నారు. కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ సమయంలో 6వ దశలో పాలుపంచుకున్న కార్మికులను ఆర్టిజన్స్‌గా తీసుకుంటామని సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు (CMD Devulapalli Prabhakar Rao) రాత పూర్వకంగా హామీ ఇచ్చారని చెప్పారు. 7వ దశ నిర్మాణం సందర్భంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా సీఎండీ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారని టీపీసీసీ చీఫ్(TPCC Chief) గుర్తుచేశారు.


సీఎండీ మాట మీద గౌరవంతో 7వ దశ నిర్మాణానికి కార్మికులు పూర్తిగా సహకరించారన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలిపారన్నారు. ఇదంతా జరిగి ఐదేళ్లు అవుతున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మీరేమో ఇవేమీ పట్టన్నట్లు రాజకీయాలు చేస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటారని మండిపడ్డారు. పాలన ఈ విధంగా ఉంటే  కార్మికుల సమస్యను తీర్చేదెవరని ప్రశ్నించారు. కేటీపీఎస్ 6వ దశ నిర్మాణ సమయంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నా వాటిని లెక్క చేయకుండా పని చేసిన కార్మికుల కష్టాన్ని విస్మరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీఎండీ హామీ ఇచ్చిన విధంగా తక్షణమే కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ఆర్టిజన్స్‌గా నియమించి వారికి ఉద్యోగ భద్రతను కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి(Congress leader)లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-22T18:03:56+05:30 IST