రేపు కృష్ణా బోర్డు, ఎల్లుండి గోదావరి బోర్డు సమావేశం

ABN , First Publish Date - 2020-06-04T00:24:43+05:30 IST

గురువారం కృష్ణా బోర్డు, శుక్రవారం గోదావరి బోర్డు సమావేశం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు జలసౌధలో కృష్ణాబోర్డు సమావేశం అవుతుంది. కృష్ణా బోర్డు భేటీలో ఐదు అంశాలపై చర్చించే అవకాశం ఉందని

రేపు కృష్ణా బోర్డు, ఎల్లుండి గోదావరి బోర్డు సమావేశం

హైదరాబాద్: గురువారం కృష్ణా బోర్డు, శుక్రవారం గోదావరి బోర్డు సమావేశం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు జలసౌధలో కృష్ణాబోర్డు సమావేశం అవుతుంది. కృష్ణా బోర్డు భేటీలో ఐదు అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎల్లుండి జరిగే గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణపై ఏపీ ప్రభుత్వ ఫిర్యాదు మీద చర్చించే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో వేర్వేరుగా రెండు బోర్డులు సమావేశం కానున్నాయి. కృష్ణా బోర్డు గురువారం నాటి సమావేశంలో చర్చించే ఎజెండాను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 


ఏపీ సర్కారు చేపట్టనున్న పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్టులతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు, డిండి వంటి పలు ప్రాజెక్టులపై చర్చిస్తారు. అలాగే నీటి కేటాయింపులు, బడ్జెట్‌ నిధుల విడుదల, టెలీ మెట్రీ యంత్రాల ఏర్పాటు వంటి 7 అంశాలపై చర్చిస్తామని రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు మంగళవారం లేఖ రాసింది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ తెరపైకి రావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. సమావేశంలో చర్చించే ఎజెండాను పంపించాలని రెండు రాష్ట్రాలను బోర్డు గతంలో కోరింది.


గోదావరి నీటి వినియోగంపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ఇరిగేషన్‌ శాఖ అధికారులతో సమీక్షించారు. గోదావరి బోర్డు సమావేశం శుక్రవారం జరగనుంది. ఇందులో తెలంగాణ తరఫున వాదించే అంశాలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. గోదావరి బేసిన్‌లో నిర్మిస్తున్న కాళేశ్వరం, సీతారామ వంటి పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-06-04T00:24:43+05:30 IST