నేడే మహానాడు

ABN , First Publish Date - 2022-05-27T07:57:20+05:30 IST

నేడే మహానాడు

నేడే మహానాడు

సంక్షేమ మోసాలు, బాదుడే బాదుళ్లపై ఫోకస్‌

ఒంగోలులో 2 రోజులపాటు పసుపు పండుగ

తొలి రోజు ప్రతినిధుల సభ.. ఎన్టీఆర్‌ శతజయంతి

సందర్భంగా రెండో రోజు భారీ బహిరంగ సభ

2019 తర్వాత తొలిసారి బహిరంగంగా సభలు


రాష్ట్రం జగన్‌ జాగీరు కాదు

చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం.. కదనోత్సాహంతో తరలి రావాలి

ఎవరు అడ్డుకుంటారో చూస్తాను.. అధినేత చంద్రబాబు హెచ్చరిక

ఎన్టీఆర్‌ విగ్రహానికి నమస్కరించి.. భారీ వాహనాల ర్యాలీతో ఒంగోలుకు

దారంతా జనసునామీ.. రాత్రి 7గంటలకు మహానాడు ప్రాంగణానికి



అమరావతి, ఒంగోలు, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారుతోందని ప్రచారం జరుగుతున్న నేపఽథ్యంలో....ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై మరింత పదునుగా దాడిచేసే వ్యూహంతో మహానాడు సమావేశాలకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతోంది. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు ఆ పార్టీ మహానాడు సమావేశాలు ఒంగోలులో జరగనున్నాయి. మొదటి రోజు ప్రతినిధుల సభతో ప్రారంభించి రెండో రోజు బహిరంగ సభతో ఆ పార్టీ ఈ సమావేశాలను ముగించనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆ పార్టీ తన వార్షిక మహానాడు సమావేశాలు భౌతికంగా నిర్వహించడం ఇదే ప్రఽథమం. గత రెండేళ్లు కరోనా సమస్య ఉండటంతో ఈ సమావేశాలను ఆన్‌లైన్‌లో జరిపారు. ఇప్పుడు నేరుగా ప్రతినిధుల సమావేశాలను నిర్వహిస్తున్నారు. గతంలో మహానాడు మూడురోజులపాటు జరిగేది. ఒంగోలులో వసతి సౌకర్యాల సమస్యలు ఉండటంతో దానిని రెండు రోజులకు కుదించారు. మొదటి రోజు ప్రతినిధుల సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పన్నెండు వేలమందికి ఆహ్వానాలు పంపారు. కానీ హాజరు అంతకంటే కొంత ఎక్కువే ఉండవచ్చన్న అంచనాతో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. రెండో రోజు అదే ప్రాంగణంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. గతంలో మహానాడు సమయంలో బహిరంగ సభల నిర్వహణ ఉండేది కాదు. కానీ ఈసారి పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు రావడంతో ఆ సందర్భంగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నలభయ్యో వార్షికోత్సవం కూడా ఇదే ఏడాది వచ్చింది. పార్టీ నలభై వసంతాల వేడుకలు, ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు కలిపి ఈ ఏడాది పలు కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ తలపెట్టింది. మహానాడులో ఆ దిశగా కొంత మార్గ నిర్దేశం ఉండే అవకాశం ఉంది. 


ఇక క్రియాశీలమే..

మహానాడుకు వివిధ జిల్లాల నుంచి వస్తున్న పార్టీ నేతల్లో జోష్‌ కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత విస్తరిస్తుండటంతో రాష్ట్రంలో మారిన రాజకీయ వాతావరణ ప్రభావం మహానాడులో ప్రతిఫలిస్తుందని టీడీపీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ కొంతకాలంపాటు నిస్తేజంలో కూరుకుపోయింది. ఆ తర్వాత కరోనా కారణంగా రాజకీయ కార్యకలాపాలు కుంటుపడటంతో ఆ పార్టీ నేతలు పెద్దగా బయటకు రాలేదు. ఇటీవలి కాలంలో ఆ స్తబ్దతను వదిలించుకొని వివిధ ప్రజా సమస్యలపై టీడీపీ  క్షేత్రస్థాయిలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను అన్ని వర్గాల్లోకి చేర్చేలా పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చడానికి ఈ సమావేశాల నిర్వహణను ఒక అవకాశంగా తీసుకొని మరింత కదిలించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇదే వ్యూహంతో ఈ సమావేశాల్లో వైసీపీ పాలన తీరుపై బలమైన దాడి జరపాలని ఆ పార్టీ నిర్ణయించింది. సంక్షేమ మోసాలు... బాదుడే బాదుళ్లపై ఆ పార్టీ ఈ సమావేశాల్లో ప్రధాన చర్చ చేపట్టనుంది. తమ సంక్షేమ పధకాలు పేద వర్గాల ప్రజల్లో తమకు బలం పెంచాయని, వారి మద్దతుతో వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామని వైసీపీ నాయకత్వం ఆశిస్తుండటంతో... అదే అంశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి పేద వర్గాల ప్రజల్లోకి ఆ అంశాలను తీసుకువెళ్లి ఆ పార్టీని బలహీనపర్చాలని టీడీపీ భావిస్తోంది. ఈ దృష్టితోనే మోసకారి సంక్షేమం అన్న అంశాన్ని ఈ సమావేశాల్లో ప్రధాన చర్చనీయాంశంగా పెట్టారు. 


ఇది మోసకారి సంక్షేమం.. 

‘ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్న సంక్షేమ పధకాలు రాష్ట్రంలో నాలుగో వంతు మందికి మాత్రమే అందుతున్నాయి. పైగా అనేక కోతలు పెట్టి అర్హులైన అనేక మందికి వాటిని అందకుండా చేస్తున్నారు. నాలుగు పధకాల పేరు చెప్పి గతం నుంచీ అమలవుతున్న నలభై పధకాలను ఎత్తివేశారు. రాజ్యాంగపరంగా లభించిన ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్లు కూడా నిర్వీర్యం అయ్యాయి. సంక్షేమం పేరుతో ప్రభుత్వం ఇస్తోంది పేద వర్గాలకు ఏ మూలకూ చాలడం లేదు. అభివృద్ధి నామమాత్రంగా కూడా లేకపోవడంతో పనులు తగ్గిపోయి పేదలకు ఆదాయం పడిపోయింది. ఇది మోసకారి సంక్షేమం’ అని ఈ అంశంపై ఆ పార్టీ రూపొందించిన తీర్మానం దాడి చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పన్నులు, పెరిగిపోతున్న ధరలపై బాదుడే బాదుడు పేరుతో కూడా ఆ పార్టీ ఈ సమావేశాల్లో చర్చ పెట్టనుంది. కరెంటు చార్జీలు పెంచడం, చెత్త పన్ను విధించడం, ఆస్తి పన్ను విపరీతంగా పెంచడం, ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుల పరిస్థితి దుర్భరం కావడం, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఒక లీటర్‌కు పది రూపాయలు ఎక్కువ ఉండటం వంటి వాటిని ప్రస్తావిస్తూ వైసీపీ పాలనపై ఆ పార్టీ  ధ్వజమెత్తనుంది. ఈ సమావేశాల్లో చర్చనీయాంశాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఒక ఊపు తేవాలని అధినాయకత్వం భావిస్తోంది. మొదటి రోజు ప్రతినిధుల సమావేశాల్లో ఈ చర్చలే ప్రధానంగా ఉంటాయి. 


భారీ వేదిక సిద్ధం

ప్రతినిధుల సభ, బహిరంగసభలు ఒకే ప్రాంగణంలో కావడంతో పదిరోజులుగా అక్కడ రాత్రింబవళ్లు పనిచేసి ఏర్పాట్లు పూర్తిచేశారు. 450 మందికిపైగా నేతలు కూర్చునేందుకు వీలుండే వేదిక, 12వేలమంది ప్రతినిధులు కూర్చునేలా ప్రతినిధుల సభా ప్రాంగణాన్ని జర్మన్‌షెడ్‌తో నిర్మించారు. అందులో 20 ఎల్‌ఈడీలు, ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు. 


ఎన్టీఆర్‌కు నమస్కరించి..

మహానాడు చివరిరోజు, 28వ తేదీన ఉదయం ఒంగోలు అద్దంకి బస్టాండ్‌ సెంటర్లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి ఆయన శత జయంతి ఉత్సవాలను అధినేత చంద్రబాబు ప్రారంభిస్తారు. సాయంత్రం మహానాడు ప్రాంగణంలోనే లక్షమందికిపైగా ప్రజలతో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు.


ఎన్నెస్పీలో బాబుకు బస

ఒంగోలులో బసకు సంబంధించిన వసతి సౌకర్యాలు పరిమితం కావడంతో.. నగరానికి బయట ఎక్కడ వీలుంటే అక్కడ నేతలు తమ బసకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధినేత చంద్రబాబు ఒంగోలులోని ఎన్నెస్పీ అతిథిగృహంలో ఉంటారు. ఆయన కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఎమ్మెల్యే బాలకృష్ణ టంగుటూరులో బస చేస్తారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు ఒంగోలులోని లాడ్జిలు, హోటళ్లలో ఏర్పాట్లు చేసుకున్నారు. 

Updated Date - 2022-05-27T07:57:20+05:30 IST