నేడు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-08-03T05:30:00+05:30 IST

నేడు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్‌ సమావేశం

నేడు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్‌ సమావేశం
హనుమకొండ ఎస్‌బీహెచ్‌ కాలనీలో సగం మునిగిన వాహనాలు (ఫైల్‌)

 పట్టణ ప్రగతి ప్రధాన అంశం

 వరద ముప్పుపై అమలు కాని హామీలు

 ప్రస్తావనే కానీ.. పరిష్కారం లేని సమస్యలు

 గళం విప్పనున్న కార్పొరేటర్లు

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), ఆగస్టు 3 : వరంగల్‌ మహానగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం గురువారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు హనుమకొండలోని బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారు. మేయర్‌ గుండు సుధారాణి అధ్యక్షత వహిస్తారు. పాలకవర్గ, ఎక్స్‌ ఆఫీషియోసభ్యులు హాజరు కానున్నారు. 

పట్టణ ప్రగతి ఎజెండా 

అజెండాలో ప్రధానమైనది పట్టణ ప్రగతి సమస్యలను చర్చించే అంశమే. దీనితో పాటు నగరబాట, డివిజన్లలో వివిధ సమస్యలపై సభ్యులు గళమెత్తనున్నారు. పట్టణ ప్రగతిలో 66 డివిజన్ల నుంచి  6వేలకు పైగా ఫిర్యాదులు ప్రజల నుంచి అందాయి. వీటిలో తాగునీరు, పైప్‌లైన్‌ లీకేజీలు, విద్యుత్‌ స్తంభాలు, అంతర్గత రహదారులు, డ్రెయినేజీలు, పారిశుధ్య తదితర వాటిపై ప్రజలు ప్రజాప్రతినిధులకు నేరుగా సమస్యలను తెలియచేయడంతో పాటు ఫిర్యాదులు కూడా అందచేశారు. ఈ క్రమంలో సర్వ సభ్య సమావేశంలో పట్టణ ప్రగతిపై కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమావేశాలపై గళమెత్తే అవకాశం ఉంది. 

పరిష్కారం లేని సమస్యలు

కౌన్సిల్‌ సమావేశాల్లో రహదారులు, డ్రెయినేజీల నిర్మాణం, మరమ్మతులు, తాగునీటి సరఫరా లోపాలు, మిషన్‌ భగీరథ సమస్యలు, నిధుల కేటాయింపు, అధికారుల నిర్లక్ష్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నప్పటికీ పరిష్కార చర్యలు ఉండడం లేదనేది కార్పొరేటర్లలో గూడుకట్టుకొని ఉన్న నిరాశ. గతంలో డివిజన్‌కు కేటాయించిన రూ.50 లక్షల నిధుల కేటాయింపు పనులే ఎక్కడివి అక్కడే నిలిచాయనే అసంతృప్తితో సభ్యులు ఉన్నారు. 

వరదతో సతమతం

జోరు వర్షం పడితే నగరం నీటిమయం అవుతోంది. రెండు రోజుల కిందట అరగంట సేపు కురిసిన జోరు వర్షంతో ములుగురోడ్డు, ఆర్‌ఈసీ, నక్కలగుట్ట, హనుమకొండ చౌరస్తా తదితర ప్రాంతాల్లో వాహనాలు సగం మునిగే పరిస్థితి ఏర్పడింది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నగరంలోని ముంపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరంగల్‌లోని అనేక ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. వరద ముప్పు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు నేతలు ప్రకటిస్తున్నా కార్యరూపం లేదు. మిషన్‌ భగీరథ అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన పైప్‌లైన్‌ కనెక్షన్లల పనులు పూర్తి కాలేదు. పైప్‌లైన్ల కోసం తవ్విన గుంతల పూడ్చివేత పనులు అసంపూర్ణంగానే మిగిలాయి. వర్షాలతో డివిజన్లలోని రహదారులు, డ్రెయినేజీలు దెబ్బతింటే వాటి మరమ్మతులు చేపట్టడం లేదు. పారిశుధ్య నిర్వహణ గాడి తప్పింది. స్వచ్ఛ ఆటోలు పలు కాలనీల్లోకి రావడం లేదనే ప్రజల ఫిర్యాదులు పట్టించుకోవడం లేదు. 

Updated Date - 2022-08-03T05:30:00+05:30 IST