Abn logo
Apr 20 2021 @ 15:30PM

పాకిస్థాన్‌లో అల్లర్లకు కారణమైన టీఎల్‌పీ చీఫ్ జైలు నుంచి విడుదల

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో అల్లర్లు, హింసకు కారణమైన తెహ్రీక్-ఐ-లబైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్వీ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే రిజ్వీ యతీమ్ ఖానా చౌక్‌కు బయలుదేరారు. మహ్మద్ ప్రవక్త కార్టూన్‌ను ప్రచురించి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారంటూ ఫ్రాన్స్‌పై పాకిస్థాన్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.


దేశం నుంచి ఆ దేశ రాయబారులను నిషేధించాలంటూ టీఎల్‌పీ చీఫ్ రిజ్వీ ఇమ్రాన్ ప్రభుత్వానికి ఈ నెల 20 వరకు గడువిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్‌కు నిరసనగా పాక్ భగ్గుమంది. టీఎల్‌పీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో పలువురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. 


తాజాగా నేడు లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు నుంచి విడుదలైన రిజ్వీ ఆ వెంటనే యతీమ్ ఖన్నా చౌక్‌కు బయలుదేరారు. అక్కడ ఆయన మద్దతుదారుల నుంచి ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఫ్రెంచ్ రాయబారులను దేశం నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ నేపథ్యంలో నేడు పాక్ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించనున్నారు.  ఈ నేపథ్యంలో రిజ్వీ విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
Advertisement
Advertisement