Kuwait లో ఏజెంట్ల చేతిలో మోసపోయి బందీ అయిన తెలుగు మహిళ.. కాపాడి స్వదేశానికి పంపించిన Indian Embassy

ABN , First Publish Date - 2022-06-03T16:15:53+05:30 IST

కువైత్‌లో వీసా ఏజెంట్ల చేతిలో మోసపోయి చిత్రహింసలకు గురైన తెలుగు మహిళ శ్రావణి అక్కడి భారత ఎంబసీ సహాయంతో బుధవారం సురక్షితంగా స్వదేశానికి చేరుకుంది.

Kuwait లో ఏజెంట్ల చేతిలో మోసపోయి బందీ అయిన తెలుగు మహిళ.. కాపాడి స్వదేశానికి పంపించిన Indian Embassy

ఎన్నారై డెస్క్: కువైత్‌లో వీసా ఏజెంట్ల చేతిలో మోసపోయి చిత్రహింసలకు గురైన తెలుగు మహిళ శ్రావణి అక్కడి భారత ఎంబసీ సహాయంతో బుధవారం సురక్షితంగా స్వదేశానికి చేరుకుంది. వీసా ఏజెంట్లు ఆమెను ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. దాంతో ఆమె ఓ వీడియో తీసి భర్తకు పంపించింది. ఆ వీడియో వైరల్ కావడంతో విషయం బయటకు వచ్చింది. అనంతరం ఈ వార్త మీడియాలో రావడంతో కువైత్‌లోని భారత ఎంబసీ అధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో ఆమె పంపిన వీడియో ఆధారంగా అధికారులు శ్రావణి కోసం వెతికారు. ఎలాగోలా ఆమెను బంధించిన చోటును కనిపెట్టిన అధికారులు శ్రావణిని విడిపించి అక్కడి నుంచి ఎంబసీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాతి రోజు భారత్‌కు పంపించారు. దీంతో శ్రావణి బుధవారం రాత్రి స్వస్థలం తిరుపతికి చేరుకుంది. తిరుపతి చేరుకున్న శ్రావణి భర్తతో కలిసి ఇంటికి వెళ్లినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా ఎంబసీ అధికారులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది.   


అసలేం జరిగిందంటే..

తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్లపల్లె పంచాయతీకి చెందిన శ్రావణి(26) మే 24న కువైత్‌ వెళ్లింది. చెంగల్‌ రాజు అనే ఏజెంట్‌ ఆమె గల్ఫ్‌ చేరేందుకు సహకరించాడు. అక్కడికెళ్లాక ఓ ఇంట్లో పనికి కుదిర్చారు. అక్కడ బాగోలేకపోవడంతో ఇల్లు మార్చమని ఆమె కోరింది. ఏజెంట్‌ చెంగల్‌రాజు, అతడి మిత్రుడు బావాజీ ఇదే అదునుగా ఆమెను అక్కడ ఓ గదిలో బంధించారు. తమ కోరిక తీరిస్తేనే ఇంకో ఇంట్లో పనికి కుదురుస్తామని హింసించారు. నాలుగు రోజులుగా తిండి కూడా పెట్టకుండా నీళ్లు మాత్రమే ఇస్తున్నారని బాధితురాలు భోరున విలపించింది. తిరుపతిలోని తన భర్తకు వీడియో పంపింది. తనను ఎలాగైనా తిరుపతికి తీసుకొచ్చేయమని వేడుకుంది. ఈ విషయమై బాధితురాలి భర్త పోలీసులను ఆశ్రయించడంతో పాటు వీడియో బయటకు రావడంతో తరువాతి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాంతో ఈ విషయం కువైత్‌లోని భారత ఎంబసీ దృష్టికి వెళ్లడం, ఆమెను కనిపెట్టి ఏజెంట్ల చెర నుంచి విడిపించడం జరిగింది. ఇదిలాఉంటే.. కువైత్‌లోని భారత ప్రవాసులు వారికి సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని రాయబార కార్యాలయం ప్రత్యేకంగా 11 వాట్సాప్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో వీటి ద్వారా ఎంబసీ అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపింది.    



Updated Date - 2022-06-03T16:15:53+05:30 IST