APSRTC ఆదాయంలో తిరుపతి జిల్లా టాప్‌

ABN , First Publish Date - 2022-05-15T11:41:52+05:30 IST

ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆదాయంలో తిరుపతి టాప్‌లో

APSRTC ఆదాయంలో తిరుపతి జిల్లా టాప్‌

  • 40 రోజుల్లో రూ.60.48కోట్లు


తిరుపతి(కొర్లగుంట) : ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆదాయంలో తిరుపతి టాప్‌లో నిలిచింది. 40 రోజుల్లో రూ.60.48 కోట్లు వచ్చినట్లు జిల్లా ప్రజారావాణాధికారులు తెలిపారు. జిల్లాల విభజన తర్వాత తిరుపతి జిల్లాకు 11డిపోలు, 838 బస్సులను కేటాయించారు. ఇందులో సిటీ ఆర్డినరీ 12, పల్లె వెలుగు 221, హయ్యర్‌ 49, అల్ర్టా పల్లె వెలుగు 13, ఎక్స్‌ప్రె‌స్‌లు 127, సూపర్‌లగ్జరీ 53, అల్ర్టా డీలక్స్‌ 15, అమరావతి 12, గరుడ 4, డాల్ఫిన్‌క్రూజ్‌ 2, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ 300, వెన్నెల 2, ఇంద్ర 8, మెట్రోఎక్స్‌ప్రెస్‌ 20 బస్సులు ఉన్నాయి. గతనెల 4న ఆర్టీసీని విభజించారు. అప్పటి నుంచి శుక్రవారం వరకు అంటే 40రోజుల్లో రూ.60.48 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు.  తిరుమల, తిరుపతి మధ్య ప్ర యాణించే భక్తులు సంఖ్య ఎక్కువగా ఉండటంతోపాటు రెండేళ్ల తర్వాత శ్రీవారి దర్శనాలను పూర్తిస్థాయిలో పునఃప్రారంభించడం తదితర కారణాలతో తిరుమల, తిరుపతి, మంగళం, అలిపిరి డిపోల బస్సులు కళకళలాడాయి. అందువల్లే ఇతర జిల్లాల కంటే అధికంగా ఆదాయం లభించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.


టార్గెట్‌ ప్రకారం 40రోజులకు 

133.2లక్షల కిలోమీటర్లు, ఆదాయం రూ.63.2 కోట్లు, ఈపీకే రూ.46, ఓఆర్‌ 73 శాతంగా నిర్ణయించారు. దీనికిగాను అన్నిరకాల బస్సులు 131.17లక్షల కిలోమీటర్లు రాకపోకలు సాగించడంతో రూ.60.48కోట్ల ఆదాయం సమకూరింది. ఈపీకే దాదాపు రూ.45.55, ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) దాదాపు 70శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-15T11:41:52+05:30 IST