Tirupati లో కలెక్టరేట్ కార్యాలయం ఇక్కడే.. ఇక రాజసమే..!

ABN , First Publish Date - 2022-02-15T12:15:10+05:30 IST

ఉగాది నుంచీ కొత్తగా రూపుదిద్దుకోనున్న తిరుపతి బాలాజీ జిల్లాకు తాత్కాలికంగా

Tirupati లో కలెక్టరేట్ కార్యాలయం ఇక్కడే.. ఇక రాజసమే..!

  • శాశ్వత భవనం వచ్చేవరకూ తాత్కాలిక ఏర్పాటు
  • అధికారుల ప్రతిపాదనలకు ప్రభుత్వ అంగీకారం
  • లీజు ప్రాతిపదికన భవనం అప్పగించే అవకాశం

చిత్తూరు జిల్లా/తిరుపతి : ఉగాది నుంచీ కొత్తగా రూపుదిద్దుకోనున్న తిరుపతి బాలాజీ జిల్లాకు తాత్కాలికంగా పద్మావతీ నిలయం కలెక్టరేట్‌ కానుంది. శాశ్వత భవన వసతి సమకూరే వరకూ బాలాజీ జిల్లా కలెక్టరేట్‌ పద్మావతీ నిలయంలోనే కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న 13 జిల్లాలను విభజించి మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల జాబితాలో తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా కూడా చోటుచేసుకుంది. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడులతో పాటు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకి రానున్నాయి. ఇప్పటి వరకూ రెవిన్యూ డివిజన్‌ కేంద్రంగా వున్న తిరుపతిలో నిజానికి కలెక్టరేట్‌, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రభుత్వ భవనాలు గానీ, ప్రాంగణాలు గానీ అందుబాటులో లేవు. 


దీనికోసం తాత్కాలికంగా ప్రైవేటు లేదా వివిధ సంస్థల భవనాలను ఉపయోగించుకోవాలని, ఆలోగా శాశ్వత భవనాలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నుంచీ మార్గదర్శకాలు అందాయి. దానికనుగుణంగా అధికారులు మహిళా విశ్వ విద్యాలయం, అగ్రికల్చర్‌ యూనివర్శిటీ కాలేజీ భవనాలతో పాటు తిరుచానూరు సమీపంలోని టీటీడీకి చెందిన పద్మావతీ నిలయాన్ని కూడా పరిశీలించారు. ఈ మూడింటిలో పద్మావతీ నిలయం జాతీయ రహదారి పక్కన వుండడం, వాహనాల పార్కింగ్‌కు విశాలమైన ప్రాంగణం వుండడం, వివిధ శాఖల కార్యాలయాలకు అవసరమైనన్ని గదులు అందుబాటులో వుండడం వంటి కారణాలతో అధికారులు దానివైపే మొగ్గు చూపారు. ప్రజల రాకపోకలకు కూడా అనువుగా వుంటుందని భావిస్తున్నారు.


ఈ మేరకు పద్మావతీ నిలయం అనుకూలంగా వుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు పద్మావతీ నిలయాన్ని కలెక్టరేట్‌ కోసం లీజు ప్రాతిపదికన తాత్కాలికంగా కేటాయించాలంటూ టీటీడీకి సూచించింది. ఉగాది రోజున కొత్త జిల్లాలు ఏర్పాటై పాలన ప్రారంభం కావాల్సి వున్నందున ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయడం కోసం మార్చి 1వ తేదీకే పద్మావతీ నిలయాన్ని టీటీడీ ప్రభుత్వానికి అప్పగించనున్నట్టు తెలిసింది. శ్రీవారి, అమ్మవారి దర్శనార్థమై వచ్చే యాత్రికులకు బస కోసం ఉద్దేశించిన పద్మావతీ నిలయాన్ని ఏ ముహూర్తాన నిర్మించారో గానీ లక్ష్యం నెరవేరడం లేదు. నిర్మా ణం పూర్తయ్యాక ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరలేదు. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.


పర్యాటక శాఖకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. ఆలోపు కరోనా వైరస్‌ సంక్షోభం సృష్టించడంతో కొవిడ్‌ బాధితులకు ఐసొలేషన్‌ కేంద్రంగా మారింది. మరో సందర్భంలో రాయలచెరువు కట్ట తెగిపోయే ప్రమాదం తలెత్తడంతో ఆ ప్రాంతవాసులకు పునరావాస కేంద్రంగానూ మారింది. ఇపుడు తాత్కాలిక కలెక్టరేట్‌ కాబోతోంది. శాశ్వత భవనాల నిర్మాణం ఎప్పుడు జరుగుతుందో అంతుబట్టని పరిస్థితుల్లో ఎప్పటికి తిరిగి టీటీడీకి స్వాధీనమవుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే ఏమాటకామాట చెప్పాలంటే మాత్రం కొత్తగా ఏర్పాటు కానున్న 13 జిల్లాల్లోకీ తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టరేట్‌ భవనంగా పద్మావతీ నిలయం రాజసం         ప్రదర్శించనుంది.

Updated Date - 2022-02-15T12:15:10+05:30 IST