టైగర్‌ టెర్రర్‌

ABN , First Publish Date - 2022-07-14T01:55:55+05:30 IST

జిల్లావాసులను హడలెత్తిస్తున్న పెద్దపులి వరుసగా రెండో రోజు కూడా పశువులపై దాడి చేసింది. సబ్బవరం మండలంలో ఒక ఆవు

టైగర్‌ టెర్రర్‌

చోడవరం: జిల్లావాసులను హడలెత్తిస్తున్న పెద్దపులి వరుసగా రెండో రోజు కూడా పశువులపై దాడి చేసింది. సబ్బవరం మండలంలో ఒక ఆవు, చోడవరం మండలంలో రెండు గేదె పెయ్యిలను చంపేసింది. ఘటనా స్థలాలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు మంగళవారం అర్ధరాత్రి తరువాత, బుధవారం తెల్లవారుజామున పులి దాడి చేసినట్టు గుర్తించారు. సుమారు రెండు వారాల క్రితం కాకినాడ జిల్లాలో నుంచి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి నక్కపల్లి, కోటవురట్ల, ఎలమంచిలి, కశింకోట, అనకాపల్లి మండలాల్లోని రిజర్వు ఫారెస్టు మీదుగా ప్రయాణిస్తూ రెండు రోజుల క్రితం సబ్బవరం, చోడవరం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. సోమవారం సాయంత్రం సబ్బవరం మండలం నారపాడు సమీపంలోని కొండప్రాంతంలో రెండు మేకలను, అర్ధరాత్రి దాటిన తరువాత చోడవరం మండలం గంధవరంలో ఒక గేదె పెయ్యిను చంపేసింది.


దీంతో అటవీ శాఖ అధికారులు ఇక్కడ రెండు గేదె పెయ్యిలను పశువులశాల వద్ద ఎరగా ఉంచి, మరో పెయిని బోనులో ఉంచారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తరువాత ఇక్కడకు వచ్చిన పులి.. బయట కట్టేసి ఉంచిన రెండు పెయ్యిలపై దాడి చేసి చంపేసింది. బోనులో ఉన్న పెయ్యి జోలికి వెళ్లలేదు. ఇది జరిగిన రెండు గంటల తరవాత ఇక్కడకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సబ్బవరం మండలం  గాలిభీమవరం శివారు పల్లవానిపాలెంలోని ఒక పశువులశాలలో అవుపై దాడి చేసి చంపేసి, పక్కనే ఉన్న గోతిలోకి ఈడ్చుకుపోయి వదిలేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు.

Updated Date - 2022-07-14T01:55:55+05:30 IST