మరో ప్రాణం తీసిన పెద్దపులి

ABN , First Publish Date - 2020-11-30T10:29:54+05:30 IST

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి మళ్లీ పంజా విసిరింది. కొద్ది రోజుల కిందట యువకుడ్ని చంపిన పులి.. తాజాగా మరో బాలికను

మరో ప్రాణం తీసిన పెద్దపులి

చేనులో పత్తి తీస్తున్న బాలికపై దాడి

కుమ్రంభీం జిల్లా కొండపెల్లిలో ఘటన

కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలే!

భయంతో వణికిపోతున్న సమీప గ్రామస్థులు


పెంచికలపేట/బెజ్జూరు, నవంబరు 29: కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి మళ్లీ పంజా విసిరింది. కొద్ది రోజుల కిందట యువకుడ్ని చంపిన పులి.. తాజాగా మరో బాలికను పొట్టనపెట్టుకుంది. పెంచికలపేట మండలం కొండపెల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం చేనులో పత్తి తీస్తున్న పసుల నిర్మల (15)పై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. నిర్మల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే చేనులోకి ఆరుగురు కూలీలతో కలిసి పత్తి తీసేందుకు వెళ్లింది. నిర్మల మిగతా వారికి దూరంగా ఉన్న పాయలో పత్తి తీస్తుండగా ఒక్కసారిగా పులి దాడి చేసి ఆమెను ఈడ్చుకెళ్లింది. బాధితురాలి అరుపులు విని మిగతా కూలీలు భయపడ్డారు. వారిలో కొందరు కర్రలు తీసుకుని పులి వెంట పరుగెత్తారు. దీంతో పులి నిర్మలను వదిలేసి కొంతదూరం వెళ్లింది. అప్పటికే ఆమె మృతి చెందింది. తోటి కూలీలు ఆమె మృతదేహాన్ని తీసుకొస్తుండగా పులి మళ్లీ వారి వెంట పడింది.


చుట్టుపక్కల చేలలో పని చేస్తున్న వారు కూడా అక్కడికి వచ్చి అరుస్తూ, దానిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. జిల్లా అటవీ అధికారి శాంతారామ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకొని, బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం దహెగాం మండలం దిగిడకు చెందిన విఘ్నేశ్‌ను పులి చంపిన విషయం తెలిసిందే. 


కాపాడేందుకు ప్రయత్నించా..

‘‘మధ్యాహ్నం ఒక్కసారిగా నిర్మలపై పులి దాడి చేసి అడవిలోకి పట్టుకెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటనే నేను కర్రలతో, బండరాళ్లతో పులిని కొడుతూ కేకలు వేస్తూ నిర్మలను కాపాడేందుకు ప్రయత్నించా. తోటి కూలీలు కూడా కేకలు వేస్తూ వచ్చారు. దాంతో పులి నిర్మలను వదిలి వెళ్లింది. ఆమె మృతదేహాన్ని తీసుకొస్తుండగా పులి మళ్లీ దాడి చేయబోయింది. అందరం గట్టిగా అరవడంతో అడవిలోకి వెళ్లిపోయింది’’ అని ప్రత్యక్ష సాక్షి చక్రవర్తి అన్నారు. నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళుతుండగా బెజ్జూరు మండలం గొల్లదేవర సమీపంలో అంబులెన్స్‌కు అడ్డుగా పులి వచ్చింది. రోడ్డుపై పులిని చూసి వాహనాన్ని నిలిపివేసినట్లు అంబులెన్స్‌ డ్రైవర్‌ గణేష్‌ చెప్పాడు. తర్వాత పులి అడవిలోకి వెళ్లిందన్నాడు. 


మేకలపై చిరుత దాడి

బాన్సువాడ (ఎల్లారెడ్డి), నవంబరు 29: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట శివారులో మేకల మందపై చిరుత దాడి చేసింది. ఆదివారం మధ్యాహ్నం ఓ మేకను చంపి తినేసింది. దీంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. గతంలో కూడా మేకల మందపై, పశువులపై చిరుత దాడి చేసిందని చెప్పారు. అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2020-11-30T10:29:54+05:30 IST