Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 03:18AM

చెట్టును ఢీకొన్న కారు ముగ్గురు తోబుట్టువుల బలి!

  • వాహన డ్రైవరూ దుర్మరణం.. చావుబతుకుల్లో మృతుల సోదరి భర్త 
  • కరీంనగర్‌ జిల్లాలో విషాదం
  • ఎవ్వరూ గమనించకపోవడంతో 3 గంటలపాటు కారులోనే
  • వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి


కరీంనగర్‌ క్రైం/మానకొండూర్‌, శంకరపట్నం, హుజూరాబాద్‌, నవంబరు 26: ఆ ఇంట్లో మాటలకు అందని విషాదం. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు. వారి సోదరి భర్త తీవ్రగాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్‌ కూడా దుర్మరణం పాలయ్యాడు. తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రమాదం జరగడం.. ఆ సమయంలో ఎవ్వరూ గమనించకపోవడంతో బాధితులు తీవ్రగాయాలతో దాదాపు మూడు గంటలపాటు కారులోనే ఇరుక్కుపోయి నరకం అనుభవించారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ పోలీ్‌సస్టేషన్‌ సమీపంలో కరీంనగర్‌-వరంగల్‌ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. కొప్పుల శ్రీపాద రావు, కొప్పుల శ్రీనివాసరావు(58), కొప్పుల బాలాజీ శ్రీధర్‌ (55), కొప్పుల శ్రీరాజ్‌(53) అన్నదమ్ములు. వీరి స్వస్థలం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్‌. శ్రీపాదరావు రత్నాపూర్‌లోనే ఉంటుండగా.. శ్రీనివాసరావు, బాలాజీ శ్రీధర్‌ కరీంనగర్‌లో.. శ్రీరాజ్‌ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరి మేనమామ, ఖమ్మం జిల్లా కల్లూరులో ఉంటున్న లక్కినేని సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కర్మకాండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శ్రీనివాసరావు, బాలాజీ శ్రీధర్‌, శ్రీరాజ్‌.. వీరి సోదరి భర్త కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూర్‌కు చెందిన పెంచాల సుధాకర్‌ రావు కలిసి గురువారం ఉదయం కారులో కల్లూరుకు బయలుదేరారు. 


వాహనాన్ని నడిపేందుకు సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన ఇందూరి జితేందర్‌ (28)ను మాట్లాడుకున్నారు. కార్యక్రమానికి హాజరైన అనంతరం ఐదుగురూ రాత్రి 10:30కు కరీంనగర్‌కు తిరగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు, మానకొండూర్‌ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు, బాలాజీ శ్రీధర్‌, శ్రీరాజ్‌, డ్రైవర్‌ జితేందర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలపాలైన సుధాకర్‌ రావును కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఎవరైనా గమనించి ఉంటే బతికేవారని..  తీవ్ర రక్తస్రావం జరగడం, మూడు గంటలపాటు కారులోనే చిక్కుకుపోవడంతో మృతిచెందారని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.  ప్రమాదం జరిగిన సమయంలో గంటలకు 120 కిలోమీటర్ల కంటే వేగంతో కారు వెళ్లిందని భావిస్తున్నారు. కాగా కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌ వద్ద ప్యాసింజర్‌ ఆటో, ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ప్యాసింజర్‌ ఆటోలో ప్రయాణిస్తున్న జగన్‌ (36) అనే వ్యక్తి మృతిచెందాడు. ఇదే జిల్లా హుజూరాబాద్‌ జమ్మికుంట వద్ద ఓ ట్రాలీ ఆటో ఢీకొనడంతో సైకిల్‌పై ప్రయాణిస్తున్న మునీరుద్దీన్‌ (70) అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. 


కారులో స్థలం లేకపోవడంతో 

ముగ్గురు మృతుల తోబుట్టువు శ్రీపాద రావు, వాస్తవానికి సోదరులతో పాటే కరీంనగర్‌కు బయలుదేరాల్సింది. ఆయన రత్నాపూర్‌ నుంచి రైల్లో కల్లూరుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కరీంనగర్‌ వరకు కారులో బయలుదేరాలని అనుకున్నా వాహనంలో అప్పటికే ఐదుగురు ఉండటం, తనకు చోటు లేకపోవడంతో అక్కడే ఉండిపోయారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పిందని బంధువులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement