ఒకే ఇంట్లో... ముగ్గురు ప్రాణదాతలు!

ABN , First Publish Date - 2020-04-09T05:30:00+05:30 IST

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్‌ సోకుతుందని వారికి తెలుసు. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా, కరోనా బాధితుల ప్రాణాలు దక్కవనీ తెలుసు. కాబట్టే తమ వైద్య అనుభవాన్నీ, నైపుణ్యాన్నీ రంగరించి కరోనా బాధితులకు సమర్థమైన చికిత్సను అందిస్తూ...

ఒకే ఇంట్లో... ముగ్గురు ప్రాణదాతలు!

  • ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్‌ సోకుతుందని వారికి తెలుసు. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా, కరోనా బాధితుల ప్రాణాలు దక్కవనీ తెలుసు. కాబట్టే తమ వైద్య అనుభవాన్నీ, నైపుణ్యాన్నీ రంగరించి కరోనా బాధితులకు సమర్థమైన చికిత్సను అందిస్తూ ఉంటారు వైద్యులు. ఈ కోవకు చెందిన వైద్యులందరిలో ఓ వైద్య కుటుంబం ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, కూతురు... ముగ్గురూ వైద్యులే కావడం విశేషం. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయడం, వారితో ఐసొలేషన్‌ వార్డ్‌లో గంటల తరబడి గడపడం సాహసమే అని తెలిసినా ‘వృత్తిలో ఇదంతా భాగమే’ అని భయాందోళనలను ఒకింత తేలికపరిచే ప్రయత్నం చేసింది డాక్టర్‌ మహమూద్‌ ఖాన్‌ వైద్య కుటుంబం. కరోనా సేవలో అహో రాత్రులు శ్రమిస్తున్న ఆ వైద్య కుటుంబం అంతరంగం వారి మాటల్లోనే...


ఏకంగా ఆరు గంటల పాటు...

కరోనా వైరస్‌ ఎంత తేలికగా సోకుతుందో అందరికీ తెలిసిందే! కాబట్టే మేం చికిత్స సమయంలో పి.పి.ఇ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) తప్పనిసరిగా ధరిస్తాం. ఈ దుస్తులు ధరించడం, తొలగించడం పెద్ద ప్రక్రియ. వేసుకున్న దుస్తుల మీద డాక్టర్‌ గౌను ధరించి, దాని మీద పి.పి.ఇ దుస్తులు ధరించాలి. ఈ దుస్తుల్లో భాగంగా...తల నుంచి పాదాల వరకూ గౌను, గ్లాసులు, చేతి తొడుగులు... అన్నీ ఉంటాయి. ఇన్ని వరుసల దుస్తుల వల్ల ఉక్కపోత భరించక తప్పదు. ఒకసారి ఈ దుస్తులు ధరిస్తే మంచినీళ్లు తాగే వీలు కూడా ఉండదు. ఈ దుస్తులు ధరించి ఐసొలేషన్‌ వార్డులోకి అడుగు పెడితే, అక్కడే కనీసం ఆరు గంటలు గడపవలసి ఉంటుంది. అంతసేపూ రోగుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన చికిత్స అందించవలసి ఉంటుంది. విధులు ముగిసిన తర్వాత పి.పి.ఇ దుస్తులను జాగ్రత్తగా తొలగించి, డిస్పోజబుల్‌ డబ్బాలో వేసేయాలి. ఒకసారి వాడిన ఈ దుస్తులను తిరిగి వాడకూడదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత వైరస్‌ కుటుంబసభ్యులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు. ఇందుకోసం ఇంటి బయటే ముఖం, కాళ్లూ, చేతులూ శుభ్రంగా కడుక్కుని ఇంట్లోకి అడుగుపెడుతూ ఉంటాం. వైరస్‌ నుంచి రక్షణ కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. 

- డాక్టర్‌ మహమూద్‌ ఖాన్‌, ఛాతీ వైద్య నిపుణులు, 

సూపరింటెండెంట్‌, చెస్ట్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌



అన్ని గంటలు భరించక తప్పదు!

నేను గాంధీ ఆస్పత్రిలో డెర్మటాలజిస్ట్‌గా పని చేస్తున్నా. తాజాగా ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా వార్డ్‌లో రోగులకు సేవలు అందించే విధులు చేపట్టాను. ఐసొలేషన్‌ వార్డుకు వెళ్లి, రోగులకు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించడంతో పాటు, చికిత్సను పర్యవేక్షించడం నా బాధ్యత. కరోనా వైరస్‌ సోకుతుందేమో అనే భయం వైద్యులమైన మాకూ ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా, మనసు లోపల ఏదో ఓ మూల అనుమానం వేధిస్తూ ఉంటుంది. అయినా వైద్యులుగా విధులు నిర్వర్తించక తప్పదు. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాను.


అన్నిటికంటే కష్టమైన పని పి.పి.ఇ దుస్తుల్లో గంటల తరబడి ఐసొలేషన్‌ వార్డులో గడపడం. ఈ దుస్తులు ఒకసారి ఽధరిస్తే షిఫ్ట్‌ ముగిసేవరకూ కనీసం నీళ్లు తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికీ వీలు ఉండదు. ఒకవేళ అత్యవసరమై దుస్తులు తొలగించవలసివస్తే, తిరిగి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుని, కొత్త పి.పి.ఇ దుస్తులు ధరించవలసి ఉంటుంది. ఈ దుస్తులు మార్చుకోవడం కోసం ఐసొలేషన్‌ వార్డుకు ఆనుకుని ఓ గది కేటాయించారు. దాన్లోనే దుస్తులు ధరించాలి, డ్యూటీ పూర్తయిన తర్వాత డిస్పోజబుల్‌ బ్యాగులో వేసేయాలి.  ఇంట్లో కూడా తొలగించిన దుస్తులను వేడినీళ్లలో వేసి శుభ్రం చేస్తాను. స్నానం తర్వాత కుటుంబసభ్యులను కలిసినా, దూరం పాటిస్తున్నాను. కలిసి మాట్లాడుకున్నా, భోజనం చేసినా కుటుంబసభ్యుల మధ్య దూరం తప్పనిసరి. అలాగే మా వారూ, పాప, నేనూ, మా అబ్బాయి, మా అత్తగారు... అందరం వేర్వేరు గదుల్లో పడుకుంటాం. కరోనా వైరస్‌ సోకకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. 

- డాక్డర్‌ షహానా ఖాన్‌, డర్మటాలజిస్ట్‌, గాంధీ హాస్పిటల్‌



నానమ్మ గురించే బెంగంతా!

నేను గాంధీ మెడికల్‌ కాలేజీ స్టూడెంట్‌ను. అయితే ప్రస్తుతం ఫీవర్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ - 19 విధుల్లో పాలుపంచుకుంటున్నాను. ఇది వైద్య విద్య తదనంతరం నేను చేపట్టిన మొట్టమొదటి వృత్తి. ఓ.పితో పాటు ఐసొలేషన్‌ వార్డు, స్ర్కీనింగ్‌ డెస్క్‌... ఇలా వంతుల వారీగా ఈ మూడు విధులూ నిర్వహిస్తున్నాను. అయినా ఈ బాధ్యతను సవాలుగా తీసుకున్నాను. నేను ఆస్పత్రిలో స్ర్కీనింగ్‌ డెస్క్‌ దగ్గర కూర్చుంటాను. అక్కడికి వచ్చే రోగుల్లో ఎవరికి కరోనా ఉందో తెలియదు. వారి నుంచి తర్వాతి పేషెంట్లకు కరోనా సోకే వీలు లేకుండా, ప్రతి కేసుకూ పెన్నును కూడా స్టెరిలైజ్‌ చేస్తూ ఉంటాను.


రోగిని తాకవలసివస్తే, చేతి తొడుగులూ మార్చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వైద్యులు కరోనా రోగులకు చికిత్స చేసే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా ఇక్కడా జరగవచ్చు. వైద్యులుగా మేం మా ప్రాణాలతో పాటు, మా కుటుంబసభ్యుల ప్రాణాలూ ఫణంగా పెడుతున్నాం విధులు పూర్తి అయిన తర్వాత నేరుగా ఇంటికే వెళ్తున్నాం. సాధారణ ప్రజలతో పోలిస్తే, వైరస్‌ సోకే అవకాశాలు మాకు, మా కుటుంబసభ్యులకే ఎక్కువ. మా ఇంట్లో మాతో పాటు, మా నానమ్మ కూడా ఉంటారు. అమ్మ, నాన్న, నేను ముగ్గురం కరోనా విధుల్లో ఉన్నాం కాబట్టి, ఇంట్లో రెట్టింపు జాగ్రత్తలు తీసుకుంటాం. నాన్నమ్మకు ప్రత్యేక గది కేటాయించాం. ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నా, అందరం దూరం పాటిస్తున్నాం. 

- రషికా ఖాన్‌, వైద్య విద్యార్థి, 

గాంధీ హాస్పిటల్‌

-గోగుమళ్ల కవిత


Updated Date - 2020-04-09T05:30:00+05:30 IST