నిజామాబాద్‌లో పీఎఫ్‌ఐకి చెందిన మరో ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2022-07-07T08:16:07+05:30 IST

దేశంలో మత ఘర్షణలు జరిపేందుకు శిక్షణ ఇస్తున్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ)కు చెందిన మరో ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్టు నిజామాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌ నాగరాజు తెలిపారు.

నిజామాబాద్‌లో పీఎఫ్‌ఐకి చెందిన మరో ముగ్గురి అరెస్టు

  • మరికొంతమందిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు... 
  • జార్ఖండ్‌, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ పీఎ్‌ఫఐ కార్యకలాపాలు 
  • పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే బయటపడింది
  • నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కేఆర్‌. నాగరాజు వెల్లడి


నిజామాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో మత ఘర్షణలు జరిపేందుకు శిక్షణ ఇస్తున్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ)కు చెందిన మరో ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్టు నిజామాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌ నాగరాజు తెలిపారు. గత సోమవారం ఒకరిని, బుధవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. బుధవారం సాయంత్రం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. పీఎఫ్‌ఐ సంస్థ దేశంలో అతివాద కార్యక్రమాలకు పాల్పడుతోందని, లౌకిక శక్తులను నాశనం చేసి షరియత్‌ వ్యవస్థను స్థాపించాలన్న ఉద్దేశంతో ఈ శిక్షణ కొనసాగిస్తోందని తెలిపారు. నిజామాబాద్‌ కేంద్రంగా గడిచిన రెండు నెలలుగా పీఎ్‌ఫఐ కార్యకలాపాలు నిర్వహిస్తోందని  వెల్లడించారు. ఏమీ తెలియని అమాయక యువకులను తమవైపు తిప్పుకునేందుకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. ‘సిమీ’కి చెందిన కొంతమంది ఆక్టివి్‌స్టలు పీఎ్‌ఫఐని ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ సంస్థలో అత్యంత కఠోర శిక్షణ పొందినవారిలో కీలకంగా ఉన్న మరో 26మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు చెప్పారు. 


వీరేకాకుండా శిక్షణ పొందిన మిగతా 200ల మందిలో వారికి ఏ రకమైన శిక్షణ ఇచ్చారు? వారు ఎక్కడ ఉన్నారో ఆ వివరాలు సేకరిస్తున్నామని  వివరించారు. నిజామాబాద్‌, అదిలాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌తో పాటు ఏపీలోని కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారికి నిర్వాహకులు శిక్షణ ఇచ్చారని తెలిపారు. పీఎ్‌ఫఐకి చెందిన శిక్షణ ఇన్‌చార్జ్‌ అబ్దుల్‌ ఖాదర్‌ నిజామాబాద్‌లోని ఆటోనగర్‌లో ఇల్లు కట్టుకుని యువతకు శిక్షణను కొనసాగిస్తున్నాడని వెల్లడించారు. నిజామాబాద్‌తో పాటు వరంగల్‌లో కూడా యువతకు అబ్దుల్‌ ఖాదర్‌ శిక్షణ ఇచ్చారని చెప్పారు. జార్ఖండ్‌, కేరళ, ఇతర రాష్ట్రాల్లోనూ పీఎ్‌ఫఐ కార్యకలాపాలు నిర్వహిస్తోందని వెల్లడించారు. పీఎ్‌ఫఐకి చెందిన శిక్షణ ఇన్‌చార్జ్‌ అబ్దుల్‌ ఖాదర్‌ను రెండు రోజుల క్రితం అరెస్టు చేశామని.. బుధవారం షేక్‌ షాదుల్లా, మహ్మద్‌ ఇమ్రాన్‌, మహ్మద్‌ అబ్దుల్‌మోబిన్‌లను అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే ఈ సంస్థ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినట్టు సీపీ తెలిపారు. 


మజ్లిస్‌ సహకారంతోనే: అర్వింద్‌ 

 కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతోనే పీఎ్‌ఫఐ కుట్ర బయటపడిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించిన తర్వాతే జిల్లా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారని పేర్కొన్నారు. మజ్లిస్‌ సహకారంతోనే ఉగ్రవాద మూలాలున్న ఈ సంస్థలు శిక్షణ ఇస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి శిక్షణలు జరుగుతున్నాయన్నారు. ఈ శిక్షణ పొందిన 200మందిని ఎప్పుడు పట్టుకుంటారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ శ్రేణుల మీద కేసులు నమోదు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్‌ సీపీ నాగరాజును తీసుకొచ్చిందని విమర్శించారు. జిల్లాలో ఇలాంటి శిక్షణలతో పాటు గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నా.. పట్టించుకోవడం లేదన్నారు.  


పోలీసులపై న్యాయ పోరాటం చేస్తాం

తమ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేసి.. ప్రతిష్ఠను దిగజార్చిన నిజామాబాద్‌ పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామని పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ ఇర్ఫాన్‌ ప్రకటించారు. పీఎ్‌ఫఐ ఓ సామాజిక సేవా సంస్థ అని స్పష్టం చేశారు. అబ్ధుల్‌ ఖాదర్‌ వృత్తి రీత్యా కరాటే మాస్టర్‌ అని, అలాంటి వ్యక్తిపై పోలీసులు దేశ ద్రోహం కింద కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పీఎ్‌ఫఐ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 

Updated Date - 2022-07-07T08:16:07+05:30 IST