Abn logo
Jul 22 2021 @ 03:37AM

మూడున్నర కోట్లకు కుచ్చుటోపీ

గోల్డ్‌ స్కీం, చిట్టీలు, డిపాజిట్ల రూపంలో సేకరణ

తండ్రీకొడుకుల ఘరానా మోసం

బాధితుల లబోదిబో.. పోలీసులకు ఫిర్యాదు


ద్వారకా తిరుమల, జూలై 21 : అధిక వడ్డీలు, బంగారం స్కీం, చిట్టీల పేరిట వందలాది మంది నుంచి సేకరించిన కోట్లాది రూపాయలతో తండ్రీ కొడుకులు కుటుంబంతో సహా పరారయ్యారు. బాధితులు లబోదిబోమంటూ పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు...దొరసానిపాడుకు చెందిన సీమకుర్తి హనుమంతరావు, అతని కుమారుడు రాజా పదేళ్ల క్రితం నుంచి లక్ష్మీపురంలో ఉంటూ చిట్టీలు నడుపుతున్నారు.  కరోనా కారణం చెప్పి పాడుకున్న వారికి సకాలంలో సొమ్ములు ఇవ్వక, అధిక వడ్డీతో చెల్లిస్తామంటూ నమ్మబలికి  వందలాది మంది సొమ్మును తమ వద్దనే ఉంచుకున్నారు.


రాజా ఇటీవల ద్వారకా తిరుమలలో శ్రీ వెంకట గణేష్‌ జ్యువెలరీ షాపును నిర్వహిస్తున్నాడు. 15 నెలలపాటు నెలకు రెండు వేల చొప్పున చెల్లిస్తే  16వ నెల బోన్‌సగా మరో రెండు వేలు కలిపి 32 వేలకు బంగారం, వెండి వస్తువులు ఇస్తామని  స్కీం మొదలు పెట్టాడు. సుమారు 200 మందికిపైగా ఈ స్కీంలో చేరారు. ఇంకో వైపు అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపించి పది వేల నుంచి లక్షలాది రూపాయల వరకు పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించారు. ఈతరుణంలో రాజా కొన్ని రోజులుగా షాపు తీయడం మానేసాడు. కొందరు అతని ఇంటికి వెళ్లగా,  తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వారిని విచారించగా, కొన్ని రోజుల క్రితమే అతను కుటుంబ సభ్యులతో వెళ్లిపోయినట్లు తేలింది.  తాము మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు. అంతా కలిపి సుమారు మూడున్నర కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపీ పెట్టినట్టు బాధితులు వాపోతున్నారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు భీమడోలు సీఐ సుబ్బారావు తెలిపారు.