కోర్టును బెదిరిస్తున్నారు!
ABN , First Publish Date - 2020-12-17T07:44:40+05:30 IST
రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను హరిస్తూ పోలీసులు వ్యక్తులను ఎత్తుకెళ్లి నిర్బంధించడం సాధారణ విషయమా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
- అక్రమ నిర్బంధాలు సాధారణ అంశమా?
- మీకు కావొచ్చు.. కానీ, కోర్టుకు కాదు!
- హక్కులు కాపాడకుంటే మేమెందుకు?
- ప్రభుత్వ లాయర్లపై హైకోర్టు ఆగ్రహం
- ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’పై వాదనలు
- సుప్రీంలో పిటిషన్ వేశామన్న ప్రభుత్వం
- విచారణ వాయిదాకు ధర్మాసనం ‘నో’
అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను హరిస్తూ పోలీసులు వ్యక్తులను ఎత్తుకెళ్లి నిర్బంధించడం సాధారణ విషయమా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, సీఆర్పీసీ నిబంధనలు ఉల్లంఘించడం మీకు సాధారణ విషయం ఏమో కానీ... కోర్టుకు కాదు’’ అని తేల్చి చెప్పింది. ‘‘ఓ వ్యక్తిని వారం రోజులపాటు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన తర్వాతే విడుదల చేశారు. పౌరుల హక్కులకు రక్షణ కల్పించలేనప్పుడు...హైకోర్టు జడ్జిలుగా మేం ఉండి ఉపయోగమేమిటి’’ అని వ్యాఖ్యానించింది.
ఇదే అంశంపై సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వ, పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టును బెదిరించారని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లతో పాటు ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన దర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తామని, ఆ దిశగా వాదనలు వినిపించాలని అక్టోబరు 1వ తేదీన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం విచారణ ప్రారంభమైన వెంటనే పోలీసుల తరఫు సీనియర్ కౌన్సిల్ ఎస్‌ఎస్ ప్రసాద్ తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉందని, పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు.
అందుకు ధర్మాసనం అంగీకరించింది. అప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.... రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే విషయం తేల్చే విచారణాధికార పరిధి కోర్టుకు లేదని ఈ నెల 14న జరిగిన విచారణలో అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. రాజ్యాంగ విచ్ఛిన్నం పై ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని ఆ తర్వాత సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ తెలిపారు. దీనిపై అత్యవసరంగా విచారించాలని ఈ నెల 18న సుప్రీంకోర్టును కోరనున్నామని... విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. సుప్రీంకోర్టులో స్టే వస్తే.. విచారణను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నంపై వాదనలు కొనసాగించాలని కోరింది. సాధారణ పద్ధతిలో విచారణ కొనసాగించాలని ఎస్‌ఎస్ ప్రసాద్ కోరగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రాథమిక హక్కులను హరించడం సాధారణ విషయమా అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఎస్‌ఎస్ ప్రసాద్ కల్పించుకుని... హైకోర్టులో నమోదైన హెబియస్ కార్పస్ పిటిషన్లలో చిత్రహింసకు సంబంధించిన ఘటనలు ఎక్కడ ఉన్నాయో చూపించాలని కోరారు. ‘‘అలా చిత్రహింస ఘటనలు ఎక్కడా జరగలేదని మీరు అఫిడవిట్ దాఖలు చేస్తారా’’ అని ధర్మాసనం ప్రశ్నించగా, తామెందుకు దాఖలు చేస్తామని ఎస్‌ఎస్ ప్రసాద్ స్పందించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది సుమన్ కలగజేసుకుంటూ... రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని కోర్టు భావిస్తున్న అంశాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు.
అందుకు నిరాకరించిన ధర్మాసనం, ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే విచారణ ముగించి, ఆర్డర్ రిజర్వ్ చేస్తామని హెచ్చరించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరినట్లు ఉత్తర్వుల్లో నమోదు చేయాలని ప్రభుత్వ న్యాయవాది సుమన్ పట్టుబట్టగా... ‘మీరు అడిగిన ప్రతీ విషయాన్ని నమోదు చేయాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను గురువారానికి వాయిదా వేస్తూ... తాము సోమవారం ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వ న్యాయవాదులకు అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
‘బెదిరింపుల’పై సంవాదం
సోమవారం జరిగిన విచారణలో కోర్టును బెదిరించేలా మాట్లాడారన్న ధర్మాసనం వ్యాఖ్యలపై కొద్దిసేపు సంవాదం సాగింది. ధర్మాసనం వ్యాఖ్యలపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలుపగా... ‘ఔను నన్ను బెదిరించారు’ అని జస్టిస్ రాకేశ్ కుమార్ మరోసారి చెప్పారు. అడ్వకేట్ జనరల్‌ను ఉద్దేశించే మీరు చెబుతున్నారా అని ప్రభుత్వ న్యాయవాది సుమన్ స్పష్టత కోరగా... ఆ రోజు పోలీసుల తరఫు న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ విచారణ లో ఉన్నారని బదులిచ్చారు. ఈ సందర్భంగా మరో ప్రభుత్వ న్యాయవాది వివేకానంద జోక్యం చేసుకుని... ‘‘ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లు విచారించాలని కోరితే బెదిరించారనడం సరికాదు.
సీనియర్ న్యాయమూర్తిగా మీరే అలాంటి వ్యాఖ్యలు చేస్తే విచారణలో ముందుకెళ్లలేం. ఈ రాష్ట్రంలో మీరు బెదిరింపునకు గురైనట్లు భావించొద్దు. మీకు, వ్యవస్థలకు రక్షణగా ముందు వరుసలో మేం ఉంటాం’’ అని తెలిపారు. జస్టిస్ రాకేశ్ కుమార్ స్పందిస్తూ... గత విచారణలో సీనియర్ న్యాయవాది ప్రసాద్ మాట్లాడిన తీరు బెదిరించినట్లుగానే ఉందన్నారు. తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగించుకొని ఏపీ హైకోర్టులో లాగిన్ అయిన ప్రభుత్వ సీనియర్ కౌన్సిల్ ఎస్‌ఎస్ ప్రసాద్... ‘కోర్టును నేను బెదిరించినట్లుగా వ్యాఖ్యలు చేశారట కదా’ అని ఆరా తీశారు. తాను విచారణ ప్రక్రియలో లేనప్పుడు అలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
తాము అలా అనలేదని, నోరు జారడం ద్వారా దాడి చేశారని మాత్రమే పేర్కొన్నామని ధర్మాసనం తెలిపింది. గత విచారణ సందర్భంగా ధర్మాసనం అడ్వకేట్ జనరల్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిందని.. కనీసం ఆయన వాదనలు వినడానికి కూడా అంగీకరించలేదని ప్రసాద్ పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం కలగజేసుకుని... ప్రస్తుత కేసుతో సంబంధం లేని అంశాలను చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది.