ఆ ఇద్దరు కాశ్మీరీ యువతులు

ABN , First Publish Date - 2021-02-08T06:14:48+05:30 IST

చినార్‌ చెట్ల గుంపుల మధ్య మొలిచిన ఎత్తైన ఇనుపరెక్కల నిఘా గూళ్లపై నిలబడ్డారు ఒకే రకపు దుస్తులు ధరించి వాళ్ళంతా...

ఆ ఇద్దరు కాశ్మీరీ యువతులు

చినార్‌ చెట్ల గుంపుల మధ్య 

మొలిచిన ఎత్తైన ఇనుపరెక్కల నిఘా గూళ్లపై నిలబడ్డారు 

       ఒకే రకపు దుస్తులు ధరించి వాళ్ళంతా

చీకటి నీడలు పరుచునే ఆ సూర్యాస్తమయ వేళలో

వాళ్ళ గుండెలపై వేలాడే రకరకాల పతకాలు

చేతుల్లోని నల్లటి ఆయుధాలు మెరిసాయి తళతళా

పొడుగాటి ఊలు పెహరాన్‌ కోట్లు ధరించి గట్ల వెంట నడుస్తున్న 

ఎంతో అందమైన కాశ్మీరీ యవతులు వాళ్లిద్దరూ 

చలికి కందిపోయిన ఎర్రటి బుగ్గలు, పనిచేసి బండబారిన అరచేతులు 

కలవాళ్ళు వాళ్లిద్దరూ

అలసి ఇంటి దారి పట్టిన ఆ యువతుల దేహాల మీదుగా

చినార్‌ చెట్ల నుండి ఇనుప డేగల చూపులు

తుపాకీ తూటాల్లా దూసుకు వచ్చాయ్‌ గోధుమ పైర్లని మండిస్తూ

ముళ్లలా జారి దేహంపై కాలుతూ

గుచ్చుకున్న ఆ చూపుల్ని విదిలిస్తూ

ఒక కంట కన్నీరు, మరో కంట నిప్పులు రాలుతుండగా

నడిచారు ఆ కాశ్మీరీ యువతులు వడి వడిగా ఊరి వైపు


పశువులు, పక్షుల్లా వాళ్ళు కూడా ఈ దినం

దీపాలు పెట్టే వేళ కన్నా ఇళ్లకు చేరగలరా?

అదిగో, ఆ ఆఖరి పొలం దాటి

గలగలా కొండవాలు గుండా ప్రవహించే ఆ చిన్న సెలయేరు దాటి 

చీనార్‌ చెట్ల గుంపులన్నీ దాటితే కనపడేదే వాళ్ళ పల్లె 

వాళ్ళిప్పుడు దాటగలరా ఆ చిన్ని సెలయేరును?

చీనార్‌ చెట్ల గుంపులను?

గుచ్చుకునే చూపుల ముళ్ళ కంచెలను?


ఆ యిద్దరు యువతుల గుండె చప్పుళ్ళతో జత కలిపి

భయంగా దడదడా బండరాళ్లను వొరుసుకు పారాయి నీళ్లు 

వాళ్ళు ఆ సెలయేరు దాటబోయినప్పుడల్లా అక్కడ కనపడతాయి 


వంటి మీద దుస్తులు లేకుండా నగ్నంగా 

ఛిద్రమైన శరీరాలతో మరణించి పడి వున్న

గుర్తుతెలియని యువతుల శరీరాలు కొన్ని

వాళ్ళపై అత్యాచారం జరిగిందా?

దేహాలపై చిత్రహింసల ఆనవాళ్లకీ

హృదయాల గుండా దూసుకు వెళ్లిన తూటాలకీ

కారణం ఏమై ఉంటుంది?


ఆ మరణించిన ఆడవాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు?

వాళ్ళ నెత్తురు కారిన ఆ సెలయేటి తడి ఇసుకపై 

ఇనుప బూట్ల తొడతొక్కిడి ముద్రలు

ఏళ్ళు గడిచినా ఇంకా చెదరక అలాగే మిగిలి ఉన్నాయి ఎందుకు?


ఇంతకీ ఎవరు ఆ ఆడవాళ్లు? 

వాళ్ళ సమాధులపై పూచిన గడ్డిపూలు

జరిగిన దారుణానికి

నిర్ఘాంతపడి క్షణకాలం నిలిచిన సెలయేరు

ట్రిగ్గర్‌ వెనక్కి లాగిన చప్పుడికి ఉలిక్కిపడి

గాభరాగా వీచే సుడిగాలులు

చివరకి కళ్ళకి నల్లటి గంతలు కట్టుకుని నిలబడే న్యాయ దేవతా

ఎవరూ ఎన్నడూ ఆ చంపబడ్డ ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదు


ఎంతో దుఃఖం ప్రవహించి, గడ్డకట్టి 

మళ్ళీ ప్రవహించి గడ్డ కట్టాక 

ఇక ఆ ఊరి ఆడవాళ్లు తమ వ్యధలు, సంతోషాలూ కలబోసుకునే 

ఏటి వొడ్డు యార్‌బాల్‌ చాకిరేవులకు వెళ్లడం మానేసారు


అట్లా ఆడవాళ్ళ మధ్య మాటలు మెల్లిగా మాయమయ్యాక 

అప్పుడిక భయం లాంటి శ్మశానం లాంటి మౌనం

గాలి నిండా గంధకధూపమై వ్యాపించింది లోయ అంతటా


ఇప్పుడీ చలికాలపు సాయంకాలం 

పొలం నుండి బయలుదేరిన 

ఆ ఇద్దరు యువతులు క్షేమంగా ఊరికి చేరగలరా?

చెట్ల మధ్య నిలువునా మొలిచిన రాకాసి కోరలను దాటి  

అయ్యో, వాళ్ళు నిజంగా ఇళ్లకు చేరగలరా?


చినార్‌ చెట్ల గుబుర్లు దిగులుగా తలవాల్చి, ఇనుప రెక్కల

నిఘా గూళ్లకేసి చూసాయి

తళతళ లాడే నల్లని ఆయుధాలు ధరించిన

ఆ డేగ కళ్ళ వేటాడే చూపులని చెదరగొట్టేందుకు

అవి ప్రచండ వేగంతో వీచాయి 

చుట్టూ ఒక ధూళి తెర పరిచ్చాయైు పరుచుకున్నాక

ఎట్టకేలకి ఆ ఇద్దరు యువతులూ దాటారు ఎలానో సెలయేరును

చినార్‌ చెట్ల గుబుర్లను

అప్పటి దాకా ఊపిరి బిగబట్టి చూస్తున్న ఊరు

భారంగా నిట్టూర్చింది


అప్పుడు

పొద్దు వాలే వేళ ఆకాశంలో నెలవంక వెలిగింది

ఆ పక్కనే ఒక ఆరని స్వేచ్ఛా నక్షత్రం తల ఎత్తి నవ్వింది


ఇప్పటికి ఇళ్లకు చేరిన ఆ ఇద్దరు అందమైన కాశ్మీర్‌ యువతులు

రేపు మళ్ళీ బయలు దేరాలి కొండలలోకి 

పశువులను మేపేందుకో, వంట చెరకు సేకరించేందుకో

రేపు వాళ్ళు మళ్ళీ బయలు దేరాలి 

గడ్డి కోసేందుకో, పంటను ఇంటికి తెచ్చేందుకో

సంతలో అమ్మకాలకో, కొనుగోళ్లకో 

జబ్బుపడ్డ పిల్లలను ఆసుపత్రికి తీసుకు వెళ్ళేందుకో

ఇంకా ఇంటికిరాని బిడ్డలనో, భర్తలనో, సోదరులనో వెతికేందుకో

రేపు వాళ్ళు మళ్ళీ బయలుదేరాలి


ఆ చినార్‌ చెట్ల మధ్య మొలిచిన ఇనుప రెక్కల గూళ్ళు

తళతళలా మెరిసే తుపాకులు

గోధుమ పైర్ల మీదుగా పాకే డేగ కళ్ల తూటాల చూపులు

ఇంకా అక్కడ స్థిరంగా ఉండగానే

రేపు మళ్లీ వాళ్ళు బయలు దేరాలి

విమల

Updated Date - 2021-02-08T06:14:48+05:30 IST