ఈ మ్యాగజైన్‌ ట్రాన్స్‌జెండర్ల కోసం

ABN , First Publish Date - 2020-12-16T06:31:51+05:30 IST

ట్రాన్స్‌జెండర్ల గురించి, వారి జీవనశైలి గురించి ఎవరో ఒకరు చెబితేనో, లేదా ఒకరో ఇద్దరో ట్రాన్స్‌జెండర్లను చూసో ఒక అంచనాకు వస్తా.

ఈ మ్యాగజైన్‌ ట్రాన్స్‌జెండర్ల కోసం

ట్రాన్స్‌జెండర్ల గురించి, వారి జీవనశైలి గురించి ఎవరో ఒకరు చెబితేనో, లేదా ఒకరో ఇద్దరో ట్రాన్స్‌జెండర్లను చూసో ఒక అంచనాకు వస్తా. అయితే మనకు వారి గురించి తెలియని విషయాలు బోలెడు. తమ జీవితాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సమాజం ముందు ‘ట్రాన్స్‌ న్యూస్‌’ అనే  ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ రూపంలో ఆవిష్కరిస్తున్నారు తమిళనాడులోని కొందరు ట్రాన్స్‌జెండర్లు. 


మధురైలోని విశ్వనాథపురానికి చెందిన ప్రియాబాబు అక్కడి ట్రాన్స్‌జెండర్‌ రిసోర్స్‌ సెల్‌ ఛైర్మన్‌. ఆయన  కొంతమంది ట్రాన్స్‌జెండర్స్‌ కలిసి ఈ ఆలోచనకు రూపమిచ్చారు. సమాజానికి తమ కట్టుబొట్టును చాటడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఈ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ మనదేశంలోనే ట్రాన్స్‌జెండర్లు తమకోసం నడుపుతున్న మొదటి ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ కావడం విశేషం. పేరుకు తగ్గట్టే ఇందులో చాలావరకూ వాళ్ల కమ్యూనిటీ అంశాలే ఉంటాయి. అంతేకాదు ఈ మ్యాగజైన్‌లో కనిపించే మోడళ్లు అందరూ ట్రాన్స్‌జెండర్లే. ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు రిపోర్టర్లుగా పనిచేస్తున్నారు. వీరు కాకుండా విద్యార్థులు, మహిళలు కూడా ఈ మ్యాగజైన్‌కు కంటెంట్‌ అందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 


ఆసక్తికర విషయాల సమాహారం

‘‘ట్రాన్స్‌న్యూస్‌ మ్యాగజైన్‌లో ట్రాన్స్‌జెండర్ల ఫ్యాషన్‌, బ్యూటీకి సంబంధించిన సమాచారంతో పాటు, రకరకాల వంటలు, ఆర్టికల్స్‌, కథలు, కవితలు ప్రచురిస్తున్నాం. ప్రస్తుతానికి తమిళం, ఇంగ్లిష్‌ రెండు భాషల్లో ఈ మ్యాగజైన్‌ అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో ఉంచిన మూడు కాపీలకు పాఠకుల నుంచి మంచి స్పందన వస్తుంది’’ అంటున్నారు ప్రియాబాబు. ఈ ఏడాది నవంబర్‌ 1న ఆయన ఈ మ్యాగజైన్‌ను ప్రారంభించారు.


ట్రాన్స్‌జెండర్లు తయారుచేసిన ఉత్పత్తులను దుకాణాల్లో కాకుండా ఆన్‌లైన్‌లోనూ మార్కెట్‌ కల్పించేందుకు ట్రాన్స్‌ మ్యాగజైన్‌ ఒక వేదికగా పనిచేస్తుంది. దీంతోపాటు ఉద్యోగ ప్రకటనల పేజీలో ట్రాన్స్‌జెండర్లకు అనువైన ఉద్యోగ సమాచారం ఉంటుంది. ఈ మ్యాగజైన్‌లో వచ్చే ఆర్టికల్స్‌ ట్రాన్స్‌జెండర్ల మీదున్న తప్పుడు అభిప్రాయాలను చెరిపేస్తాయని అంటున్నారు ‘ట్రాన్స్‌ న్యూస్‌’ మేనేజింగ్‌ ఎడిటర్‌ మహాలక్ష్మి రాఘవన్‌. ఆమె తమిళంలోని ఆర్టికల్స్‌, విశేషాలను ఇంగ్లిష్‌లోకి మార్చి రాస్తారు. ‘‘ట్రాన్స్‌జెండర్ల గురించి అందరికీ తెలియని విషయాలను మేము చెబుతున్నందున మా మ్యాగజైన్‌న పాఠకులు ఆసక్తితో చదువుతున్నారు’’ అంటుంది సహాయ ఎడిటర్‌గా ఉన్న షాలిని. 

Updated Date - 2020-12-16T06:31:51+05:30 IST