ప్రజల సొమ్ము దోచిపెట్టడమే ఇది

ABN , First Publish Date - 2021-07-14T05:41:32+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించింది...

ప్రజల సొమ్ము దోచిపెట్టడమే ఇది

‘పాలకవర్గం, పాలితవర్గపు మేధావుల్ని ఎంత ఎక్కువగానైతే తనలో ఇముడ్చుకుంటుందో, అంత స్థిరంగాను, అంత ప్రమాదకరంగాను దాని పాలన తయారవుతుంది.’

కార్ల్‌మార్క్స్‌


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొన్ని సంస్థలకు, కొందరు కళాకారులకు, రచయితలకు, పాత్రికేయులకు వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు (జీవిత సాఫల్య పురస్కారాలు) ప్రకటించింది. ఈ పురస్కారాల కింద ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును... అంటే ప్రజల ధనాన్ని ప్రదానం చేయబోతున్నది. వివిధ సంస్థలు, పాత్రికేయులు, రచయితలు, రైతులు, కళాకారులు కలిపి మొత్తంగా 63 మందికి ఈ అవార్డు ప్రకటించారు. వారిలో 16 మంది రచయితలు, పాత్రికేయులు ఉన్నారు. వీరిలో అత్యధికులు ఒకనాడు విప్లవ, వామపక్ష ఉద్యమాల అభిమానులు. ఇది దోపిడీ రాజ్యమని, దొంగల రాజ్యమని దీనిని కూల్చి నూతన సమాజం, సమసమాజం స్థాపించాలని చెప్పినవాళ్లు. విరసం, అరసం వంటి సంఘాలకు గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు, కార్యదర్శులుగా, వివిధ హోదాల్లో, బాధ్యతల్లో క్రియాశీలకంగా పనిచేసిన వారు కూడా వీళ్లలో ఉన్నారు. కొందరికి మరణానంతరం ఈ అవార్డును ప్రకటించారు.


ప్రభుత్వ ప్రకటన వచ్చిన వెంటనే పాలగుమ్మి సాయినాథ్‌ ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తలు, విమర్శలు రాసే పాత్రికేయులు ప్రభుత్వం ఇవ్వజూపే అవార్డులు తీసుకోవడం మంచి సంప్రదాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి భారీ మొత్తాల్ని పురస్కారాల పేరిట పొంది ఇక ఆ ప్రభుత్వానికి అవసరమైన సందర్భంలో కూడా వ్యతిరేకంగా ఏం రాయగలరు? పరోక్షంగా వారి చేతులు కట్టేసినట్లే కదా? ప్రభుత్వానికి లొంగిపోయినట్లే కదా?


రాజశేఖరరెడ్డి జయంతిని రైతుదినోత్సవంగా జరుపుకోవడం హాస్యాస్పదం. ఇవాళ రైతు పండించే ఏ పంటకూ ప్రభుత్వాలు సరైన ధరను ప్రకటించడం లేదు. దాంతో ఏ రైతుకు వ్యవసాయమంటే మొఖం మొత్తకుండా ఉంటుంది? అయినా మరోదారి లేక చచ్చినట్లు ఎత్తుబడిపోతున్న వ్యవసాయం చేస్తున్నారే కానీ, అందులో ఆనందాన్ని, ప్రతిఫలాన్ని ఏ రైతు పొందుతున్నాడు? భవిష్యత్‌ మీద భరోసాతో ఏ రైతు సాగు చేయగలుగుతున్నాడు? నిజంగా స్థితిగతులు బాగుంటే వేలకొద్దీ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దుర్గతి ఎందుకు దాపురించింది? రైతుల పేరిట దినోత్సవం నిర్వహించి అవార్డులు ప్రకటించడం కేవలం నాటకం, బూటకం మాత్రమే!


అవార్డు వచ్చిన 16 మందిలో కనీసం డజను మంది ఒకప్పుడూ, నేడు కమ్యూనిస్టు భావజాలం కలిగినవాళ్లు. వీళ్లలో కొందరి మీద ప్రజానీకంలో సదభిప్రాయం ఉంది. గొప్ప వ్యక్తులుగా గుర్తింపు ఉంది. ఆగస్టు 14 లేదా 15న వీళ్లు ఈ అవార్డును తీసుకోబోతున్నారు. తమని బుట్టలో వేసుకోవడానికే ప్రభుత్వం ఈ అవార్డులు ప్రకటించిందని వాళ్లకి తెలియదా? ప్రజల్ని మాయ చేయడానికి ప్రభుత్వాలు ఏవో రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటాయి. వీళ్లలో కొందరైనా ఆ జిమ్మిక్కుల్లో చిక్కుకోకుండా ఉంటే బాగుంటుంది. వీళ్లు ఈ అవార్డులు తీసుకుంటే ప్రజానీకానికి చాలా తప్పుడు సంకేతాలు కూడా వెళ్తాయి. ప్రభుత్వం ఉత్తమమైనదని, ఇలాంటి గొప్పవాళ్లను సత్కరిస్తున్నదని ప్రజలు భ్రమపడవచ్చు. ప్రభుత్వం మీద భ్రమలు పెంచుకోవచ్చు.


ప్రభుత్వం పందేరం చేస్తున్న ఈ సొమ్ము శ్రామిక, కార్మిక జనాల శ్రమ, స్వేదం నుంచి పొందిన అదనపు విలువలో భాగమే కదా? శ్రమ చేయని, తమ శ్రమకి ఏమాత్రం సంబంధం లేని, తమది కాని సొమ్ము తీసుకోవడం న్యాయమేనా? సాయినాథ్‌ మాదిరిగా కొందరైనా ప్రభుత్వం ఇవ్వజూపుతున్న ఈ అవార్డుల్ని తిరస్కరించాలి. ప్రజాపక్షపాతులు ఇదే అభిలషిస్తున్నారు.

మొలకలపల్లి కోటేశ్వరరావు

Updated Date - 2021-07-14T05:41:32+05:30 IST