చంద్ర విలాపం

ABN , First Publish Date - 2021-11-20T07:58:57+05:30 IST

ఎలాంటి సందర్భంలోనైనా నిబ్బరంగా, గంభీరంగా ఉండే చంద్రబాబు మొదటిసారి విలపించారు. తన సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అనరాని మాట లు అన్నారని గద్గద స్వరంతో చెబుతూ...

చంద్ర విలాపం

  • కన్నీరుపెట్టడం ఇదే తొలిసారి


ఎలాంటి సందర్భంలోనైనా నిబ్బరంగా, గంభీరంగా ఉండే చంద్రబాబు మొదటిసారి విలపించారు. తన సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అనరాని మాట లు అన్నారని గద్గద స్వరంతో చెబుతూ... ఆయన ఆవేదన ఆపుకోలేక ఏడ్చేశారు. శుక్రవారం మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకొంది. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన విలపించిన సంఘటనను ఎవరూ చూడలేదు. అత్యంత బాధాకర సంఘటనల్లో కూడా కంటనీరు కూడా ఎవరి కంటపడకుండా నిగ్రహించుకోవడం ఆయనకు అలవాటు. ఆయన వెక్కివెక్కి విలపించడం మైక్‌లో స్పష్టంగా వినిపించింది. ఈ పరిణామంతో సమావేశ మందిరంలో వాతావరణం గంభీరంగా మారింది. ఆయనను చూసి అక్కడ ఉన్న టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనూరాధ కూడా ఏడ్చేశారు. అధినేత కన్నీరు పెట్టడం చూసి వేదిక కింద ఉన్న కొందరు టీడీపీ నేతలు దిగ్ర్భాంతికి గురయ్యారు.


సముదాయించేందుకు వేదికపైకి రావాలని ప్రయత్నించగా... ఆయన వారిని వారించారు. రెండు నిమిషాల తర్వాత సర్దుకొని విలేకరుల సమావేశం కొనసాగించారు. అంతకు ముందు అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అసెంబ్లీ లోపలి నుంచి లాబీల్లోని తన గదిలోకి వచ్చిన చంద్రబాబు అక్కడ ఉన్న పార్టీ ఎమ్మెల్యేలతో బాధపడుతూ మాట్లాడారు. ఆయన మనస్తాపానికి గురయ్యారని గుర్తించిన ఎమ్మెల్యేలు... ఆయనను లోపలి గదిలోకి పంపి తాము బయట కూర్చున్నారు. లోపలి గదిలో నుంచి ఆయన ఫోన్లో తన సతీమణితో కొద్దిసేపు మాట్లాడారు. తర్వాత బయటకు వచ్చి హాల్లోని తన కుర్చీలో కూర్చున్నారు. సభలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ కన్నీళ్లు పెట్టుకొన్నారు.

Updated Date - 2021-11-20T07:58:57+05:30 IST