Abn logo
May 12 2021 @ 01:35AM

కరోనా కష్టకాలంలో ఇదీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అనధికారికంగా రోజుకి వందల మంది ఈ రోగం బారినపడి చనిపోతున్నారు. తగినన్ని ఆసుపత్రులు, బెడ్స్, మందులు, అంబులెన్సులు, వెంటిలేటర్స్, డాక్టర్లు, నర్సులు, సహాయ సిబ్బంది, తగినంత ఆక్సిజన్‌ లేకపోవడం కొవిడ్ మరణాలకు కారణమవుతున్నాయి. ఇందులో అతి పెద్ద సమస్య ఆక్సిజన్ బెడ్స్. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్స్ సంబంధించిన వివరాలు తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఆస్పత్రులలో 12000, ప్రైవేటు టీచింగ్ ఆసుపత్రులలో 4500, కార్పొరేట్ ఆసుపత్రులలో 22,000, మొత్తం 38,500 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రకరకాల కారణాల వలన 32 వేల బెడ్స్ మాత్రమే నికరంగా అందుబాటులో ఉంటాయి. మన రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు. ఒక అంచనా ప్రకారం ప్రతి 100 మందిని టెస్ట్ చేస్తే 20 మందికి కొవిడ్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 80 లక్షల మందికి కొవిడ్ ఉన్నట్లు అంచనా. ఈ రేటు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ప్రతి 100 మంది రోగులలో తక్కువలో తక్కువ రెండు శాతం మందికైనా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ లెక్కన ఏరోజైనా ఈ 80 లక్షల మంది రోగులలో రెండు శాతం అంటే ఒక లక్షా అరవై వేల మందికి ఆక్సిజన్ బెడ్స్ అవసరం ఉంటాయి. అంటే రాష్ట్రంలో ఇంకా లక్షా 30వేల ఆక్సిజన్ బెడ్్స్‌ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఒక్క ఆక్సిజన్ జనరేషన్ యూనిట్ కూడా లేకపోవడం. ఇప్పుడిప్పుడే గాంధీ ఆసుపత్రిలో ఒక యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చురుకుగా కదలాల్సిన అవసరం ఉంది.


విపత్తు నిర్వహణ చట్టం–2005 ప్రకారం ప్రభుత్వానికి సంక్రమించిన అన్ని రకాల అధికారాలు ఉపయోగించి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను కొవిడ్ కట్టడికి సమర్థంగా ఉపయోగించాలి. తక్షణమే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వార్‌రూమ్ ఏర్పాటు చేసి కొవిడ్ ఆస్పత్రులను, మానవ వనరులను, ఆక్సిజన్, మందులు, టీకాలు, బెడ్లు, వెంటిలేటర్లు, అంబులెన్్స్‌లు మొదలైన అవసరాలన్నీ గుర్తించి జిల్లా వారీగా హైదరాబాద్‌తో సమన్వయంతో కృషి చేయాలి. ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ సెక్రెటరీ, ముఖ్య అధికారులు ప్రతిరోజూ ఈ వార్‌రూమ్‌లో రెండుపూటలా హాజరై, అన్ని రకాల నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఉదాహరణకు ఆక్సిజన్ సరఫరాదారులు ఎవరూ టెండర్లలో పాల్గొనరు. ఎందుకంటే ఈ సమయంలో దేశంలో ఆక్సిజన్ కొనే రాష్ట్రాలు కార్పొరేట్లు చాలా మంది లైన్‌లో ఉన్నారు కాబట్టి. దేశంలో, అంతర్జాతీయంగా ఎక్కడ ఆక్సిజన్ దొరికితే అక్కడి నుండి అదే రోజు కొనుక్కోవాలి. ఇలాంటి నిర్ణయాలు వార్‌రూమ్‌లోనే తీసుకోవాల్సి ఉంటుంది. తక్షణమే రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిని నియమిస్తే నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు అవకాశం కలుగుతుంది. 


రాష్ట్రంలోని అన్ని పబ్లిక్ హెల్త్ సెంటర్‌లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు, ఏరియా హాస్పిటల్‌లు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లను కొవిడ్ ఆస్పత్రులుగా మార్చి వేయాలి. ఆస్పత్రిలో ఉన్న 70 శాతం బెడ్‌లను ఆక్సిజన్ బెడ్‌ల కింద మార్చాలి. మండల స్థాయిలో ఉన్న పబ్లిక్ హెల్త్ సెంటర్‌లో కనీసం కొత్తగా పది ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేయాలి.


ఢిల్లీలో ఏర్పాటు చేసినట్లు 10,000 బెడ్ల ఆస్పత్రి కనీసం పాత జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయవలెను. వీటిలో 20 శాతం బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్‌గా ఉండాలి. ప్రతి కొవిడ్ ఆసుపత్రి ముందు సమస్త వివరాలూ తెలియచెప్పే సమాచార బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించి కొవిడ్ చికిత్సకు ఫీజు వివరాలు ప్రజలకు తెలిసేటట్లుగా ఆన్‌లైన్‌లో ఉంచాలి. 


ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక నిధులు, జిల్లాకు కనీసం పది కోట్ల చొప్పున తక్షణమే మంజూరు చేయాలి. ప్రతి రెండు జిల్లాలకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను కొవిడ్ ప్రత్యేక అధికారిగా నియమించాలి. ఆంధ్రలో గత సంవత్సరం నుండి ఇలాంటి అధికారులు కొవిడ్ మీద ప్రత్యేకంగా పని చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రికి, టిమ్స్‌ ఆస్పత్రికి ప్రత్యేకంగా ఐఏఎస్ ఆఫీసర్లను అపాయింట్ చేయాలి. 


కొవిడ్ మహమ్మారి ఇంకా ఎన్ని నెలలు, సంవత్సరాలు ఉంటుందో తెలియదు. ఇప్పటికైనా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున, హైదరాబాదులో ఐదు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలి. ఈ కేంద్రాలు ఎప్పటికైనా అవసరమే. కొవిడ్ ఆస్పత్రిలో తగినంత మంది డాక్టర్‌లు, నర్సులు, సిబ్బంది లేకపోవడం మూలాన రోగులు చనిపోతున్నారు. తక్షణమే ఎక్కువ జీతం ఇచ్చి కొత్త డాక్టర్లను, సిబ్బందిని సమకూర్చుకోవాలి. గ్రామీణ స్థాయి ఆరోగ్య కేంద్రాల్లోని పి.జి డాక్టర్లను ఆస్పత్రులకు వాడుకోవచ్చు. డాక్టర్లు, నర్సులు ఇతర వైద్య సిబ్బందికి ప్రస్తుతం ఇచ్చే జీతం కంటే రెండు రెట్లు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలు అందిస్తున్నారు కాబట్టి. 


కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి తగినన్ని ప్రభుత్వ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ బడులు, కార్యాలయాలు, భవనాలను ఈ కేంద్రాలకు ఉపయోగించుకోవచ్చు. చనిపోయిన కొవిడ్ రోగుల శవాలను వారి బంధువుల సమక్షంలో వారి గ్రామ శ్మశాన వాటిక వరకూ రవాణా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రోగుల బంధువులు నుంచి మాఫియా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. రోగుల శవాలను రవాణా చేయడానికి మారుతి ఓమ్ని వంటి మామూలు వ్యాన్లను చిన్న మార్పులతో అవసరానికి ఉపయోగించుకోవచ్చు. ప్రతి కొవిడ్ ఆసుపత్రి దగ్గర రోగులకు, బంధువులకు ఉపయోగపడే సమాచార బోర్డులతో పాటు, సమస్య వచ్చినప్పుడు ఆస్పత్రి అధికారితో మాట్లాడే ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలి. 


చిన్నపాటి లక్షణాలు ఉన్నవాళ్లు, కరోనా రోగులు సంప్రదించడానికి కౌన్సిలింగ్ సెంటర్లు చాలా అవసరం. రాష్ట్రంలోని అన్ని వైద్య విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులతో ఈ సెంటర్లను ఏర్పాటు చేయవచ్చు. కాల్ సెంటర్ వ్యవస్థ ద్వారా కూడా ఇలాంటి సెంటర్లను నడపవచ్చు. తద్వారా వ్యాప్తినీ, మరణాలను కూడా తగ్గించవచ్చు. రాష్ట్రంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం మంచి విషయం. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విధానంలో వివిధ కంపెనీల నుంచి ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చు. ఈ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించినట్లు కనబడటం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో దాతలు సహాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచితే బాగుంటుంది. 


లాక్‌డౌన్ కాలంలో పేదలకు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం సహాయం చేయాలి. రైతు భరోసా పేరు మీద ధనిక రైతులకు డబ్బులు వెదజల్లడం కంటే ఇలా పేదలను ఆదుకోవడం ప్రభుత్వానికి మంచిది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠ పరిచే విధంగా ప్రతి మండలంలో కనీసం ఒక 30 పడకల ఆసుపత్రి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వంద పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లాకు ఒక 500 పడకల ఆసుపత్రి నిర్మించాలి. ప్రతి ఐదు వేల జనాభాకు ఒక ఆరోగ్య కేంద్రాన్ని, ఒక డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం కూడా అవసరం. గ్రామ స్థాయి ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మేరకు మందులు, వైద్యులు, పరికరాలు సమకూర్చి వాటిని కార్పొరేట్ ఆస్పత్రి లాగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అవసరమయ్యే బడ్జెట్టు ఇచ్చుకోవడానికి తెలంగాణకు ఆర్థిక సత్తా ఉంది. చాలా పథకాలు, ప్రాజెక్టుల కంటే ప్రజారోగ్య వ్యవస్థ మీద పెట్టుబడి అత్యావశ్యకం. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే సమస్య తీవ్రతను అర్థం చేసుకొని, పైన తెలిపిన పరిష్కార మార్గాలను ఆలోచించి, చర్యలను తీసుకున్నట్లయితే మహమ్మారిని గట్టిగా ఎదుర్కొనవచ్చు. ఇంత పెద్ద సమస్యను ఏ ఒక్క అధికారికో వదిలివేసి ఉదాసీనతతో వ్యవహరిస్తే చరిత్రలో అది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది.

ఆకునూరి మురళి ఐఎఎస్‌ (రిటైర్డ్‌) 

(ఏపీ ప్రభుత్వ సలహాదారు–అభిప్రాయాలు వ్యక్తిగతం)

Advertisement
Advertisement
Advertisement