మీ పేరు కమలనా? అయితే మీకు ఓ ప్రముఖ థీమ్ పార్క్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా పార్క్‌లోకి ప్రవేశించి.. సరదాగా గడిపే అవకాశాన్ని కల్పించింది. అది కూడా ఎప్పుడో కాదు.. ఇవాళే. ఏంటి.. అంతా గందరగోళంగా ఉందా? ప్రముఖ థీమ్ పార్క్ ఏంటి.. మాకు ఆఫర్ ఇవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి మహిళగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘వండర్ లా’ థీమ్ పార్క్.. ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కమల అనే పేరుగల వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ఆదివారం (24/01/2021) నాడు పార్క్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
‘ఈ ఆదివారం కమలల విజయం. జనవరి 24,2021న కమల పేరుతో ఉన్నవారికి ఉచిత ప్రవేశం. చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డును చూపించి దీన్ని పొందొచ్చు. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లో ఉన్న వండర్ లా థీమ్ పార్క్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. కమల్ (kamal), కమలమ్ (kamalam).. ఇలా కమల పేరుతో సామీప్యత ఉన్న పేరుగల వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఒక షరతు. మొదటగా వచ్చిన తొలి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది‘ అని స్పష్టం చేసింది.