ఈ జ్యోతి... జీవితాల్ని వెలిగిస్తోంది
ABN , First Publish Date - 2021-07-14T05:27:37+05:30 IST
మా ఇంటి చుట్టూ ఉన్న వీధుల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్త చూస్తే నాకు ఎంతో ఆందోళన కలిగేది. ప్లాస్టిక్ పర్యావరణానికే కాదు, మనుషులూ, ఇతర జీవజాతుల మనుగడకు కూడా ముప్పే.
పర్యావరణ సృపహకు సృజన జోడించారు రూపజ్యోతి.ఈ సాధారణ మహిళ చేసిన ఆ ప్రయత్నం ప్లాస్టిక్ వ్యర్థాలకు కొత్త రూపును ఇవ్వడమే కాదు, వేలాది మహిళలకు జీవనోపాధి కల్పిస్తోంది.
‘‘ఇళ్ళలో చెత్త పారెయ్యడానికి ప్లాస్టిక్ బ్యాగ్‌లను మాత్రమే మనం ఉపయోగిస్తూ ఉంటాం. వీధుల్లో, ఇళ్ళలో ఉండే ఇలాంటి బ్యాగ్‌లను సేకరించేలా చూశాం. మొదట్లో కొన్ని వర్క్‌షాపులకు వెళ్ళి, ఈ ప్రక్రియ గురించి తెలుసుకున్నాను. ప్లాస్టిక్ దారాన్ని నేయడంలో సక్సెస్ అయ్యాక... స్థానిక మహిళలకు నేర్పించాను’’.
‘‘మా ఇంటి చుట్టూ ఉన్న వీధుల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్త చూస్తే నాకు ఎంతో ఆందోళన కలిగేది. ప్లాస్టిక్ పర్యావరణానికే కాదు, మనుషులూ, ఇతర జీవజాతుల మనుగడకు కూడా ముప్పే. ప్లాస్టిక్ బ్యాగ్‌లపై నిషేధం ఉన్నా ఎవరూ దాన్ని పట్టించుకోవడం లేదు. అవేమిటో తెలియని జంతువులు, పక్షులు వాటిని తినడం వల్ల వాటి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. ప్లాస్టిక్ నేలలో కలిసిపోవడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. దాన్ని కాల్చేస్తే గాలి కలుషితం అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం లేదా? నా స్థాయిలో నేనేం చెయ్యగలను? ఈ అంతర్మథనంలోంచి పుట్టుకొచ్చిందే ‘విలేజ్ వీవ్స్’ సంస్థ అని అంటారు రూపజ్యోతి సైకియా గొగొయ్. నలభయ్యేడేళ్ళ ఈ మహిళ చేసిన ఒక సృజనాత్మకమై ఆలోచన... పర్యావరణానికి మేలు చేయడంతో పాటు రెండువేల మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.
మూడంచెల కార్యక్రమంగా...
అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది. మరే దేశంలోనూ లేనన్ని అరుదైన ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు నిలయమైన ఈ పార్క్‌కు సందర్శకుల తాకిడి ఎక్కువే! వారు వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఆ పార్క్‌కు సమీపంలో నివసించే రూపజ్యోతి ఈ సమస్య రాబోయే రోజుల్లో మరింత తీవ్రమవుతుందని గుర్తించారు. ఆమె భర్త వినోద్ వన్యప్రాణి సంరక్షణకు పాటుపడే ఒక ఎన్జీవోలో పని చేస్తున్నారు. పర్యావరణానికి ప్లాస్టిక్ తెస్తున్న చేటు గురించి వారిద్దరూ అనేక సార్లు మాట్లాడుకున్న తరువాత... ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం, వాటిని రీసైకిల్ చెయ్యడం, స్థానిక మహిళలకు నిలకడైన జీవనోపాధి అందించడం అనే మూడంచెల కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నారు. దీనికోసం 2004లో ‘విలేజ్ వీవ్స్’అనే సంస్థను రూపజ్యోతి ప్రారంభించారు. ‘‘మొదట్లో కేవలం ప్లాస్టిక్‌తో మాత్రమే వస్తువులు తయారు చెయ్యాలని ప్రయత్నించాను. కానీ కుదర్లేదు.
అప్పుడు దారంతో ప్లాస్టిక్ దారాలను కలిపి చూశాను. దీనితో ఇళ్ళలో వాడుకొనే మన్నికైన వస్తువులు తయారు చెయ్యొచ్చని గ్రహించాను’’ అని చెప్పారామె. తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో సమీప ప్రాంతాల్లో పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే పని మొదలెట్టారు. తమ ప్రాంతంలోని మహిళలను దీనిలో భాగస్వాముల్ని చేశారు. ‘‘ఇళ్ళలో చెత్త పారెయ్యడానికి ప్లాస్టిక్ బ్యాగ్‌లను మాత్రమే మనం ఉపయోగిస్తూ ఉంటాం. వీధుల్లో, ఇళ్ళలో ఉండే ఇలాంటి బ్యాగ్‌లను సేకరించేలా చూశాం. మొదట్లో కొన్ని వర్క్‌షాపులకు వెళ్ళి, ఈ ప్రక్రియ గురించి తెలుసుకున్నాను. ప్లాస్టిక్ దారాన్ని నేయడంలో సక్సెస్ అయ్యాక... స్థానిక మహిళలకు నేర్పించాను. గ్రామీణ అస్సామీ మహిళలు చేతి వృత్తుల్లో, చేనేతలో చిన్నతనం నుంచే శిక్షణ పొందుతూ ఉంటారు. చాలా ఇళ్ళలో మగ్గం ఉంటుంది. వెదురుతో వస్తువులు చేయడం వారికి అలవాటే! కనుక కాస్త శిక్షణ అందించి, వారు తయారు చేసే వాటిని విక్రయించే దారి చూపించాలనుకున్నాను’’ అన్నారామె.. 35 గ్రామాల్లోని మహిళలకు ప్లాస్టిక్ వ్యర్థాలతో సాగించే ఈ నేత పనిలోనూ, ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసి, దారంగా మార్చి, నేసి, రోజువారీ వినియోగ వస్తువులుగా మలచడంలోనూ ఆమె శిక్షణ అందించారు. హ్యాండ్ బ్యాగ్‌లు, టేబుల్ మ్యాట్స్, అలంకరణ వస్తువులు డోర్ మ్యాట్స్.... ఇలా రకరకాల వస్తువులు వీరు తయారు చేస్తున్నారు. దాదాపు 2,300 మంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు.
విదేశాల్లోనూ డిమాండ్...
‘‘సంప్రదాయికమైన చేనేత పద్ధతిలోనే ఇదంతా జరుగుతుంది. మామూలు దారాన్నీ, ప్లాస్టిక్‌నూ కలిపి అల్లుతాం కాబట్టి వీటి మన్నిక కూడా బాగుంటుంది. సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేసి ఆరబెడతాం. వాటిని పొడవైన ముక్కలుగా కత్తిరించి, ఒకదానితో ఒకటి ముడి చేసి, ఒక పెద్ద దారంలా తయారు చేస్తాం. చిన్న చిన్న టెక్నిక్స్ తో మామూలు దారాన్నీ, ఈ ప్లాస్టిక్ దారాన్నీ కలిపి... మగ్గం మీద నేస్తాం. ఒక ఉత్పత్తికి మరిన్ని రంగులను అద్దడం కోసం అన్ని రకాల ప్లాస్టిక్ కవర్లనూ, ర్యాపర్లనూ నేతలో మేం ఉపయోగిస్తాం. మొదట్లో చిన్న స్థాయిలో అమ్మకాలు చేసేవాళ్ళం. 2012లో, మా ఉత్పత్తుల విక్రయానికి‘కజరంగా హాత్’ అనే సంస్థను ఏర్పాటు చేశాం. మేం అమ్మే వాటిలో ప్లాస్టిక్ వ్యర్థాలతో చేసిన చేనేత వస్తువులతో పాటు చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు కూడా ఉంటాయి. విదేశాల్లో వీటికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది’’ అని ఆమె వివరించారు.
ఆన్‌లైన్‌పై దృష్టి...
‘‘మా దగ్గర శిక్షణ తీసుకున్న మహిళల్లో చాలా మంది సొంతంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో మాట్లాడి, తమ వస్తువులను అమ్మే నైపుణ్యాలు కొందరిలో లేవు. అలాంటి సందర్భాల్లో ‘కజరింగా హాత్’ ద్వారా నేను సాయం చేస్తున్నాను. పర్యాటకులు ఎక్కువగా వచ్చే సీజన్లో... మా నెట్‌వర్క్‌లోని మహిళలు నెలకు పాతిక వేల రూపాయల వరకూ సంపాదించుకుంటున్నారు. వీళ్ళంతా తమ ఇళ్ళలోనే మగ్గాలను ఏర్పాటు చేసుకున్నారు. వారి ఉత్పత్తులను ‘కజరింగా హాత్’ ద్వారా విక్రయిస్తారు. ఎక్కువగా విదేశీ టూరిస్ట్‌లు ఈ వస్తువులను కొనడానికి ఆసక్తి కనబరుస్తారు. వారిని మగ్గాల దగ్గరకు తీసుకువెళ్ళి, ఈ వస్తువులను ఎలా తయారు చేస్తున్నదీ వారికి చూపిస్తూ ఉంటాం. కొవిడ్ కారణంగా ఏడాదిన్నర నుంచి టూరిస్టుల రాక తగ్గిపోవడంతో విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో ఆన్లైన్ అమ్మకాల మీద ఎక్కువ దృష్టి పెట్టాం’’ అని చెప్పారు రూపజ్యోతి. ‘విలేజ్ వీవ్స్’ నమూనా దేశంలోని అనేక స్వచ్ఛంద సంస్థలను ఆకర్షించింది. ఇతర ప్రాంతాల్లో దీన్ని అనుసరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఎంతో సంతోషం కలిగిస్తోందని చెబుతున్న రూపజ్యోతి ‘‘అసోంలోని మరిన్ని గ్రామాలకు ‘విలేజ్ వీవ్స్’ను విస్తరించి, ఎక్కువమంది మహిళలకు ఉపాధినీ, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహననూ కల్పించాలన్నదే తన లక్ష్యం’’ అంటున్నారు.
