ఈ ఆశ్రమం.. మానవతకు ఆశ్రయం!

ABN , First Publish Date - 2020-02-20T05:48:20+05:30 IST

‘‘శ్రమైక జీవన విధానమే మన సంస్కృతికి పునాది. దీనికి భిన్నంగా వినిమయ సంస్కృతి చొచ్చుకువస్తున్న నేటి కాలంలో సమాజాన్ని హేతుబద్ధమైన, శాస్త్రీయమైన ఆలోచనల దిశగా నడిపించి, మన

ఈ ఆశ్రమం.. మానవతకు ఆశ్రయం!

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా హేతుబద్ధమైన ఆలోచనల వ్యాప్తే లక్ష్యంగా ఏర్పడింది  చార్వాక ఆశ్రమం.

ఏటా ‘నాస్తికమేళా’ నిర్వహిస్తూ జనంలో చైతన్యం 

పెంపొందించడానికి పాటుపడుతోంది. 

ఇదంతా ఒక విద్యావేత్త ఆశయం. 

దాన్ని ఆయన కుటుంబం ముందుకు నడిపిస్తోంది. 

ఎందరిలోనో మార్పు అంకురాలను నాటుతున్న ఆ మహోద్యమం గురించి...


‘‘శ్రమైక జీవన విధానమే మన సంస్కృతికి పునాది. దీనికి భిన్నంగా వినిమయ సంస్కృతి చొచ్చుకువస్తున్న నేటి కాలంలో సమాజాన్ని హేతుబద్ధమైన, శాస్త్రీయమైన ఆలోచనల దిశగా నడిపించి, మన నిజమైన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఇంకా పెరిగింది. ఆ దిశగా తన కార్యాచరణను చార్వాక ఆశ్రమం చేపడుతోంది’’ అంటారు బి. అరుణ. ఈ ఆశ్రమాన్ని జాతీయోద్యమ కాలంలో నడిచిన సంఘ సంస్కరణ ఉద్యమాలకు కొనసాగింపుగా ఆమె అభివర్ణించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలోని నిడమర్రులో ఉంది చార్వాక ఆశ్రమం. దీని వ్యవస్థాపకుడు అరుణ తండ్రి బి. రామకృష్ణ.


ఇదీ నేపథ్యం!

‘‘తపస్సు ద్వారా ఆత్మజ్ఞానం సంపాదించగలమన్న భావవాదుల ప్రచారాన్ని తోసిపుచ్చి, ఇంద్రియ జ్ఞానం ఒక్కటే జ్ఞానసముపార్జనకు మార్గమని ప్రతిపాదించినవారు చార్వాకుడు. భారతదేశంలో క్రీస్తుపూర్వం ఆరువందల నాటికే భౌతికవాదాన్ని రూపొందించి, ప్రచారం చేశారు. మానవ జీవితం గురించి హేతుబద్ధవెతుౖన దృక్పథంతో భారతీయ తాత్త్విక చింతనను ఎంతగానో ప్రభావితం చేశారు. ‘భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మత- మతం’ అని ఆనాడే ప్రకటించారు. తొలి భౌతికవాద తత్త్వమైన చార్వాక, లోకాయత సిద్ధాంతాన్ని తెలుగునాట తొలుత వేమన, ఆ తరువాత త్రిపురనేని రామస్వామి, కొండవీటి వేంకటకవి వంటి వారు ప్రచారం చేశారు. వారి దారిలోనే నడిచి, చార్వాకాన్ని ఇంటి పేరుగా మార్చుకున్నారు మా నాన్న గారు రామకృష్ణ’’ అని అరుణ వివరించారు. 


తొలుత విద్యాపీఠంగా...

రామకృష్ణ అప్పటి తాడికొండ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. ఆ రోజుల్లోని విద్యావిధానం అశాస్ర్తీయమని భావించి, ఆ వ్యవస్థలో ఉండలేక రాజీనామా చేశారు. 1974లో నిడమర్రులో ‘ప్రగతి విద్యావనం’ పేరిట చార్వాక విద్యాపీఠాన్ని స్థాపించారు. మిగిలిన విద్యాలయాలకు భిన్నంగా సిలబ్‌సను రూపొందించారు. తమ విద్యార్థుల్లో ప్రశ్నించే నైజాన్ని ప్రోత్సహిస్తూ, సైంటిఫిక్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌గా దాన్ని తీర్చిదిద్దారు. ప్రశ్న (?) ఈ స్కూల్‌ సింబల్‌. స్వతహాగా మంచి ఉపాధ్యాయుడైన రామకృష్ణ పిల్లలకు నేర్పించాల్సిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. వారికి ప్రేమగా బోధించేవారు. ఈ విద్యాపీఠమే కాలక్రమంలో ‘చార్వాక ఆశ్రమం’గా మారింది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో నేడు మేధావులుగా, సాహితీవేత్తలుగా, అభ్యుదయ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు, ‘చార్వాక’ పత్రిక ద్వారా కూడా తెలుగునాట నాస్తికోద్యమాన్ని రామకృష్ణ విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లారు. ‘‘నాస్తికోద్యమమంటే దేవుడిని నమ్మకపోవడమేనని చాలామంది భావిస్తారు. అయితే దేవుడిని నమ్మడానికి, నమ్మకపోవడానికి కూడా ఒక తాత్వికత ఉన్నదని, పురాతన భారత తత్త్వవేత్తలు అత్యధికులు నాస్తికులేనని కొందరికే తెలుసు’’ అని చెబుతారు అరుణ.


దుస్తులతో ఉన్న వేమన!

చార్వాక ఆశ్రమంలో ప్రవేశించగానే మహాత్మా రావణ మైదానం, దుస్తులు ధరించిన వేమన విగ్రహం కనిపిస్తాయి. వేమన దిగంబరుడు కాదనీ, రావణుడు హింసోన్మాదీ కాదనీ, వేమన 300 ఏళ్ల క్రితమే విగ్రహారాధనను ఖండించి, హేతువాదానికి పట్టం కట్టి, మానవ జిజ్ఞాసకు, తార్కిక దృష్టికీ విలువ ఇచ్చాడనీ అంటారు అరుణ. వేమనను అపహాస్యం చేసేందుకే మతవాదులు, భావవాదులు ఆయనను దిగంబరునిగా, పిచ్చివానిగా చూపించే ప్రయత్నం చేశారన్నారు. ‘‘అందుకే ఆశ్రమం ఆవరణలో వేమన విగ్రహం మాత్రమే కాదు, సామాజిక మార్పు కోసం ఉద్యమించిన అంబేడ్కర్‌, పెరియార్‌ రామస్వామి, త్రిపురనేని రామస్వామి, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, కె.వి.కృష్ణ, సామినేని ముద్దు నరసింహం, పాయసి విగ్రహాలను, ఆశ్రమం లోపల భారతీయ ప్రాచీన హేతువాదులైన అసితకేశకంబళుడు, కణాదుడు, కపిలుడు, మక్కిలిగోశాలుడు తదితరుల విగ్రహాలను ఏర్పాటు చేశాం. ఆ వాదాన్ని ప్రవచించినవారిని ఈ తరానికి పరిచయం చేయడమే ఈ విగ్రహాలను ఏర్పాటు వెనుక ఉద్దేశం’’ అని  చెప్పారామె.


ఏటా ఒక జాతరలా...

ఏ మతానికి చెందిన వారు ఆ మతపరమైన పండగలు, ఉత్సవాలు చేసుకుంటారు. మరి కులమతాలకు అతీతంగా మానవులందరి శ్రేయస్సును కాంక్షించే మానవతావాదులు ఏం చేయాలి? వారిలోని ఈస్థటిక్‌ సెన్స్‌ను ఎలా వ్యక్తపరుచుకోవాలి? ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే ‘నాస్తికమేళా’. 1992లో రామకృష్ణ ఈ మేళాకు రూపకల్పన చేశారు. నాటి నుంచి నేటి వరకూ ప్రతి ఏడాదీ ఫిబ్రవరి రెండో శని, ఆదివారాల్లో నిడమర్రులోని చార్వాక ఆశ్రమంలో భౌతికవాద కుటుంబాల సమ్మేళనంగా, ఒక జాతరలా  ఈ మేళా జరుగుతూనే ఉంది. ఈ మేళాకు అభ్యుదయవాదులు, హేతువాదులు, వామపక్ష భావజాలం కలవారు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి హాజరవుతారు. మూఢనమ్మకాలు, కులమత సమస్యలు, స్ర్తీల అణచివేత, మానవ, సమాజ పరిణామ క్రమం, జీవ వైవిధ్యం, పర్యావరణం తదితర అంశాలపై చర్చలు, ఉపన్యాసాలుంటాయి. ఈ ఏడాది కూడా ఈ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. 


ఆ కలను కొనసాగిస్తూ

తానున్నా లేకున్నా ఈ నాస్తిక మేళా కొనసాగాలని, అందరూ ఇలానే కలుస్తూ ఉండాలన్నది రామకృష్ణ కోరిక. ఆయన 2007లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే కర్తవ్యాన్ని భార్య గృహలక్ష్మి, బిడ్డలు సుధాకర్‌, స్నేహ, అరుణ, చార్వాక స్వీకరించారు. ‘‘మా అమ్మ, సోదరుడు సుధాకర్‌ ఆశ్రమ నిర్వహణలో పూర్తిగా నిమగ్నమయ్యారు. నేను ‘జనసాహితి’ ప్రధాన కార్యదర్శిగా, ‘స్త్రీ విముక్తి సంఘటన’ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఆశ్రమానికి కావలసిన సహకారాన్ని అందిస్తున్నాను’’ అని చెప్పారు అరుణ. సమాజాన్ని కులాలు, మతాలుగా చీల్చివేస్తున్న సమయంలో మానవత్వానికి మాత్రమే పట్టం కట్టే ఇలాంటి ప్రయత్నాలు ఎంతో అవసరం కదూ! 

పద్మావతి వడ్లమూడి

ఫొటోలు: ఎస్‌.విజయ్‌బాబు


ప్రత్యామ్నాయంగా...

జాతీయ ఉద్యమ సమయంలో సంస్కరణ ఉద్యమాలకు సమాంతరంగా ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టి జరిగింది. అందులో కందుకూరి వీరేశలింగం వెలువరించిన సాహిత్యం ఒక ఎత్తు. త్రిపురనేని రామస్వామి పురాణగాథలను భిన్న కోణంలో రచించిన సంజయ రాయబారం, సూత పురాణం, శంభూక వధ వంటి రచనలు మరో ఎత్తు. ఆ ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. 

 బి.అరుణ, జనసాహితి ప్రధాన కార్యదర్శి

Updated Date - 2020-02-20T05:48:20+05:30 IST