నవంబరులో థర్డ్‌ వేవ్‌!?

ABN , First Publish Date - 2021-04-21T08:30:16+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు మూడో వేవ్‌ ముప్పు కూడా తప్పదా? మూడో వేవ్‌ రాకుండా ఉండాలంటే 18 ఏళ్లు పైబడిన వారంతా టీకా వేయించుకోవాల్సిందేనా..

నవంబరులో థర్డ్‌ వేవ్‌!?

  • టీకా వేయించుకోకపోతే తప్పదు!
  • ప్రజలు నిర్లక్ష్య ధోరణి వీడకపోతే ఇక్కట్లే
  • మే రెండో వారంలో కేసులు గరిష్ఠానికి..
  • జూన్‌ చివరి వరకు తగ్గే అవకాశం..!
  • రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అంచనా


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు మూడో వేవ్‌ ముప్పు కూడా తప్పదా? మూడో వేవ్‌ రాకుండా ఉండాలంటే 18 ఏళ్లు పైబడిన వారంతా టీకా వేయించుకోవాల్సిందేనా? అంటే.. వైద్య శాఖ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ ఏడాది నవంబరు నాటికి రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. మొదటిసారి వచ్చింది పెద్ద వేవ్‌ కానే కాదని, ఇప్పుడు వచ్చిందే అసలైన వేవ్‌ అని పేర్కొంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీకా వేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ అంచనాలకు తగ్గట్లుగా ప్రజలు టీకా తీసుకోవడం లేదని వైద్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో ఆ వయసు పైబడిన వారు 2.62 కోట్ల మంది ఉంటారని వైద్యశాఖ అంచనా. ప్రజలు టీకా తీసుకోకపోతే 6 నెలల్లో థర్డ్‌ వేవ్‌ తప్పదని హెచ్చరిస్తోంది.


ఈసారి మరింత బలంగా..

ప్రజలంతా టీకా తీసుకుంటే వైరస్‌ బలహీనపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. టీకా తీసుకోకపోతే వైరస్‌ మరింతగా పరివర్తన చెంది, విజృంభిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర బీ-1617 వైరస్‌ వల్ల తీవ్రస్థాయిలో కేసులు నమోదవుతున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇది డబుల్‌ మ్యుటెంట్‌ కావడంతోనే వ్యాప్తి రేటు వేగంగా ఉందని అంటున్నాయి.

 

మే రెండో వారానికి పీక్‌ స్టేజ్‌..

ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభణ సునామీని తలపిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. మొదటిసారి వచ్చింది అసలు వేవ్‌ కాదని చెబుతున్నారు. గత ఏడాది మార్చిలో వైరస్‌ వ్యాప్తి మొదలై, సెప్టెంబరు నాటికి పతాక స్థాయికి చేరింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత మే చివరి నుంచి పీక్‌ స్టేజ్‌కు చేరడానికి 4 నెలలు పట్టింది, కానీ, ఈసారి మార్చి రెండో వారంలో వేవ్‌ ప్రారంభమైతే కేవలం 4 వారాల్లోనే కేసులు, వ్యాప్తి రేటు 4 రెట్లు పెరిగాయి. గత సెప్టెంబరులో రాష్ట్రంలో అత్యధికంగా 66,423 కేసులు రాగా, 300 మంది మరణించారు. సెకండ్‌ వేవ్‌లో నెల రోజుల్లోనే 63,996 పాజిటివ్‌లు, 201 మరణాలు నమోదయ్యాయి. అదీ వైద్యశాఖ ఇచ్చే లెక్కల ప్రకారమే! అంటే ప్రస్తుత వేవ్‌ ఎంత ఉధృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే రోజూ గరిష్ఠంగా 1.25-1.30 లక్షల టెస్టులు చేస్తున్నారు. అంతకుమించి పరీక్షలు చేయడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఏప్రిల్‌ 1 నుంచి రోజూ సగటున 2700 కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన మే రెండో వారం వరకు కేసులు పీక్‌ స్టేజ్‌కి వస్తాయని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత కేసుల నమోదులో స్థిరత్వం వస్తుందని చెబుతున్నాయి. జూన్‌ చివరి నాటికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. 


అలాగైతే థర్డ్‌ వేవ్‌ ఇక్కట్లు తప్పుతాయి 

రాష్ట్రంలో అర్హులందరూ తప్పకుండా టీకా తీసుకోవాలి. అప్పుడే థర్డ్‌ వేవ్‌ ఇబ్బందులు తప్పుతాయి. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉంది. కేసుల పెరుగుదల అనేది ప్రజల ప్రవర్తనపై ఆధారపడి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలి. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం జూన్‌ చివరి వరకు కేసుల పెరుగుదల ఇలాగే ఉండే అవకాశం ఉంది. ప్రజలు టీకా తీసుకోకుండా నిర్లక్ష్య ధోరణితో ఉంటే వైరస్‌ మరింత బలపడే ప్రమాదం లేకపోలేదు. 

 డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు

Updated Date - 2021-04-21T08:30:16+05:30 IST