Abn logo
Aug 29 2021 @ 03:14AM

ఇన్నింగ్స్‌ తేడాతో.. ఢమాల్‌

ఇంతలోనే ఎంత తేడా! శుక్రవారం 80 ఓవర్లలో 215/2 స్కోరుతో దీటుగా 

నిలిచిన భారత్‌.. మరుసటి రోజు ఒక్క సెషన్‌లోనే కుప్పకూలుతుందని ఎవరైనా ఊహించారా? కానీ జరిగిందదే.. క్రీజులో పుజార, కోహ్లీ ఉండడంతో భారత్‌      ప్రత్యర్థికి కాస్తయినా సవాల్‌ విసురుతుందేమోనని అభిమానులు ఆశించారు. కానీ  రెండో కొత్త బంతితో పేసర్‌ రాబిన్సన్‌ టీమిండియాను ముప్పుతిప్పలు  పెట్టాడు.  అతడికి ఒవర్టన్‌ సహకరించగా 20 ఓవర్లలోపే విరాట్‌ సేన దాసోహమై ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్‌ విజయాన్ని అందించింది.

ఇంగ్లండ్‌కు అత్యధిక టెస్టు విజయాలు (27) అందించిన కెప్టెన్‌గా జో రూట్‌. మైకేల్‌ వాన్‌ (26)ను అధిగమించాడు.

మూడో టెస్టులో భారత్‌ ఘోర పరాజయం

రెండో ఇన్నింగ్స్‌ 278 ఆలౌట్‌ ఇంగ్లండ్‌ ప్రతీకారం

కోహ్లీ నేతృత్వంలో భారత్‌కిది రెండో ఇన్నింగ్స్‌ పరాజయం

స్వదేశంలో 400 టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా అండర్సన్‌. మురళీధరన్‌ (493) టాప్‌లో ఉన్నాడు.


లీడ్స్‌: లార్డ్స్‌ టెస్టు పరాభవానికి ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు గట్టిగానే బదులు తీర్చుకుంది. భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో ఐదు సెషన్‌లుండగానే గెలుపు రుచి చూసిన ఇంగ్లండ్‌.. ఐదు టెస్టుల సిరీ్‌సలో 1-1తో నిలిచింది. నాలుగో టెస్టు వచ్చే నెల 2 నుంచి ఓవల్‌ మైదానంలో జరుగుతుంది. పేసర్లు ఒలీ రాబిన్సన్‌ (5/65), ఒవర్టన్‌ (3/47) భారత్‌ పతనాన్ని శాసించారు. దీంతో శనివారం నాలుగో రోజు మరో 63 పరుగులు మాత్రమే జత చేసిన భారత్‌ 99.3 ఓవర్లలో 278 రన్స్‌ వద్ద కుప్పకూలింది. విరాట్‌ కోహ్లీ (55) అర్ధసెంచరీ చేయగా.. పుజార 91 పరుగుల వద్దే వెనుదిరిగాడు. జడేజా (30) మాత్రం చివర్లో వేగం చూపాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 78.. ఇంగ్లండ్‌ 432 పరుగులు చేశాయి. మొత్తం ఏడు వికెట్లతో రాబిన్సన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

పేకమేడలా:

వాస్తవానికి రెండో ఇన్నింగ్స్‌ను భారత్‌ వీరోచితంగా ఆరంభించిన తీరుతో ఒక్కసారిగా ఈ టెస్టుపై ఫ్యాన్స్‌కు ఆసక్తి పెరిగింది. పైగా చేతిలో 8 వికెట్లు ఉండడంతో కచ్చితంగా శనివారమంతా బ్యాటింగ్‌ చేస్తారనే అంతా భావించారు. కానీ రెండో కొత్త బంతితో ఇంగ్లండ్‌ పేసర్లు తీవ్ర ఒత్తిడి పెంచడంతో పోరాటమే లేకపోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 215/2కు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే పుజార వెనుదిరగడం నిరాశపరిచింది. రాబిన్సన్‌ ఇన్‌ కట్టర్‌ను అతడు సరిగ్గా అంచనా వేయక వదిలేశాడు. అయితే అది నేరుగా వచ్చి ప్యాడ్లను తాకడంతో ఎల్బీ అయ్యాడు. ఇక అక్కడి నుంచి వికెట్ల పతనం సాగింది. రెండు ఫోర్లతో అర్ధసెంచరీ పూర్తిచేసిన కోహ్లీని కూడా రాబిన్సన్‌ దెబ్బతీశాడు. దీంతో జట్టు మరింత ఒత్తిడిలో పడింది. ఫలితంగా వరుస ఓవర్లలో రహానె (10), పంత్‌ (1) వికెట్లను కోల్పోగా టెయిలెండర్ల నుంచి ఈసారి అద్భుతాలేమీ జరగలేదు. అయితే జడేజా మాత్రం ఓ సిక్సర్‌తో పాటు హ్యాట్రిక్‌ ఫోర్లతో బ్యాట్‌ ఝుళిపించాడు. చివరికి 100వ ఓవర్‌లో జడేజా, సిరాజ్‌ (0) వికెట్లను ఒవర్టన్‌ తీయడంతో భారత్‌ కథ ముగిసింది.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 78 ఆలౌట్‌

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 432 ఆలౌట్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) రాబిన్సన్‌ 59; రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఒవర్టన్‌ 8; పుజార (ఎల్బీ) రాబిన్సన్‌ 91; కోహ్లీ (సి) రూట్‌ (బి) రాబిన్సన్‌ 55; రహానె (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 10; పంత్‌ (సి) ఒవర్టన్‌ (బి) రాబిన్సన్‌ 1; జడేజా (సి) బట్లర్‌ (బి) ఒవర్టన్‌ 30; షమి (బి) మొయిన్‌ అలీ 6; ఇషాంత్‌ (సి) బట్లర్‌ (బి) రాబిన్సన్‌ 2; బుమ్రా (నాటౌట్‌) 1; సిరాజ్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఒవర్టన్‌ 0; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 99.3 ఓవర్లలో 278 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-34, 2-116, 3-215, 4-237, 5-239, 6-239, 7-254, 8-257, 9-278, 10-278. బౌలింగ్‌: జేమ్స్‌ అండర్సన్‌ 26-11-63-1; ఒలీ రాబిన్సన్‌ 26-6-65-5; క్రెగ్‌ ఒవర్టన్‌ 18.3-6-47-3; సామ్‌ కర్రాన్‌ 9-1-40-0; మొయిన్‌ అలీ 14-1-40-1; జో రూట్‌ 6-1-15-0.

క్రైమ్ మరిన్ని...