ఆ త్యాగాన్ని తలచుకుంటూ...
ABN , First Publish Date - 2021-08-20T05:30:00+05:30 IST
హిజ్రీ శకం ప్రకారం మొహర్రమ్ను మొదటి నెలలుగా పరిగణిస్తారు. చంద్రుడి కళల ఆధారంగా... ఈ మాసానికీ, ఈ మాసంలోని పదవ రోజుకూ చాలా ప్రాధాన్యం ఉంది.
పీరీల అనుగ్రహం కోసం...
హిజ్రీ శకం ప్రకారం మొహర్రమ్ను మొదటి నెలలుగా పరిగణిస్తారు. చంద్రుడి కళల ఆధారంగా... ఈ మాసానికీ, ఈ మాసంలోని పదవ రోజుకూ చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పదవ రోజును ఆఘారా అంటారు. మొహర్రమ్ మాసంలో 9, 10 లేదా, 10, 11 దినాల్లో.. రెండు రోజులు ఉపవాసాలు (రోజాలు) ఉండాలని మహా ప్రవక్త మహమ్మద్ ఆదేశించారు. సంవత్సర కాలంలో చేసిన పాపాలకు ఈ రోజాల వల్ల క్షమాపణ లభిస్తుంది. అయితే, ఒక ఉపవాసం మాత్రమే పాటించడం నిషిద్ధం. మొహర్రమ్ సందర్భంగా ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకొని... గుండెలను బాదుకుంటూ, ఊరేగింపులు జరపడం సంప్రదాయం. దీన్ని ‘పీర్ల పండుగ’ అని పిలుస్తారు. కానీ నిజానికిది సంతాపాన్ని వ్యక్తం చేసే రోజు. ముస్లింలు ఈ మాసంలోని తొలి 10 రోజులు పీరీలకు (సవార్లు) మొక్కుతారు. 10వ రోజు వాటిని ఊరేగిస్తారు. తమకు కష్టాలు రాకుండా చూడాలనీ, కోర్కెలు నెరవేరేలా అనుగ్రహించాలనీ ప్రార్థనలు చేస్తారు.
అల్లాహ్ తన భక్తులైన మానవులకు ధన ప్రాణాలను ప్రసాదిస్తాడు. వాటిని తన మార్గంలో త్యాగం చేయాలనీ, అలా చేసిన ప్రాణ త్యాగానికి బదులుగా స్వర్గాన్ని ప్రసాదిస్తాననీ హామీ ఇస్తున్నాడు. ‘‘దైవమార్గంలో మరణించినవారిని మృతులు అని పిలవకండి. వారు మరణించినప్పటికీ సజీవులే!’’ అని అల్లాహ్ చెబుతున్నాడు. విధి నిర్వహణలో, ఆ అల్లాహ్ మార్గంలో ప్రాణత్యాగం చేస్తే... అది మనకు మనం చేసుకున్న మహోపకారమే. అలాంటి త్యాగాన్ని ముహర్రమ్ మాసం పదో రోజున... మహా ప్రవక్త మనుమడు, హజ్రత్ అలీ, బీబీ ఫాతిమాల కుమారుడు, అమరవీరుడు అయిన ఇమామ్ హుస్సేన్ చేశారు. ధర్మ పరిరక్షణ కోసం సర్వ సంపదలనూ, ప్రాణాలనూ తృణప్రాయంగా అర్పించారు.
అద్వితీయ సంగ్రామం
కర్బలా మైదానంలో జరిగిన అద్వితీయ సంగ్రామం... గొప్ప చారిత్రకమైన సంఘటన. ఇస్లామ్ ధర్మంలో ఖలీఫా వ్యవస్థ ఉంది కానీ రాచరిక వ్యవస్థ లేదు. ‘రాజు కుమారుడు రాజు కావడం, మంత్రి కుమారుడు మంత్రి కావడం’ అనే అనువంశిక వ్యవస్థ అసలే లేదు. ఖలీఫా ఎన్నిక మూడు సూత్రాల ప్రకారం... ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేది. మొదటిది: మహా ప్రవక్త పద్ధతిని అనుసరించడం. అంటే ప్రజలే ఖలీఫాను ఎన్నుకోవాలి. రెండవది: మొదటి ఖలీఫా హజ్రత్ అబూబకర్ చేసిన విధంగా... పాలకులు తమకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని ఖలీఫాగా సూచించవచ్చు. మూడవది: రెండో ఖలీఫా హజ్రత్ ఉమర్ చేసినట్టు... ఖలీఫా ఎన్నికను కొందరు మేధావులతో ఏర్పాటైన సలహా సంఘానికి అప్పగించవచ్చు. వారు తమలో ఒకరిని ఖలీఫాగా ఎన్నుకుంటారు. కానీ హజ్రత్ మావియా తన కుమారుడైన యజీద్‌ను యువరాజును చేసి... ఈ మూడు ధర్మ సూత్రాలనూ కాలరాశాడు. అక్కడి నుంచే రాచరిక వ్యవస్థ ప్రారంభమయింది.
తలవంచని ధర్మ యోధుడు
నాలుగో ఖలీఫా హజ్రత్ అలీ ఆ తరువాత హజ్రత్ మావియా ఆ బాధ్యతలు చేపట్టాడు. ఆయన అరేబియా దేశాన్ని 19 సంవత్సరాలు పాలించాడు. కానీ పుత్ర వ్యామోహానికి లొంగిపోయి... అయోగ్యుడైన, దుర్య్వసనపరుడైన తన కుమారుడు యజీద్‌ను యువరాజుగా నియమించాడు. దాన్ని ఇమామ్ హుసేన్, దైవ ప్రవక్త అనుచరులు బాహాటంగా వ్యతిరేకించారు. యజీద్‌ను రాజుగా ఒప్పుకొనేది లేదంటూ తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో, ఇమామ్ హుసేన్ మక్కాలో ఉన్నారు. హుసేన్ తమ వద్దకు రావాలని, ఆయనను రాజుగా గుర్తిస్తామని కూఫా నగర ప్రజలు అసంఖ్యాకంగా లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో... యజీద్‌తో ముఖాముఖి చర్చలు జరపడం కోసం తన 72 మంది ప్రత్యక్ష సహచరులు, కుటుంబ సభ్యులతో మక్కా నుంచి కూఫా నగరానికి ఇమామ్ హుసేన్ బయలుదేరారు. వారు కూఫా నగరానికి చేరక ముందే.. తన ప్రభుత్వాన్ని హుసేన్ గుర్తించేలా యజీద్ కుట్రలు పన్నాడు. కానీ యజీద్‌ను రాజుగా గుర్తించడానికి హుసేన్ ఏమాత్రం ఒప్పుకోలేదు. ‘‘నాలో ప్రాణం ఉన్నంత వరకూ అధర్మంతో పోరాడుతూనే ఉంటాను. యజీద్ ముందు తల వంచేది లేదు’’ అని బహిరంగ ప్రమాణం చేశారు. హుసేన్ ప్రదర్శించిన ధిక్కారానికీ, తిరుగుబాటు ధోరణికీ యజీద్ ఆగ్రహించాడు. అతని సైన్యం కర్బలా అనే ప్రదేశంలో హుసేన్నూ, ఆయన పరివారాన్నీ అడ్డగించింది. కనీసం నీటి బొట్టయినా వారికి అందకుండా ఫరాత్ నది ఒడ్డున గట్టి బందోబస్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇరు పక్షాల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. శత్రువులు నాలుగువేలకు పైగా ఉండడంతో హుసేన్ సైన్యంలో చాలామంది అమరులయ్యారు. వారి రక్తంతో కర్బలా మైదానం తడిసిపోయింది.
చివరకు యుద్ధ భూమిలో ఇమామ్ హుసేన్ ఒంటరిగా మిగిలిపోయారు. దప్పికకు తట్టుకోలేక, శత్రు మూకలను చెండాడుతూ ఫరాత్ నది వైపు నీళ్ళ కోసం వెళ్ళారు. ఈలోగా మహిళలు, పిల్లలు ఉన్న తమ గుడారాలకు నిప్పు పెట్టారనే వదంతి రావడంతో... దప్పిక తీర్చుకోకుండానే ఆయన వెనుతిరిగారు. గుడారాలకు శత్రువులు నిప్పు పెట్టలేదు కానీ, తన కుమారుడు అలీ అస్గర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసింది. ఆ పసిబాలుడికి గుక్కెడు నీళ్ళయినా ఇవ్వాలని శత్రుసైన్యాన్ని హుసేన్ అర్థించారు. కానీ కర్కశులైన శత్రు సైనికులు ఆ పసిబాలుడి మీదకు బాణాలు కురిపించారు. ఒక బాణం ఆ బాలుడి గొంతులో దిగి నెత్తురు చిమ్మింది. దీంతో శత్రు సైన్యం మీద హుసేన్ విరుచుకుపడ్డారు. ఈలోగా ఆ రోజు నమాజ్ సమయమైంది. హుసేన్‌ను చంపడానికి శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. అయినా ఆయన నమాజ్ మానలేదు. సజ్దా చెయ్యడానికి ఆయన శిరసు వంచి నేల మీద పెట్టగానే... శత్రువులు మీద పడ్డారు. ఆయన తలనూ, చేతులనూ ఖండించారు. వాటిని బల్లేలకూ, బరిసెలకూ తగిలించి గంతులు వేశారు. తాను నమ్మిన ధర్మ రక్షణ కోసం ఇమామ్ హుసేన్ ప్రాణాలను అర్పించిన రోజును ముహర్రమ్ లేదా మొహర్రమ్ పేరిట ముస్లింలు జరుపుకొంటారు. హుసేన్ త్యాగనిరతిని, వీరత్వాన్ని గుర్తు చేసుకుంటారు.
మహమ్మద్ వహీదుద్దీన్
