చలి, జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలుంటే కరోనానా..!?

ABN , First Publish Date - 2022-02-01T16:49:17+05:30 IST

చలి, జ్వరం, దగ్గు, జలుబు.. లాంటి లక్షణాలు ఉంటే చాలు.. అది కరోనానా..

చలి, జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలుంటే కరోనానా..!?

  • అవగాహన లేక అయోమయంలో జనం
  • కొంతమంది కొవిడ్‌ బాధితుల్లోనూ డెంగీ లక్షణాలు

హైదరాబాద్‌ సిటీ : చలి, జ్వరం, దగ్గు, జలుబు.. లాంటి లక్షణాలు ఉంటే చాలు.. అది కరోనానా..?, మలేరియానా..? లేక డెంగీనా..?, సాధారణ ఫ్లూనా..? అనే ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి లక్షణాలతో వచ్చిన బాధితులకు పరీక్షలు చేస్తే కొందరిలో కొవిడ్‌తో పాటు డెంగీ, మలేరియా కూడా బయట పడుతున్నాయి. ఎక్కువ మందిలో కొవిడ్‌తో పాటు డెంగీ ఉన్నట్లు తేలుతోందని వైద్యులు పేర్కొంటున్నారు.  బలహీనత, బద్ధకం, చలి, జ్వరం, జలుబు వంటి లక్షణాలు రెండిట్లోనూ కనిపిస్తుంటాయని అంటున్నారు. అలాంటి వారిలో కొందరు ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందుతుండగా, మరికొందరు ఇంటి వద్దే వైద్యుల సలహా, మందులతో కోలుకుంటున్నారు. డెంగీ, కొవిడ్‌ కలిపి రావడం ఆందోళన కలిగిస్తోందని వైద్యులు తెలిపారు. చాలా మంది ఆ లక్షణాలు ఆధారంగా కొవిడ్‌గా అనుమానించి చికిత్సలు తీసుకుంటున్నారు.


వేర్వేరు చికిత్సలు..

డెంగీ దోమ ద్వారా వ్యాపిస్తే, కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో వస్తుంది. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. రోగులకు చికిత్స కూడా వేర్వేరుగా ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రెండు జబ్బులున్న రోగిలో కొన్ని సార్లు ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ తగ్గి పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు రోగిలో రక్త కణాలు, ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ పరిస్థితిని పరిశీలించాలని సూచిస్తున్నారు.


రెండూ ఒకరిలోనే చూస్తున్నాం..

కొవిడ్‌, డెంగీ రెండు సమస్యలనూ ఒకే రోగిలో ఇటీవల చూస్తున్నాం. కొవిడ్‌ లక్షణాలు ఉన్నప్పటికీ కొందరిలో వెంటనే వైరస్‌ నిర్ధారణ కాదు. దీంతో వారు బయట తిరుగుతుంటారు. ఈ సమయంలో బాధితులు డెంగీ బారిన పడే ముప్పు ఉంటుంది. బాధితులకు సిటీస్కాన్‌ చేసినప్పుడు రెండు జబ్బులకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు ఒకే రకంగా ఉన్నట్లు తేలుతోంది. చికిత్సలు వేర్వేరుగా అందించాల్సి ఉంటుంది. 

- డాక్టర్‌ నవోదయ, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, కేర్‌ ఆస్పత్రి.


ప్లేట్‌లెట్స్‌, ఆక్సిజన్‌ పర్యవేక్షిస్తుండాలి..

కొవిడ్‌ బాధితులకు డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయితే వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాం. రెండు సమస్యలున్న వారికి నిరంతరం బీపీ, శ్వాస కోశ పరిస్థితులు, ఆక్సిజన్‌, హిమోగ్లోబిన్‌ వంటివి పరిశీలిస్తూ ఉండాలి. ఎక్కువ మందికి సాధారణ స్థితిలోనే తగ్గిపోతుంది. ఇప్పటి వరకు ఇరవై మంది వరకు  ఈ తరహా కేసులకు చికిత్సలు అందించాం. - డాక్టర్‌ సౌమ్య బండలపాటి, జనరల్‌ ఫిజీషియన్‌, కాంటినెంటల్‌ ఆస్పత్రి.

Updated Date - 2022-02-01T16:49:17+05:30 IST