Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమైక్రాన్ కమ్ముకొస్తున్నందున... ఖరీదైన్ ఐపీఓలు రిస్క్ కావచ్చు...

హైదరాబాద్/ముంబై : సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్(ఎస్‌ఏఏఎస్) ప్రొవైడర్ రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ ఐపీఓ... రేపు(మంగళవారం) ప్రారంభమై, 9 న ముగియనుంది. ప్రైస్‌ బ్యాండ్‌ రూ. 405-రూ. 425. ఫ్రెష్‌ షేర్ల ఇష్యూ ద్వారా రూ. 375 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 961 కోట్ల మేర సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ తర్వాత... ప్రమోటర్ గ్రూప్ వాటా 67 శాతం నుంచి దాదాపు 57 శాతానికి తగ్గనుంది. కాగా... సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌లో ‘ఎస్‌ఏఏఎస్’... పాపులర్‌ డెలివరీ మోడల్‌గా మారుతోంది. ట్రావెల్ & హాస్పిటాలిటీ సెగ్మెంట్‌ నుంచి సింహభాగం రెవెన్యూ సాధిస్తోన్న రేట్‌గెయిన్‌కు... ఈ బిజినెస్‌ మోడల్‌‌ను  ప్లస్‌ పాయింట్‌‌గా భావిస్తున్నారు.


అయితే... ఒమైక్రాన్ మేఘాలు మళ్లీ కమ్ముకొస్తుండడంతో... పలు దేశాలు ఆంక్షల బాట పడుతోన్న విషయం తెలిసిందే. అన్‌లాక్ నేపధ్యంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ట్రావెల్, హాస్పిటాలిటీ రంగాలపై ఒమిక్రాన్ భయాందోళనల నేపధ్యంలో... మరోమారు దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేట్‌గెయిన్ వ్యాపారంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఈ ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలిలా ఉన్నాయి. ఈ కంపెనీ...  2004 లో ప్రారంభమైంది. కొత్త కస్టమర్లను ఆకర్షించడం, వచ్చినవారిని నిలుపుకోవడం, ఆదాయ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ట్రావెల్, హాస్పిటాలిటీ కంపెనీలకు ఇది సొల్యూషన్స్‌ అందిస్తుంది. దీని క్లయింట్లలో హోటల్ చైన్లు, కార్ రెంటల్ కంపెనీలు, క్రూయిజ్, ఎయిర్‌లైన్స్, ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇక... 2021 ఆర్ధిక సంవత్సరంలో...  44.2 % ఆదాయాన్ని సబ్‌స్క్రిప్షన్ల నుంచి, ఆ తర్వాతి ఆదాయాన్ని... లావాదేవీలు, హైబ్రిడ్ అరేంజ్‌మెంట్స్‌ నుంచి పొందింది.


దీని ఆదాయంలో దాదాపు మూడింట రెండు వంతులు అమెరికా నుంచి, 15 % యూరోప్ నుంచి సమకూరుతోంది. ఇక... టాప్‌లైన్‌లో దాదాపు సగభాగాన్నిచ్చే డిస్ట్రిబ్యూషన్‌ సహా  మూడు మేజర్‌ స్ట్రీమ్స్‌ ద్వారా ఆదాయాన్ని పొందుతోంది. సర్వీస్ ప్రొవైడర్ల లభ్యత, ధరలు, కనెక్టివిటీలను ఈ స్ట్రీమ్‌ అందిస్తుంది. మార్కెట్ ఇంటెలిజెన్స్, డైనమిక్ ప్రైసింగ్‌ డేటాను ఒక సర్వీస్‌గా రెండో స్ట్రీమ్ అందిస్తోంది, ఆదాయంలో దీని వాటా 37 %. కస్టమర్ సంతృప్తి, విశ్వసనీయత, బ్రాండ్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడంపై దృష్టి పెట్టే మార్కెటింగ్ టెక్నాలజీ నుంచి మిగిలిన ఆదాయం వస్తుంది.


ఆర్థిక స్థితిగతులు...  

ఇది నష్టాల్లో ఉన్న కంపెనీ. ఆర్ధిక సంవత్సరం 20 లోని రూ. 398.7 కోట్ల ఆదాయం... ఆర్ధిక సంవత్సరం 2021 లో రూ. 250.8 కోట్లకు తగ్గింది, నికర నష్టం రూ. 20.1 కోట్ల నుంచి రూ. 28.6 కోట్లకు పెరిగింది. ఇక... ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆగస్టు వరకు(అంటే... ఐదు నెలల్లో)  ఆదాయం రూ. 125.3 కోట్లు కాగా, నికర నష్టం రూ. 8.3 కోట్లు.


వాల్యుయేషన్...  

ఈ ఏడాది జులైలో... ఫేస్‌ వాల్యూ రూ. 10 గా ఉన్న ఒక్కో షేర్‌ను పది షేర్లుగా విభజించి, ఫేస్‌వాల్యూను ఒక రూపాయిగా మార్చింది. ఆగస్టులో, ఇప్పటికే ఉన్న ప్రతి షేరుకు... పదకొండు బోనస్ షేర్లను జారీ చేసింది. నవంబరు  22 న, ఇన్వెస్టర్ వ్యాగ్నర్‌కు... షేరుకు సగటున రూ. 75.3 చొప్పున   కోటికి పైగా షేర్లను,  కేటాయించింది.  మరో ఇన్వెస్టర్... అవతార్‌కు గతేడాది ఆగస్టు, అక్టోబరు నెలల్లో... ఒక్కో షేరును దాదాపు రూ. 145 చొప్పున, 76.5 లక్షల షేర్లను కేటాయించింది. తన వద్ద ఉన్న 2.3 కోట్ల షేర్లలో 1.7 కోట్ల షేర్లను వ్యాగ్నర్ ఐపీఓలో ఆఫ్‌లోడ్ చేస్తోంది.


ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల ఆదాయాన్ని యాన్యుయలైజ్‌ చేసి చూస్తే... 15.1 రెట్ల ప్రైస్‌/సేల్స్‌ (పీ/ఎస్)ను ఐపీఓ డిమాండ్‌ చేస్తోంది. భారత్‌లో లిస్టైన ప్యూర్-ప్లే ఎఏఏఎస్ పీర్స్‌ లేవు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... ఫ్రెష్‌వర్క్స్, సర్వీస్ నౌ, జెన్‌డెస్క్ ఉన్నాయి. ఇవి పీ/ఎస్  రేషియోకు 9-25 రెట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే... ఐపీఓ బాగా కాస్ట్‌లీగా ఉన్నట్లు,  కొత్త వేరియంట్‌ నేపధ్యంలో రిస్కీగా కూడా ఉన్నట్లు  కనిపిస్తోంది.

Advertisement
Advertisement