ఆలయాలపై దాడుల్లో కుట్ర లేదు

ABN , First Publish Date - 2021-01-14T08:27:36+05:30 IST

రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో కుట్రకోణం లేదని.. దొంగలు, నిధి వేటగాళ్లు, మూఢ నమ్మకాలు, ఆస్తి గొడవలు, పిచ్చివాళ్లు, అడవి జంతువులు కారణమని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు.

ఆలయాలపై దాడుల్లో కుట్ర లేదు

  • దొంగలు, పిచ్చోళ్లు, జంతువుల వల్లే ఘటనలు
  • 44 ఘటనల్లో 29 తేల్చాం.. మిగతా వాటిపై ‘సిట్‌’ 
  • 80 మంది అరెస్ట్‌.. అంతర్రాష్ట్ర ముఠాల పాత్ర ఉంది
  • అంతర్వేదిపైనా సిట్‌ దర్యాప్తు.. సీబీఐతో జాప్యం 
  • సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలపై ఉక్కుపాదం: డీజీపీ


అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో కుట్రకోణం లేదని.. దొంగలు, నిధి వేటగాళ్లు, మూఢ నమ్మకాలు, ఆస్తి గొడవలు, పిచ్చివాళ్లు, అడవి జంతువులు కారణమని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. అంతర్వేది రథం దగ్ధం నుంచి రామతీర్థం ఘటన వరకు రాష్ట్రంలో 44 ఘటనలు జరగ్గా వీటిలో 29 ఘటనలకు ఎవరు కారకులో తేల్చేశామని చెప్పారు. వాటిలో ఎక్కడా కుట్రకోణం కనిపించలేదని, మిగతా వాటిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసేందుకు డీఐజీ అకోశ్‌ కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండేందుకు నిరంతం శ్రమిస్తున్న పోలీసులపై కుల, మత, ప్రాంత ముద్రలు వేయడం తగదని ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. డీజీపీ సవాంగ్‌ బుధవారం మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో సిట్‌ చీఫ్‌ అశోక్‌ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.


‘‘రాష్ట్రంలో ఆలయాలపై దాడులకు సంబంధించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు వాస్తవం కాదు. గత ఏడాది సెప్టెంబరు నుంచి జరగిన 44 ఘటనల్లో 29 ఘటనల నిగుతేల్చాం. ఏ ఒక్క దాంట్లోనూ కుట్రకోణం కనిపించలేదు. అరెస్టయిన 80 మందిలో అంతర్రాష్ట్ర ముఠాలు కూడా ఉన్నాయి. అంతర్వేది రథం దగ్ధం తర్వాత అల్లర్లు, ఆరోపణలు మొదలయ్యాయి.


 చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులకు కులం, మతం, ప్రాంతం ఆపాదిస్తున్నారు. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు పోలీసులు ప్రాణాలు ఫణంగా పెట్టి డ్యూటీ చేశారు. అలాంటి మాపై ఆరోపణలు చేయడం తగదు. ఆలయాల్లో 30,551 సీసీ కెమెరాలు, 15,394 గ్రామాల్లో శాంతి కమిటీలు ఏర్పాటు చేశాం. 4,614 మందిపై నిఘా పెట్టాం, వారిలో 1,635 మంది పాత నేరస్తులు ఉన్నారు. రామతీర్థంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు జరుగుతున్న క్రమంలో మూడు రోజుల ముందు ఎవరో దుశ్చర్యకు పాల్పడ్దారు. అంతర్వేది రథం దగ్ధం కేసు సీబీఐకి అప్పగించినా ఇంకా తీసుకోక పోవడంతో ఆలస్యం కాకుండా సిట్‌ దర్యాప్తు చేయబోతోంది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠినంగా ఉంటాం. మీడియా కూడా చెక్‌ చేసుకోకుండా వార్తలు ప్రసారం చేయవద్దు’’ అని సవాంగ్‌ అన్నారు. 


విధ్వంసాల వెనకున్న కారణాలు

ఆలయాల్లో జరిగిన వరుస విధ్వంసాలపై పోలీసు దర్యాప్తులో బయట పడ్డ కొన్ని ఆసక్తికర ఘటనలను డీజీపీ వివరించారు. ‘‘కర్నూలు జిల్లాలోని కాల భైరవ విగ్రహ ధ్వంసం వెనుక సంతానం కలగలేదన్న మూఢ నమ్మకం ఉంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలంలో హనుమంతుడి విగ్రహ ధ్వంసానికి ఎలుగు బంటి కారణమని తేలింది. కడప జిల్లా బద్వేలులో ఆంజనేయుడి విగ్రహానికి చెప్పుల దండ వేయడం వెనుక భూ వివాద పరిష్కారం ఎత్తుగడ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మహాలక్ష్మి, పోతురాజు ఆలయ ధ్వంసం వెనుక పొరుగింటిపై ఆలయ నీడ పడితే మంచిది కాదన్న మూఢ నమ్మకం బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా రౌతుల పూడి మండలంలో గంగాదేవి విగ్రహ ధ్వంసంలో యువతి ర్యాగింగ్‌ వ్యవహారంలో గ్రామస్తులతో దేహశుద్ధి చేయించుకున్న యువకుడి పాత్ర బయటపడింది. శ్రీకాళహస్తి ఆలయంలో విగ్రహాల ఏర్పాటు వెనుక ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయన్న మూఢ నమ్మకమే కారణం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై.. తల్లి ఆరోగ్యం కోసం ఒక తాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి పలు విగ్రహాలు ధ్వంసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.


 నెల్లూరు జిల్లా బిట్రగుంటలో మతి స్థిమితంలేని వ్యక్తి రథానికి నిప్పు పెట్టినట్లు బయట పడింది. ఆదోనిలో ఆంజనేయుడు, గుడివాడలో పోతురాజు, కాకినాడలో నూకాలమ్మ, ఏలేశ్వరంలో హనుమంతుడి విగ్రహాల ధ్వంసం వెనుక మద్యానికి బానిసైనవారి చర్య ఉన్నట్లు తేలింది.  కర్నూలు, విశాఖ జిల్లాల్లో మరో రెండు ఘటనలు ప్రమాదవశాత్తు జరిగాయి’’ అని డీజీపీ వివరించారు. అంతర్వేది రథం దగ్ధం నుంచి రామతీర్థం వరకు 15 ఘటనల్లో బాధ్యులను గుర్తించాల్సి ఉందని డీజీపీ చెప్పారు. ఆలయాలపై దాడులకు సంబంధించి సమాచారం తెలిసినవారు 9392903400కు తెలియజేయాలని డీజీపీ కోరారు. 


కాగా.. బెజవాడ కనకదుర్గ ఆలయంలో ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమైన విషయాన్ని డీజీపీ ప్రస్తావించక పోవడం గమనార్హం. అదేసమయంలో హిందూ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారా? అంటే వాటిని సిట్‌ చూస్తుందని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. 

Updated Date - 2021-01-14T08:27:36+05:30 IST