ఆరు మార్గాలున్నాయి...

ABN , First Publish Date - 2022-08-11T08:01:38+05:30 IST

ఆరు మార్గాలున్నాయి...

ఆరు మార్గాలున్నాయి...

అనంతపురం జిల్లా ఎస్పీ చెబుతున్నట్లుగా ‘సోర్స్‌’ (ఒరిజినల్‌) వీడియో లేనప్పటికీ... ఇప్పుడు సోషల్‌ మీడియాలో తిరుగుతున్న వీడియోలో ఉన్నది ఎవరు? అందులో అతికించిన దృశ్యాలున్నాయా? అనే సంగతి తేల్చవచ్చునని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘‘ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోను సోర్స్‌గా పరిగణించలేం. అలాగని... అది మార్ఫింగ్‌ అనడానికి వీల్లేదు. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ 1860 ప్రకారం ప్రైమరీ ఎవిడెన్స్‌ లేనప్పుడు సెకండరీ ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. స్ట్రీమింగ్‌ అవుతున్న వీడియోను రికార్డు చేసినప్పుడు అది మార్ఫింగ్‌ కిందకు రాదు’’ అని సైబర్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక వీడియో అసలైనదేనా, లేక అతికించడం, మార్ఫింగ్‌ వంటివి జరిగాయా... అని తెలుసుకునేందుకు ఆరు శాస్త్రీయ విధానాలు ఉన్నాయి. అవేమిటంటే...

ఎర్రర్‌ కోడ్‌ అనాలసిస్‌: ఈ విధానంలో వీడియోలో ఉన్న పిక్సెల్స్‌ను సూక్ష్మస్థాయిలో క్షుణ్నంగా పరిశీలిస్తారు. వీడియోను ఫ్రేమ్‌లుగా మార్చి ఒక్కో పిక్సెల్‌ను విశ్లేషిస్తారు. పిక్సెల్స్‌ మధ్య వ్యత్యాసం ఉంటే గుర్తిస్తారు.

ల్యూమినస్‌ గ్రేడియంట్‌ వెరిఫికేషన్‌: వీడియోలో ఉన్న లైటింగ్‌ను విశ్లేషించే ప్రక్రియ ఇది.

క్లోన్‌ డిటెక్షన్‌: వీడియోను ముందుగా స్లో మోషన్‌లో పరిశీలిస్తారు. అందులో ఎక్కడైనా డూప్లికేషన్‌ ఉందా లేదా అని తెలుసుకుంటారు.

ప్రిన్సిపల్‌ కాంపొనెంట్‌ అనాలసిస్‌: వీడియోను ఏ ఫోన్‌లో ఏ కెమెరా ఉపయోగించి రికార్డు చేశారనే విషయాన్ని గుర్తిస్తారు. రెండు వేర్వేరు డివైజ్‌లలో రికార్డు చేసిన దృశ్యాలను ఒకటిగా అతికించి ఉంటే ఇట్టే తెలిసిపోతుంది.

నాయిస్‌ అనాలసిస్‌: వీడియోలో వినిపించే మాటలు అందులో ఉన్న వ్యక్తులవేనా, కాదా అన్న విషయాన్ని తెలుసుకుంటారు.

మెటా డేటా అనాలసిస్‌: కెమెరాను ఏ కోణంలో, ఎంత దూరంలో అమర్చి వీడియోను చిత్రీకరించారో నిర్ధారిస్తారు.

- విజయవాడ, ఆంధ్రజ్యోతి.


Updated Date - 2022-08-11T08:01:38+05:30 IST