హైకోర్టుకు 12 మంది కొత్త న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2022-02-03T07:34:25+05:30 IST

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు రానున్నారు. ఐదుగురు న్యాయాధికారులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించనుంది. అలాగే మరో ఏడుగురు న్యాయవాదులను..

హైకోర్టుకు 12 మంది కొత్త న్యాయమూర్తులు

  • జడ్జీలు కానున్న ఏడుగురు న్యాయవాదులు..
  • ఐదుగురు న్యాయాధికారులకు జడ్జీలుగా పదోన్నతి
  • తెలంగాణ మహిళకు తొలిసారిగా అవకాశం
  • జాబితాలో నిర్మల్‌ జిల్లాకు చెందిన జువ్వాడి శ్రీదేవి
  • పలు కోర్టులకు మొత్తం 19 మంది కొత్త జడ్జీలు
  • కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం


న్యూఢిల్లీ / హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు రానున్నారు. ఐదుగురు న్యాయాధికారులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించనుంది. అలాగే మరో ఏడుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించనున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం న్యాయాధికారులుగా ఉన్న జి. అనుపమా చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్‌ రెడ్డి, డాక్టర్‌ డి.నాగార్జున్‌... అలాగే న్యాయవాదులు కాసోజు సురేందర్‌, చాడా విజయభాస్కర్‌ రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌ కుమార్‌, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫుల్లా బేగ్‌, ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌ను తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం ప్రతిపాదించింది. దీంతో రాష్ట్ర హైకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 31కి చేరనుంది. తెలంగాణ హైకోర్టు ఏర్పడినప్పుడు 24 మంది జడ్జీలను కేటాయించారు. గతేడాది ఈసంఖ్యను 42కు పెంచారు. ప్రస్తుతం 19మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. తాజా నియామకాలకు ఆమోదం లభించినా ఇంకా 11మంది న్యాయమూర్తుల అవసరం ఉంటుంది. కాగా, తాజాగా సిఫారసు చేసిన జువ్వాడి శ్రీదేవి నిర్మల్‌ జిల్లాకు చెందినవారు. తెలంగాణకు చెందిన మహిళకు హైకోర్టు జడ్జిగా అవకాశం దక్కడం ఇదే తొలిసారి.  


కొత్త న్యాయమూర్తుల వివరాలు...


కె.సురేందర్‌: కె.సురేందర్‌ 1968లో ప్రమీలాదేవి, లక్ష్మీనారాయణ దంపతులకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించారు. ఉస్మానియా  నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్న ఆయన... ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ పి.సీతాపతి ఆఫీ్‌సలో జూనియర్‌గా చేరారు. ఏసీబీ, సీబీఐ సహా అన్ని క్రిమినల్‌ కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. ప్రస్తుతం హైకోర్టులో సీబీఐ తరఫు న్యాయవాదిగా నాలుగోసారి సేవలు అందిస్తున్నారు. 


  చాడా విజయ భాస్కర్‌రెడ్డి: సి.విజయ భాస్కర్‌రెడ్డి 1968లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాకలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఓయూ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చేశారు. 1992లో హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. ఎన్‌ఐఆర్‌డీ,  చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, కేంద్ర ప్రభుత్వ అడిషనల్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రెవెన్యూశాఖ తరఫున జీపీగా పనిచేస్తున్నారు.


  సూరేపల్లి నందా : 1969లో జన్మించిన సూరేపల్లి నందా... 28 ఏళ్లపాటు హైకోర్టులో సివిల్‌, క్రిమినల్‌ సహా అన్ని విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశారు. బీఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌, ఎల్‌ఎల్‌బీ విద్యను పూర్తిచేశారు. 1993లో హైకోర్టు న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరఫున అనేక కార్యక్రమాల్లో సేవలు అందించారు. ఇటీవలే హైకోర్టు ఆమెను డిజిగ్నేటెడ్‌ సీనియర్‌ న్యాయవాదిగా గుర్తించింది.


  ముమ్మినేని సుధీర్‌కుమార్‌: ఖమ్మం జిల్లా చర్లకు చెందిన ముమ్మినేని సుధీర్‌కుమార్‌... 1969లో నాగేశ్వరరావు, భరతలక్ష్మి దంపతులకు జన్మించారు. ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజీలో డిగ్రీ, నాందేడ్‌లో ఎల్‌ఎల్‌బీ చేశా రు.1994లో హైకోర్టు న్యాయవాదిగా నమోదుచేయించుకున్నారు. 


  జువ్వాడి శ్రీదేవి: 1972లో జువ్వాడి సూర్యారావు, భారతి దంపతులకు జన్మించారు. టీఆర్‌ఎస్‌ నేత, న్యాయవాది శ్రీహరిరావు సతీమణి అయిన శ్రీదేవి... రెండు దశాబ్దాలకుపైగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. సాధారణ గృహిణిగా ఉంటూ న్యాయవాద వృత్తిపై ఆసక్తితో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1997లో హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. నిర్మల్‌ కోర్టులో 2008 వరకు అడిషనల్‌ పీపీగా పనిచేశారు. ప్రస్తుతం అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తున్నారు. 


  మీర్జా సైఫుల్లా బేగ్‌: హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేసిన మీర్జా ఇమాముల్లా బేగ్‌ కుమారుడు మీర్జా సైఫుల్లా బేగ్‌. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌ ఆయన స్వస్థలం. 2002లో   హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. తండ్రి మీర్జా ఇమాముల్లా బేగ్‌, న్యాయవాది ఇ.ఉమామహేశ్వర్‌రావుల వద్ద జూనియర్‌గా పనిచేశారు. విద్య, మైనార్టీ వెల్ఫేర్‌, రెవెన్యూ, ఎండోమెంట్‌ తదితర విభాగాల్లో 17ఏళ్లుగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.


  ఎన్వీ శ్రవణ్‌కుమార్‌: ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ 1967లో జన్మించారు. తండ్రి పేరు ఎన్‌వీ కిషన్‌రావు. ఉస్మానియాలో బీకాం, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎంబీఏ, నల్సార్‌ యూనివర్సిటీలో సైబర్‌ లా విభాగంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. 2005లో హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో నీటిపారుదలశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. 


  జి.అనుపమా చక్రవర్తి: ప్రస్తుతం తెలంగాణ వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్న జి.అనుపమా చక్రవర్తి... 1970లో ఎన్‌.కృష్ణచందర్‌రావు, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆమె స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామం. విశాఖపట్నంలోని ఎన్‌బీఎం లా కాలేజీలో చదివారు. 1994లో హైకోర్టు న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వద్ద జూనియర్‌గా చేరారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికై... అదనపు జిల్లా జడ్జిగా సర్వీస్‌ ప్రారంభించారు. తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీగా, హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌గా, కోఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు.


  ఎంజీ ప్రియదర్శిని: మాటూరి గిరిజ ప్రియదర్శిని... అప్పారావు, నాగరత్నమ్మ దంపతులకు విశాఖపట్నంలో జన్మించారు. వైజాగ్‌ ఎన్‌బీఎం  కాలేజీలో లా చేశారు. 1995లో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. విశాఖపట్నం జిల్లా కోర్టులో ఏడేళ్లు ప్రాక్టీస్‌ చేశారు. 2008లో జిల్లా జడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణులై గుంటూరు అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.


సాంబశివరావు నాయుడు: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన సాంబశివరావు నాయుడు... 1962లో సత్యనారాయణ, సూర్యావతి దంపతులకు జన్మించారు. మూడో ఏటనే తండ్రిని కోల్పోయారు. రామచంద్రాపురంలో ఇంటర్‌, అమలాపురంలోని ఎస్కేబీఆర్‌ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. క్రిమినల్‌ లాయర్‌ పిల్లా జానకిరామయ్య వద్ద ప్రాక్టీస్‌ చేశారు. 1991లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు పిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జిగా పనిచేస్తున్నారు.


  ఎ.సంతోష్‌రెడ్డి: జగిత్యాల జిల్లా జోగనిపల్లి గ్రామానికి చెందిన ఎ.సంతోష్‌ రెడ్డి... మాజీ ఎమ్మెల్యే అనుగు నారాయణరెడ్డి, లింగమ్మ దంపతులకు జన్మించారు. జగిత్యాలలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ కాలేజీలో డిగ్రీ, అనంతపురంలోని ఎస్‌కే యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, ఉస్మానియా నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. 1985లో హైకోర్టు న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. 1991లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, ఎంపికయ్యారు. 2013లో న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులై... 2014 వరకు పనిచేశారు. 2019 నుంచి రెండోసారి రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.


  డాక్టర్‌ డి.నాగార్జున్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తికి చెందిన డాక్టర్‌ దేవరాజు నాగార్జున్‌.. 1962లో రామకృష్ణారావు, విమలాదేవి దంపతులకు జన్మించారు. గుల్బర్గాలో ఎల్‌ఎల్‌బీ, అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చదివారు. నల్సార్‌ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు. 1991లో జూనియర్‌ సివిల్‌  జడ్జిగా ఎంపికయ్యారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రిన్సిపల్‌ ప్రైవేట్‌ సెక్రటరీగా, ఏపీ పోలీస్‌ అకాడమీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు.


  ఢిల్లీ, పాట్నా హైకోర్టులకు కూడా...

ఢిల్లీ హైకోర్టుకు ఆరుగురు, పాట్నా హైకోర్టుకు ఒక న్యాయమూర్తిని నియమించాలని కూడా కొలీజియం ప్రతిపాదించింది. అన్ని కోర్టులకు కలిపి మొత్తం 19 మందిని కొలీజియం సిఫారసు చేసింది. అలాగే పాట్నా హైకోర్టు, కలకత్తా హైకోర్టు, బాంబే హైకోర్టుకు ఇద్దరు చొప్పున; కర్నాటక హైకోర్టు, జార్ఖండ్‌ హైకోర్టుకు ఒకరు చొప్పున న్యాయమూర్తులను నియమించాలని గతంలోపంపిన ప్రతిపాదనలను కొలీజియం పునరుద్ఘాటించింది. 

Updated Date - 2022-02-03T07:34:25+05:30 IST