Abn logo
Jul 29 2021 @ 02:35AM

రూటు మార్చి ‘రియల్‌’ దందా!

  • అప్పుడు... మిషన్‌ బిల్డ్‌ ఏపీ.. ఇప్పుడు ‘జగనన్న టౌన్‌షిప్‌’
  • పేరేదైనా భూములు అమ్మడమే
  • కొత్తగా ‘మధ్య తరగతి’ పేరు
  • అన్ని శాఖల స్థలాలకూ ‘టెండర్‌’
  • లే అవుట్లలో ప్లాట్లు వేసి విక్రయం
  • విధి విధానాలపై అనేక సందేహాలు
  • మధ్య తరగతికే దక్కుతాయా?
  • చేతులు మారితే అడ్డుకుంటారా?
  • భవిష్యత్‌ భూ అవసరాలు ఎలా?


రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందికి ఇంటి స్థలాలు కేటాయించి... కాలనీలు కాదు, కొత్త గ్రామాలే సృష్టిస్తున్నామని గొప్పగా చెబుతున్నారు. కానీ... ‘ఆప్షన్ల’  గడబిడలో ఈ ఇళ్ల నిర్మాణమే ఒక గందరగోళంగా మారింది! ఎప్పటికైనా సరే, పేదలకు మంచి గూడు దక్కితే అదే పది వేలు!


తెలుగుదేశం హయాంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న లక్షలాది ‘టిడ్కో’ ఇళ్లను అలా పక్కన పెట్టేశారు. లబ్ధిదారులకు కేటాయించకుండా నాన్చుతున్నారు. వాటిని కేటాయిస్తే పేదలు, మధ్య తరగతి వారూ లబ్ధి పొందుతారు. కానీ... ఎప్పుడు కేటాయిస్తారో తెలియదు.


ఇలా రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించిన రెండు పథకాలు ఉండగానే... సర్కారు ‘జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌’ పేరిట మరో గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో... ఇళ్లు కట్టరు. మధ్య తరగతి (ఎంఐజీ)కి ప్లాట్లు అమ్ముతారట! వివిధ శాఖల వద్ద నిరుపయోగంగా ఉన్న స్థలాలన్నింటినీ ఇందుకు కేటాయిస్తారట! ఇది మధ్య తరగతి మందహాసం కోసమా? లేక... మరో మార్గంలో భూములు అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నమా?


‘రియల్‌’ కాక... మరేమిటి?

విలువైన ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసి ప్లాట్లను విక్రయించడం! అలా వచ్చిన సొమ్ముతో ఖజానా నింపుకోవడం! పేరు ఏదైనప్పటికీ... అది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే. కానీ... దీనికే ‘ప్రజోపయోగం’ అనే పేరుపెట్టి, భూ సేకరణ, పునరావాసం, పరిహారం చట్టం-2013లో వె సులుబాటు ఇచ్చారు. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణ పథకాలు కొత్తకాదు! బలహీన వర్గాలకు ఇళ్ల నుంచి టిడ్కో ఇళ్ల వరకు పేద, మధ్య తరగతి వర్గాల కోసం అనేక పథకాలు అమలవుతున్నాయి. ఇక ఉద్యోగులు, మధ్య తరగతి కోసం హౌసింగ్‌ బోర్డు కాలనీలు ఎన్నో ఉన్నాయి. కానీ... ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’ పేరిట వైసీపీ సర్కారు తీసుకొస్తున్న కొత్త పథకం పట్ల పలురకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మధ్యతరగతికి ప్లాట్లు కేటాయించే పథకం కాదని... దాని పేరుతో ప్రభుత్వ భూములు విక్రయించే పన్నాగమనే వాదన వినిపిస్తోంది. 


 ‘మిషన్‌ బిల్డ్‌’కు మరో రూపమా?

‘బిల్డ్‌ ఏపీ మిషన్‌’ కింద ప్రభుత్వ శాఖలకు చెందిన భూములను టోకున అమ్మాలని భావించారు. నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ) వేలం వేయాలనుకున్నారు. కానీ... ఈ వ్యవహారం న్యాయ వివాదాల్లో చిక్కుకుపోయింది. ఇదే సమయంలో ‘జగనన్న టౌన్‌షి్‌ప’లు తెరపైకి వచ్చాయి. ఇక్కడ జరిగేదీ... ప్రభుత్వ భూములను విక్రయించడమే! కాకపోతే... ‘మధ్య తరగతికి ప్లాట్లు’ అనే పేరుతో అమ్మేస్తారు. ప్రభుత్వ శాఖల దగ్గర ఖాళీ భూములు, వినియోగించని భూములను మున్సిపల్‌ శాఖకు బదిలీ చేస్తారు. అవే స్థలాలను ప్లాట్లు వేసి విక్రయిస్తారు. అంతిమంగా... భూములు అమ్మడం, ఖజానా నింపుకోవడం అనే లక్ష్యం నెరవేర్చుకోవడమే! 


 ఇవన్నీ అమ్మకానికి...

రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, కార్పొరేషన్‌ల వద్ద ఉన్న భూములు... అంటే, గతంలో ప్రభుత్వం కేటాయించి ఉండి, వాటిని వినియోగించుకోనివి, భూముల వినియోగంలో నిబంధనల ఉల్లంఘన జరిగినవి, ఆయా సంస్థలు తమ సొంత అవసరాలకోసం సమకూర్చుకొని ఉపయోగించుకోని భూములను జగనన్న స్మార్ట్‌టౌన్‌ల కోసం అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అసలు విషయం ఏమిటంటే... ఇప్పటికే మిషన్‌ బిల్డ్‌ ఏపీలో భాగంగా అమ్మేందుకు కొన్ని భూములు గుర్తించారు. 


అప్పులు తెచ్చేందుకు ఏర్పాటుచేసిన ఏపీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కూ భూములు బదిలీ చేశారు. ఇప్పుడు... జగనన్న స్టార్ట్‌టౌన్ల కోసం ఏ ఖాళీ భూములు ఇవ్వాలి? దీనిపై కలెక్టర్లకు స్పష్టమైన మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఇంతకుముందు వివిధ పేర్లతో అమ్మాలనుకున్న భూములే ఈ జాబితాలోకి వస్తాయని స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.


 వారికే దక్కుతాయా?

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ప్లాట్ల ధర ఎలా నిర్ణయిస్తారు? ఉన్న ప్లాట్లకంటే ఎక్కువమంది కొనుగోలుదారులు ఉంటే ఎలా కేటాయిస్తారు? వేలం వేస్తారా? లేక.. లాటరీ తీస్తారా? ఈ అంశాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే... పట్టణాలు/నగరాల్లో నివాస ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసే టౌన్‌షి్‌పలకు కచ్చితంగా డిమాండ్‌ ఉంటుంది. పేదల ఇళ్లు ప్రభుత్వం పేదలుగా గుర్తించిన లబ్ధిదారులకే దక్కుతాయి. టిడ్కో ఇళ్లూ అలా ఎంపిక చేసిన వారికే వచ్చాయి. కానీ... జగనన్న టౌన్షి్‌పలలోని ప్లాట్లు ‘మధ్యతరగతి’ వారే కొంటారని చెప్పగలరా?  ఉన్నతాదాయవర్గాలు, సంపన్నులు, రియల్టర్ల బినామీలు రంగంలోకి  దిగితే ఎలా అడ్డుకుంటారో తెలియదు. 


  కొత్త కాదు..కానీ.. 

ప్రభుత్వ భూముల్లో లేఅవుట్‌లు వేసి అందుబాటు ధరల్లో ప్లాట్లను ప్రజలకు విక్రయించడం కొత్తకాదు. గతంలో ఉమ్మడి ఏపీలోనూ ప్రభుత్వాలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాయి. హౌసింగ్‌ బోర్డు ద్వారా ప్లాట్లువేసి విక్రయించాయు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ‘దిల్‌’ (డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి ఈ వ్యాపారం చేశారు. కానీ, అది వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఆయన పేరిటే జగనన్న స్మార్ట్‌టౌన్‌లకు తెరతీశారు. ఈ పేరిట సర్కారు చేసేది పక్కా రియల్‌ వ్యాపారమే. ఎందుకంటే... ఇందులో ప్లాట్లు విక్రయించ డం ప్రభుత్వం చేసేపని. ఒక్కసారి అక్కడ తక్కువ ధరకే ప్లాటు కొనుగోలు చేశాక ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించుకోవడం, ఖాళీగా వదిలేసుకోవడం లేదా, ఇంకా మరింత లాభానికి బయటివారికి అమ్ముకోవడం కొనుగోలుదారు ఇష్టం. దీన్ని ప్రభుత్వం నియంత్రించలేదు. కాదూ కూడదు అని ఈ ప్లాట్లు చేతులు మారకుండా ‘షరతులు’ విధిస్తే... వీటి కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చు.  ప్రస్తుతం... సర్కారుకు ఈ ఆలోచన లేనట్లే కనిపిస్తోంది. 


ప్రజోపయోగం పేరిట...

జగనన్న టౌన్‌షి్‌పలకు ‘ప్రజోపయోగం’ పేరిట భూ సేకరణ, పరిహారం చట్టం-2013లో కీలక వెసులుబాటు ఇప్పించారు. ఇందులో భారీ కిటుకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే... రాష్ట్రవ్యాప్తంగా లే అవుట్‌లకోసం  భూములను తీసుకొని ప్లాట్లు వేయాలంటే భూ సేకరణ చట్టం-2013లోని నిబంధనలను పాటించాలి. గ్రామ లేదా పట్టణ సభల ఆమోదం, ఆహారభద్రతపై ప్రభావ అంచనాలను తీసుకోవాలి. అదే ప్రజోపయోగం కోసం తీసుకుంటే... ఇలాంటివేవీ అవసరం లేదు. అందుకే తెలివిగా రెవెన్యూశాఖతో ఈ లేఅవుట్‌లు ప్రజోపయోగం కోసమంటూ ఈనెల 20న జీవో 184ను ఇప్పించారు.


భవిష్యత్తులో భూమి ఎలా?

భవిష్యత్తులో అవసరాలు పెరుగుతాయి. కానీ... భూమి పెరగదు.  వివిధ శాఖలు, సంస్థలు సమకూర్చుకున్న, ప్రభుత్వాలు కేటాయించిన స్థలాలు ఇప్పుడు నిరుపయోగంగా ఉండొచ్చు. కానీ, విస్తరణ’ కోసం అవి అవసరం రావొచ్చు. కానీ... ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, నగరాల పరిధిలో ఆయా భూములను సేకరించేస్తున్నారు. దీంతో ప్రభుత్వ శాఖల దగ్గర సెంటు భూమి మిగిలే అవకాశం ఉండదు. ఒక వేళ భవిష్యత్తులో ఆయా శాఖల విస్తరణ, అవసరాలకోసం భూమి అవసరం పడితే ప్రైవేటుగా కొనుగోలు చేయటమే మార్గం. ఇప్పుడు అమ్ముకొని...భవిష్యత్తులో కొనుగోలు చేయడం ఖరీదైన ప్రక్రియ కాదా? అని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. 


బిల్డ్‌ ఏపీలో ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆయా శాఖలు, విభాగాలు, సంస్థల పరిధిలో ఉన్న విలువైన భూములు అవి ఉన్న స్థితిని మార్చకుండా వేలంలో అమ్మాలని సర్కారు గత ఏడాది నిర్ణయించింది. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూములను గుర్తించింది. వేలం వేసి అమ్మే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌బీసీసీకి అప్పగించింది. ఈ సంస్థ తొలి దశలో  విశాఖపట్టణంలో ఆరు, గుంటూరులో మూడు చోట్ల విలువైన భూములను ఆన్‌లైన్‌ వేలంలో అమ్మాలని నోటిఫికేషన్‌లు ఇచ్చింది. వీటి ద్వారానే కనీసం 500 కోట్లపైనే ఆదాయం వస్తుందని అంచనావేశారు. అయితే, వేలం వ్యవహారం కోర్టుకెక్కింది. ప్రజాప్రయోజనానికి ఉపయోగించే భూములను అమ్మడానికి వీల్లేదంటూ కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. వేలం నిలిచిపోయింది.