Advertisement
Advertisement
Abn logo
Advertisement

మన జానపదాన్ని ప్రపంచం ముందుంచిన మేటి

‘మనమూ చరిత్రకెక్కదగ్గ వారమే’ అని సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాస్తూ (1949లో) చెప్పిండు. మన చరిత్ర మనమే రాసుకున్నట్లయితే విస్మరణకు, వివక్షకు, వక్రీకరణకు గురైన అనేక విషయాలు రికార్డవుతాయి. ఇవి చరిత్ర రచనకు కొత్త ఆకరాలను అందిస్తాయి. తీగ లాగితే డొంక కదులుతదనేది పాత విషయం. అదే తీగను పట్టుకొని కొండను ఎగబాక వచ్చు అనేది ఇవ్వాళ నేర్చుకున్న జ్ఞానం. ఈ జ్ఞానంలో నుంచి కొత్తగా కనుక్కున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎం.ఎన్‌. వెంకటస్వామి. 


మ్యాదరి నాగయ్య (ఎం.ఎన్‌) వెంకటస్వామి బహుశా ఇండియా లోనే ఇంగ్లీషులో జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి దళితుడు. 1904 ఆ ప్రాంతంలోనే హైదరాబాద్‌ అసఫియా లైబ్రరీ (ఇప్పటి స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ)లో గ్రంథపాలకుడిగా పనిచేశాడు. ఈయన తండ్రి దేశంలోనే మొట్టమొదటి సారిగా హోటల్‌ బిజెనెస్‌ ప్రారంభించిన దేశీయుడు నాగయ్య. బ్రిటీషువారీయన్ని గౌరవంగా ‘నాగులు’ అని పిలిచేవారు. అందుకే వెంకటస్వామి తన తండ్రి జీవిత చరిత్రను 1909లో ‘లైఫ్‌ ఆఫ్‌ ఎం నాగ్లు’ పేరిట ప్రచురించిండు. (‘లైఫ్‌ ఆఫ్‌ ఎం నాగ్లు : ది ఫాదర్‌ ఆఫ్‌ ది హోటల్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇన్‌ ద సెంట్రల్‌ ప్రావిన్సెస్‌, అండ్‌ హెడ్‌ గుమాస్తా టు ద మహానాడు’ అనేది పూర్తి టైటిల్‌) అదృష్ట వశాత్తు ఆ పుస్తకం కాపీలు కొన్ని ఇంగ్లండ్‌కు పంపడంతో లండన్‌ బ్రిటిష్‌ మ్యూజియం లైబ్రరీలో ఒక కాపీ అందుబాటులో ఉన్నది. అంతే కాదు ఈ పుస్తకాన్ని మళ్ళీ 1929లో విస్తృత పరిచి రాసిండు. ఈ కాపీ కూడా అక్కడ అందుబాటులో ఉన్నది. 


హైదరాబాద్‌ నుంచి జాల్నా (మహారాష్ట్ర-ఒకప్పటి నిజాం యిలాకా)కు వలసబోయిన కుటుంబంలో జన్మించిన తెలుగు దళితుడు నాగయ్య, తులశమ్మల కొడుకు ఎం.ఎన్‌.వెంకటస్వామి. ఈయన 1865లో పుట్టి 1931లో మరణించారు. వెంకటస్వామి గురించి 2020లో లీలా ప్రసాద్‌ అనే డ్యూక్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, 2021లో కార్ల్‌టన్‌ యూనివర్సిటీ (కెనడా)కు చెందిన జంగం చిన్నయ్యలు కొంత రాసిండ్రు. చాలా ఏండ్ల కిందట సీనియర్‌ జర్నలిస్టు జి.కృష్ణ కూడా వీరి గురించి రాసిండు. అయితే ఎం.ఎన్‌.వెంకటస్వామి తెలుగు జానపద గేయాల, కథలు, గాథల మీద చేసిన విశేషమైన కృషి గురించి చెప్పడం ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం. తన తండ్రి జీవిత చరిత్ర రాయడమే గాకుండా 1893 నుంచి 1930ల వరకు ‘ఫోక్‌లోర్‌’, ‘ఇండియన్‌ అంటిక్వరీ’ ఇంకా ఇతర పత్రికల్లో తెలుగు జానపద గేయాల గురించి అనేక వ్యాసాలు రాసిండు ఎం.ఎన్‌. వెంకటస్వామి. ఇవన్నీ ఇంగ్లీషులోనే రాయడం విశేషం. అట్లా తెలుగు వారి జానపద విజ్ఞానాన్ని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేసిన వ్యక్తిగా వెంకట స్వామిని చెప్పుకోవచ్చు. అంతేగాదు ‘బొబ్బిలి యుద్ధగాథ’ను ‘దండదాసర్లు’ చెబుతూ ఉంటే రాసుకొని, పరిశోధన చేసి 1919లో ఇంగ్లీషులో పుస్తకంగా ప్రచురించిండు. దీనికి ప్రఖ్యాత చరిత్రకారుడు జాదునాథ్‌ సర్కార్‌ ముందుమాట రాసిండు. జానపద గేయాలపై మూడు పుస్తకాలను రాసిండు. 1927లో మదరాసు మెథడిస్ట్‌ పబ్లిషింగ్‌ హౌజ్‌ వాండ్లు ఈయన వ్యాసాలను ‘ది ఫోక్‌ స్టోరిస్‌ ఆఫ్‌ ది లాండ్‌ ఆఫ్‌ ఇండ్‌ (ఇండియా)’ పేరిట వెలువరించిండ్రు. ఇవే గాకుండా రామాయణాన్ని ఆంగ్లీకరించిన రాల్ఫ్‌ టి.హెచ్‌. గ్రిఫిత్‌ జీవితాన్ని గురించి కూడా రాసిండు. జానపద కథలు చెప్పే దళితుల నుంచి విస్తృతంగా సమాచారాన్ని సేకరించి వాటిని చారిత్రక కథలుగా, జానపద గేయాలుగా మనకందించిన మేటి వెంకటస్వామి. 


ఈయన తన రచనల్లో తెలుగు మాతృకతో పాటు ఇంగ్లీషు తర్జుమా కూడా చేర్చిండు. ఈ గేయాలు, గేయ రచయిత నా దృష్టికి 20 ఏండ్ల కిందనే వచ్చినప్పటికీ ఆయన గురించి అదనపు సమాచారం దొరకలేదు. గతంలో జి.కృష్ణ రాసిన వ్యాసంలో సైతం ‘నాగులు’ జీవిత చరిత్రకారుడిగానే వెంకటస్వామిని చెప్పిండు కానీ జానపద విజ్ఞానం గురించి పేర్కొనలేదు. దాంతో అట్లా ఆయనెవరో అప్పుడు తెలియకుండా పోయింది. ఇటీవల మరొక్కసారి ‘సలాం హైదరాబాద్‌’ నవలాకారుడు లోకేశ్వర్‌ మాటల సందర్భంలో వెంకటస్వామి పేరు ప్రస్తావిం చారు. దీంతో మరోసారి వెతుకులాట ప్రారంభించిన. ఇటీవల లీలా ప్రసాద్‌ అనే హైదరాబాద్‌కు చెందిన అమెరికన్‌ ప్రొఫెసర్‌ ‘The Audacious Raconteur: Sovereignty and Storytelling in Colonial India’ అనే పుస్తకాన్ని వెలువ రించింది. ఇందులో వెంకటస్వామి గురించి ఒక చాప్టర్‌లో వివరంగానే రాసింది. అయితే సందర్భం వేరే కావడంతో అందులో జానపద గేయాలు వివరంగా పేర్కొనలేదు. ఆ లోటుని అధిగమించడానికి ఇప్పుడిక్కడ ఎం.ఎన్‌.వెంకటస్వామి సేకరించి, పరిశీలించి, పరిశోధించి, పరిష్కరించి ప్రచురించిన చాలా గేయాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం. 


‘‘సంకలో పిల్ల/ నెత్తిమీద గుల్ల/ చాదర్‌ఘాట్‌ బాట/ పామెర్‌సాబ్‌ కడుతుండు/ కూలికి పోదామ’’ అంటూ 1810 నాటి విలియమ్‌ పామర్‌ కంపెనీకి సంబంధించిన భవన నిర్మాణం, యువ భార్యభర్తల సంభాషణను గురించి గేయాన్ని పేర్కొన్నాడు. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి కాంట్రాక్టర్‌ ఈయనే! బహుశా ఆధునిక దృక్కోణంతో కార్మికుల గురించి చెప్పిన తొలి గేయంగా దీన్ని పేర్కొనవచ్చు. 


మరో గేయములో: ‘‘నాలుగు విధముల నరుడు పాపాత్ముడు/ ఇగ యేమో ఓ జీవుడా!/ అండగా శ్రీమన్నారాయణుడుండగ/ మనకేమి భయము/ తలకుంటి బోయీలు యెంత పుణ్యాత్ములో/ యేటికి వల లాగిరి (చేపలు)/ బాగుగా పట్టిరి/ బుట్టలో వేసిరి/ ఇగ యేమో జీవుడా //అండగా// ... ... సుట్టేటి బండమీద/ పొలుసులు తీసిరో/ ఇగ యేమో జీవుడా //అండగా//... ...కారాలు మిరియాలు/ గనుమూగ (నున్నగ?) నూరిరో/ ఇగ యేమో జీవుడా //అండగా//... ...కీలు కత్తులు తెచ్చి/ విసి కించయ్‌(?) వాళ్ళయ్‌ (?)/ ఇగ యేమో ఓ జీవుడా //అండగా//... ...వొక్క ఉరుము ఉరిసేను/ వొక్క మెరుపు మెరిసేను/ కుంభాన వాడు కూచుమొగా(?)/ మచ్చవార్లు దుమికేను’’ అని గేయాన్ని ఇంగ్లీషు అర్థంతో ప్రచురించాడు. అయితే వాటిని సరైన అర్థంలో ఇంగ్లీషులోకి తర్జుమా చేయడానికి పదాలు దొరకడం లేదు అని కూడా చెప్పిండు. 


ఇంకో గేయంలో: ‘‘సీమ (చీమ) సచ్చుడాయె/ నెమలి దుఃఖమాయె/ మర్రిచెట్టు రావి మఱ్ఱి/ కాకి కాలు ఇరిగె/ యేనుగ కొంకిల్లు కూలిపాయె/ లేళ్ల కాళ్లు కీళ్లిరిగాయి/ యేట్లో నీళ్లు కైల కైల  ఆయె/ జొన్నసేను పురుగు పట్టె/ పెద్దిరాజుకు బుడ్డదిగె/ పెద్ద దొరసానికి పీటంటుకునె/ పేదరాలు పెద్దమ్మకు తట్ట అంటుకునె’’ ఆనాడు జన సామాన్యంలో ఉన్న జానపద పదాలకు అక్షర రూపమిచ్చిండు.


‘‘చందమామ చందమామ చక్కంగా రావె/ గోలకొండ పోదాము/ గొర్రెని తెద్దాము/ గొర్రె బుడ్డెడు పాలిచ్చె/ పాలు తీసుకొని కోమటోడికిచ్చె/ కోమటోడు కొబ్బరి బెల్లం ఇచ్చె/ కొబ్బరి బెల్లం తీసుకొని స్వామికిస్తే/ స్వామి పూవు ఇచ్చె/ పూవు తీసుకొని మా అక్క కొప్పుల పెట్టిన’’ అనే గేయాన్ని 1901 నాటికే పత్రికల్లో ప్రకటించాడు. 


‘‘బావా బావా బుల్లేరు/ బావని పట్టి తన్నేరు/ వీధి వీధి తిప్పేరు/ ఈర గంధం (బురద) పూసేరు’’ అని, ‘‘నాగి నాగి నల్లేరు/ నాగని పట్టి తన్నేరు/ చీకటి కొట్టులో వేసేరు/ చప్పిడి గంజి పోసేరు’’ అనీ, ‘‘కాముడు కర్రె బొగ్గు ఆయె/ కాముడు పెండ్లాం నాకు ఆయె’’ అంటూ అనేక గేయాలను ఆయన సేకరించి ప్రచురించాడు. నాగపూర్‌లో 1885 నాటికే డిగ్రీ చదువుకున్న ఈయనకు వివిధ ఫోక్‌లోర్‌ (జానపద) పత్రిక సంపాదకులతో సాన్నిహిత్యముండేది. అట్లా తాను సేకరించిన సమాచారాన్నంతా ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆయన 120 ఏండ్ల కింద జనసామాన్యానికి అందుబాటులోకి తెచ్చిన గేయాలన్నీ తెలుగులోకి వచ్చినట్లయితే మరో కొత్త ప్రపంచానికి దారులు ఏర్పడుతాయి. జానపద సాహిత్యానికి మేలైన జోడింపు అవుతుంది.

సంగిశెట్టి శ్రీనివాస్‌


Advertisement
Advertisement