స్వర్గానికి దారి

ABN , First Publish Date - 2022-06-10T05:39:14+05:30 IST

‘సత్యం’ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. సత్యాన్ని మించిన ఉత్తమ గుణం మరొకటి లేదు. మహనీయులందరూ సత్యపథంలో పయనించి, ఆదర్శప్రాయులయ్యారు.

స్వర్గానికి దారి

‘సత్యం’ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. సత్యాన్ని మించిన ఉత్తమ గుణం మరొకటి లేదు. మహనీయులందరూ సత్యపథంలో పయనించి, ఆదర్శప్రాయులయ్యారు. అటువంటివారిలో మహాప్రవక్త మహమ్మద్‌ వంశీయుడు, తత్త్వవేత్త హజ్రత్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ జీలానీ ఒకరు. తల్లి మార్గదర్శకత్వంలో సత్యసంధత గొప్పతనాన్ని ఆయన గ్రహించి, జీవితాంతం అనుసరించారు. 

ఉన్నత విద్యాభ్యాసం కోసం బాగ్దాద్‌ పట్టణానికి వెళ్ళడానికి జీలానీ తన తల్లి అనుమతి తీసుకున్నారు. ఆయనకు తల్లి నలభై దీనార్లు ఇచ్చి, జీవితంలో ఎన్నడూ అబద్ధం చెప్పకూడదని ఉపదేశించారు. ఆమె మాటను ఎంతో విలువైనదిగా స్వీకరించిన జీలానీ... బాగ్దాద్‌కు పయనమయ్యారు. దారిలో ఆయన పయనిస్తున్న బిడారు మీద బందిపోటు దొంగల ముఠా దాడి చేసింది. 

అందరినీ నిలువునా దోచుకుంది. చివర్లో జీలానీ వంతు వచ్చింది. 

‘‘నీ దగ్గర ఏముందో చెప్పు’’ అని ఒక బందిపోటు గద్దించాడు.

‘‘నా దగ్గర నలభై దీనార్లు ఉన్నాయి’’ అని జీలానీ జవాబిచ్చారు. కానీ ఆ మాటలు ఆ దొంగకు నమ్మశక్యం కాలేదు. ఆ కుర్రాడిని తమ నాయకుని 

సమక్షంలో హాజరుపరిచాడు. అక్కడ కూడా జీలానీ అదే మాట చెప్పారు.

‘‘మరి ఆ దీనార్లు ఎక్కడున్నాయి?’’ అని అడిగాడు ముఠా నాయకుడు. 

‘‘చొక్కా లోపలి జేబులో కుట్టి ఉన్నాయి’’ అని చెప్పారాయన. దొంగలు 

పరిశీలిస్తే... నలభై దీనార్లూ ఉన్నాయి.

‘‘నా దగ్గర ఏమీ లేవని నువ్వు చెప్పి ఉంటే నీ దీనార్లు సురక్షితంగా ఉండేవి కదా?’’ అన్నాడు ముఠా నాయకుడు.

‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పవద్దని మా అమ్మ నాకు గట్టిగా చెప్పింది. ఆమె మాట నేను జవదాటను’’ అని నిస్సంకోచంగా జీలానీ జవాబు చెప్పారు. 

ఆ మాటలు వారి గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. వారి హృదయాల్లో పరివర్తన చోటు చేసుకుంది. తాము చేసిన దోపిడీల పట్ల పశ్చాత్తాపం చెందారు. దోచుకున్న సామగ్రిని వాటి యజమానులకు తిరిగి ఇచ్చేశారు. 

జీలానీకి శిష్యులుగా మారారు.

అసత్యాలు చెబుతూ, ఎదుటివారిని మోసం చేసి, తామే తెలివైనవారిగా, గొప్పవారిగా భావించేవారు... అల్లాహ్‌ దృష్టిలో అత్యంత హీనులు. సత్యం పలికే వ్యక్తికి అప్పుడప్పుడు బాధలు, కష్టాలు ఎదురైనా... సత్యం మీద స్థిరంగా 

నిలబడతాడు. అల్లాహ్‌ మీద భరోసా ఉంచుతాడు. దృఢవిశ్వాసాన్ని 

ప్రకటిస్తాడు. అతను నమ్మిన సత్యమే అతణ్ణి స్వర్గం వైపు తీసుకువెళ్తుంది. అంటే సత్యమే స్వర్గానికి దారి.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-06-10T05:39:14+05:30 IST