జల ఉద్యమానికి సన్నద్ధం కావాలి!

ABN , First Publish Date - 2021-07-21T08:40:43+05:30 IST

‘బేసిన్‌లు లేవు... బేషజాలు లేవు..’ అని ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన రాజనీతిజ్ఞతతో ఉన్నదని అనుకున్నాం...

జల ఉద్యమానికి సన్నద్ధం కావాలి!

‘బేసిన్‌లు లేవు... బేషజాలు లేవు..’ అని ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన రాజనీతిజ్ఞతతో ఉన్నదని అనుకున్నాం. ఇద్దరు ముఖ్యమంత్రులు సఖ్యతగా తెలుగు రాష్ట్రాల క్షామపీడిత ప్రాంతాలకు కృష్ణా జలాలను సహేతుంగా వాడుకుంటారని భావించాం. శాసనసభలో కూడా కెసిఆర్‌ కృష్ణా, గోదావరి జలాలను రెండు రాష్ట్రాలు ఎలా వాడుకోనున్నాయో సుదీర్ఘంగా వివరించారు. కాని ఆచరణలోకి వచ్చేసరికి సమస్య పరిష్కారం కన్నా ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయాలే ముఖ్యమనే సంకుచిత ధోరణితో వ్యవహరించారు. ‍కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు ఇట్టే పరిష్కారమయ్యేవి. కాని, కృత్రిమంగా జల జగడాన్ని సృష్టించారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీని ఆసరా చేసుకొని ఇరు రాష్ట్రాలపై పెత్తనాన్ని లాగేసుకుంది. ఇప్పటికే జిఎస్‌టి పేరుతో రాష్ట్రాల చేతుల నుండి ఆర్థిక స్వేచ్ఛను, వ్యవసాయ రంగ పరిధిని, తాజాగా సహకార వ్యవస్థను లాగేసుకున్న కేంద్రం ఇప్పుడు తెలంగాణ, ఏపీకి సంబంధించి గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డుల పరిధులను ప్రకటించింది. దీని ద్వారా, దేశంలో ఎక్కడా లేని విధంగా, నీటినీ విద్యుత్తును తన ఆధిపత్యంలోకి తీసుకున్నది. ఇది పూర్తిగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైనది. 


‍‍ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న అంశా లను పరిష్కరించడానికి ఏడేళ్ళ గడువు కావలసివచ్చిందా? తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజకీయ దృష్టితో పనిచేస్తూ చాలా అన్యాయం చేస్తున్నది. కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని, తెలంగాణలోని 19, ఆంధ్రప్రదేశ్‌లోని 15, ఉమ్మడి రాష్ట్రాల 13 ప్రాజెక్టులు బోర్డు పరిధిలో నిర్వహించబడతాయని ప్రకటించడం దుర్మార్గం. అంతేగాక మైనర్‌ ప్రాజెక్టుల నిర్వహణకు హక్కు ఉంటుందని సెలవివ్వడమంటే రాష్ట్రాల అస్తిత్వానికి గొడ్డలిపెట్టే. రాష్ట్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారే ప్రమాదం ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తిని పంపిణీ బోర్డు పరిధిలో ఉంచడమంటే తెలంగాణ రాష్ట్ర ఉనికికే ప్రమాదం ఏర్పడనున్నది. కేవలం, మైనర్‌ ప్రాజెక్టులు మాత్రమే రాష్ట్రాల నియంత్రణలో ఉండే పరిస్థితి ఏర్పరచడమంటే పెద్దచేప చిన్నచేపను మింగినట్లే. కేంద్రానికి రాష్ట్రాల విభజన చట్టం ఏడు సంవత్సరాల తర్వాత గుర్తుకు రావడం దుర్మార్గం. ఈ నిర్ణయంతో దక్షిణ తెలంగాణలో పెండింగులో, నిర్మాణ, ప్రతిపాదన దశల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ ప్రమాదంలో పడ్డాయి. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యాల బోర్డులకు ప్రాజెక్టులపై ఇచ్చిన అధికారాలను కేంద్రం ఉపసంహరించుకునేలా చేసేందుకు ప్రస్తుతం తెలంగాణ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి న్యాయ పోరాటం, రెండవది రాజకీయ పోరాటం. న్యాయ పోరాటం సుదీర్ఘంగా సాగుతోంది. అయితే న్యాయ, రాజకీయ పోరాటాలను సమన్వయపరుచుకుంటూ కొనసాగించాల్సిన తరుణం ఆసన్నమైంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఒకే గొంతుకగా ఆకాంక్షలను ఎలా వ్యక్తపరిచారో అదే రీతిగా ఒకే గొంతుగా కేంద్రం వేసిన బోర్డుల తీరును, తెలంగాణకు కృష్ణా జలాలలో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలి. అది ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో వున్నది. ఆయన ఇంజనీరింగ్‌ నిపుణులను, అఖిలపక్షాలను, సకల సంఘాలను సమావేశానికి పిలిచి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి సన్నద్ధం చేయాలి. మరోవైపు న్యాయపోరాటం చేయాలి. అప్పుడే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరే అవకాశముంటుంది. 

చాడ వెంకటరెడ్డి


Updated Date - 2021-07-21T08:40:43+05:30 IST