శ్రీకాకుళ ఉద్యమ యోధుడు

ABN , First Publish Date - 2020-04-11T06:20:20+05:30 IST

శ్రీకాకుళ సాయుధ పోరాటయోధుడు, సి.పి.ఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ సీనియర్‌ నేత వాసుదేవరావు అమరులై పది సంవత్సరాలు గడిచిపోయాయి. 1932 ఆగస్టు 11న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు....

శ్రీకాకుళ ఉద్యమ యోధుడు

శ్రీకాకుళ సాయుధ పోరాటయోధుడు, సి.పి.ఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ సీనియర్‌ నేత వాసుదేవరావు అమరులై పది సంవత్సరాలు గడిచిపోయాయి. 1932 ఆగస్టు 11న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం రిట్టపాడు గ్రామంలో పైలా జన్మించారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు సిద్ధాంతం వైపు ఆకర్షితులై 1953లో అప్పటి సి.పి.ఐ.లో సభ్యులైనారు. కొంతకాలం సర్వేయర్‌గా పనిచేసిన తర్వాత పార్టీ పిలుపు మేరకు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి గ్రామాల్లో యువకులను చైతన్యపరిచి యువజన సంఘ నిర్మాణం చేసారు. 1962లో పార్టీ పిలుపునందుకుని ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి పూర్తికాలపు కార్యకర్తగా బాధ్యత తీసుకుని టెక్కలి ప్రాంతంలో రైతాంగంలో కృషి చేసారు. 1964లో సి.పి.ఐలో చీలిక వచ్చి సి.పి.ఎం ఏర్పడినపుడు ఆ పార్టీలో జిల్లా కమిటీ సభ్యుడైనారు. నిలకడైన కృషితో సాగుతున్న శ్రీకాకుళ రైతాంగ ఉద్యమం 1967 నాటికి ఉప్పెనలా ముందుకు వచ్చింది. అదే సమయంలో వసంతమేఘ గర్జనతో వెల్లువలా విజృంభించిన నక్సల్బరి సాయుధ రైతాంగ ఉద్యమం దీనికి మరింత ప్రేరణనందించి పైలా లాంటి కామ్రేడ్స్‌ అసమాన త్యాగాలకు సిద్ధపడడానికి పురికొల్పింది. పార్టీ పిలుపునందుకున్న పైలా 1968 ఫిబ్రవరిలో అజ్ఞాతజీవితంలోకి వెళ్ళి శ్రీకాకుళోద్యమంలో అవిశ్రాంతంగా ఎన్నో కష్టనష్టాలకోర్చి ఆదర్శవంతమైన విప్లవకృషి సాగిం చారు. వెల్లువెత్తిన విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా విద్రోహానికి పాల్పడిన సి.పి.ఎం నుండి విప్లవకారులు బయటికి వచ్చారు.


విప్లవకారుల నాయకత్వంలో సాయుధపోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏర్పడిన రాష్ట్ర సమన్వయ కమిటీలో పైలా చురుకైన పాత్ర నిర్వహించారు. శ్రీకాకుళ ఉద్యమప్రాంతమంతటినీ కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం తీవ్రనిర్బంధం ప్రయోగించింది. 350 మందికి పైగా విప్లవకారులను ఎన్‌కౌంటర్ల పేరిట కాల్చిచంపారు. 1971 చివరి నాటికి కోరన్న, మంగన్న, పంచాది కృష్ణమూర్తి, తామాడ గణపతి, సుబ్బారావు పాణిగ్రాహి, దేవినేని మల్లిఖార్జున్‌, చాగంటి భాస్కరరావు, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, పంచాది నిర్మల, అంక మ్మ, సరస్వతి తదితర కామ్రేడ్స్ రాజ్యహింసలో అమరులైనారు. ఉద్యమం కష్టాల్లో వున్న స్థితిలో పైలా విస్తృతంగా ఉద్యమగ్రామాలను పర్యటించి కార్యకర్తకూ, ప్రజలకూ ధైర్యాన్నిచ్చి ఉద్యమాన్ని నిలబెట్టడానికి తీవ్రంగా కృషిచేసారు. అనతికాంలోనే వర్గశత్రునిర్మూలనా పంథా ఉద్యమానికి చేసిన నష్టాన్ని గుర్తించిన పైలా ఆ పంధాని వీడి ప్రజా యుద్ధపంధా చేపట్టి విప్లవకారులతో ఐక్యతకు కృషి చేశారు. ఆ తరుణంలో సత్యనారాయణ సింగ్‌చే పునరుద్ధరించబడిన కేంద్ర కమిటీలో సభ్యుడైనారు. తర్వాత చండ్ర పుల్లారెడ్డి నాయకత్వాన గల ఏ.పి.ఆర్‌.సి.పితో ఐక్యత సాధించి ఒకే పార్టీగా ఏర్పడడానికి తన వంతు పాత్ర నిర్వహించారు. 1976 తర్వాత రామనర్సయ్య మరణానంతరం సి.పి.ఐ(ఎం.ఎల్‌) రాష్ట్రకమిటీకి కార్యదర్శి అయ్యారు. 1980లో మరోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యి, అఖిల భారత మహాసభలో కేంద్ర కమిటీ సభ్యుడుగా తిరిగి ఎన్నికయ్యారు. పైలా అమరుడయ్యేనాటికి సి.పి.ఐ(ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యునిగానూ, వి.వి.యస్‌ ఏరియా కమిటీ సభ్యుగానూ ఉన్నారు. 


శ్రీకాకుళోద్యమాన్ని నిలబెట్టడానికి అవిశ్రాంత కృషిచేసిన పైలా 1972 తర్వాత ప్రజా యుద్ధపంధాలో విప్లవోద్యమ నిర్మాణానికి అసమాన కృషి చేసారు. నాలుగు దశాబ్దాలకుపైగా రహస్య జీవితం గడుపుతూ శత్రు నిర్బంధం మధ్య విప్లవ కృషి సాగిస్తూ రాష్ట్రంలో విప్లవోద్యమం బలపడడానికి తనవంతు పాత్ర నిర్వహించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతుకూలీ ఉద్యమం, కార్మికోద్యమం అభివృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర పోషించారు. నమ్మిన సిద్ధాంతం కోసం, విప్లవోద్యమ నిర్మాణం కోసం తుదిశ్వాస విడిచేవరకూ అత్యంత క్రమశిక్షణతో త్యాగాలు చేసిన పైలా ఎంతో ఆదర్శ నాయకుడు. నేటి విప్లవకారులకు మార్గదర్శి. పైలాకు మా అరుణారుణ జోహార్లు.


సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, 

శ్రీకాకుళం- పార్వతీపురం ఏరియా కమిటీ

(నేడు పైలా వాసుదేవరావు పదవ వర్ధంతి)

Updated Date - 2020-04-11T06:20:20+05:30 IST