వాలంటీర్ల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదం!

ABN , First Publish Date - 2022-08-03T06:22:53+05:30 IST

ఏ విధంగా అయినా ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధికారంలోకి రావాలన్నది ఫ్యాన్ పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసం అనైతిక రాజకీయాలు చేస్తున్నారు....

వాలంటీర్ల వ్యవస్థ  ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదం!

ఏ విధంగా అయినా ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధికారంలోకి రావాలన్నది ఫ్యాన్ పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసం అనైతిక రాజకీయాలు చేస్తున్నారు. వాలంటీర్ల నియామకమే స్వార్థంతో కూడుకొన్నది. వాలంటీర్ల వ్యవస్థ అనడంకన్నా వైసీపీ ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకొన్న రాజకీయ వ్యవస్థ అనడం అర్థవంతంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తమ పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను గ్రామాల్లో, పట్టణాల్లో వాలంటీర్లుగా నియమించుకున్నారు. గ్రామ, పట్టణాల్లో ప్రతి 50 ఇళ్లకొక వాలంటీరును నియమించారు. వీరందరూ వైసీపీ కార్యకర్తలేనని ఆ పార్టీ నాయకులందరూ పదేపదే చెప్పారు. వాలంటీర్లుగా దాదాపు మూడు లక్షల మందిని వైసీపీ కార్యకర్తలనే నియమించామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. సచివాలయ ఉద్యోగులు మన కార్యకర్తలే అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచెయ్యని వాలంటీర్లు అవసరం లేదని, ప్రభుత్వం చెప్పినట్లు చేయకపోతే మరొకరిని నియమిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వాలంటీర్లు వైసీపీ సైనికులని, పార్టీకి సమాచారం చేరవేసే కార్యకర్తలని మరో మంత్రి అంబటి రాంబాబు అన్నారు.


వాలంటీర్లకు సామాజిక పింఛన్ల పంపిణి, సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అప్పగించింది జగన్ ప్రభుత్వం. వీరికి ఒక్కొక్కరికి ప్రతినెలా రూ. ఐదువేల చొప్పున గౌరవ వేతనంతో పాటు ప్రతిఏటా అవార్డుల పేరుతో నగదు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ జెండాలు మోయిస్తూ వారిని తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొంటూ ఏటా రూ. నాలుగువేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇంత దారుణం ఏ రాష్ట్రంలోనూ లేదు. వాలంటీర్లను స్థానిక ఎన్నికల్లోనూ, ఉపఎన్నికల్లోనూ గెలవడానికి వినియోగించుకున్నారు. ఎన్నికల్లో వైసీపీకి ఓటు వెయ్యకపోతే పథకాలు, పింఛన్లు రద్దు చేస్తామని వీరి ద్వారా ఓటర్లను బెదిరించారు. అంతేకాదు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తీసుకొచ్చే బాధ్యతను, ముఖ్యమంత్రి బహిరంగసభలకు జనాన్ని తరలించడానికి కూడా వాలంటీర్లను ఉపయోగించుకొంటున్నారు. రానున్న ఎన్నికల్లో వీరి ద్వారా పెద్దఎత్తున నగదు పంపిణీ చేయించి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులలో జోక్యం చేసుకుంటున్నారు వాలంటీర్లు. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదంగా పరిణమించింది. ఫ్యాక్షనిజం తలకెక్కించుకొన్న నియంత పాలనలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఉంటుందనుకోవడం అత్యాశే అవుతుంది.


గ్రామాల్లో, పట్టణాల్లో కొందరు వాలంటీర్ల అరాచకానికి, ఆగడాలకు అంతులేదు. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడటం, ఇసుక అక్రమ రవాణా, వృద్ధుల పింఛన్ల సొమ్ము కాజేయడం, అక్రమ మద్యం తరలించడం, పింఛను మామూళ్ళు వసూలు చెయ్యడం, ఖాళీగా ఉన్న స్థలాలు ఆక్రమించడం, పింఛను ఇవ్వలేదని ప్రశ్నించిన వారిపై దాడులు చెయ్యడం వంటి చర్యలతో వారు సాగిస్తున్న విశృంఖలత్వం అంతులేనిది. వైసీపీ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి రాళ్ళెత్తే కూలీలుగా వాలంటీర్ల వ్యవస్థను మార్చారు. ఇప్పడు తమ సొంత పత్రిక కొనుగోలు కోసం ఒక్కో వాలంటీర్‌కు నెలకు రూ.200 చొప్పున చెల్లించేందుకు జీవో జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు మూడు లక్షల మంది వాలంటీర్లకు ప్రతినెలా రూ.200 చొప్పున మొత్తం రూ.5.50 కోట్లు ఖర్చు చెయ్యబోతున్నారు. వాలంటీర్ల వ్యవస్థను తమ వశం చేసుకొని మొత్తం వాళ్ళతోనే రాజ్యం నడుపుతున్నారు. ముఖ్యమంత్రి ప్రతి పథకానికి తన తండ్రి వైఎస్ పేరు, తన పేర్లు పెట్టి తన జేబులో నుంచి డబ్బు పంచిపెడుతున్నట్లు ప్రజలను వంచిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియను కబ్జా చేసేలా నానావిధ అక్రమాలకు తెగబడుతున్నారు. వాలంటీర్లు ప్రజాధనాన్ని జీతాలు తీసుకొంటూ పాలకపక్షానికి ఊడిగం చేస్తున్నారు. దీనిని గుర్తించిన ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చెయ్యడంతో వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అసలు వాలంటీర్ల వ్యవస్థనే పూర్తిగా రద్దు చేసి ప్రజాసామ్యాన్ని కాపాడాలి.

నీరుకొండ ప్రసాద్

Updated Date - 2022-08-03T06:22:53+05:30 IST