Abn logo
Aug 16 2020 @ 00:00AM

నాలో దాగిన చిత్రకళ నాతో పాటే ప్రయాణించింది!

నొప్పించక, తానొవ్వక మెప్పించిన  ప్రతిభావంతుడు బ్రహ్మానందం. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన మేటి కమెడియన్‌ ఆయన. లాక్‌డౌన్‌ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకుంటూ సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పకళల్లో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకొంటున్నారు. వాటి గురించి ‘నవ్య’కు బ్రహ్మానందం ప్రత్యేకంగా  చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...


నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. మాది పెద్ద కుటుంబం. నాన్నది చాలీచాలని సంపాదన. అయినా గుట్టుగా బతికిన కుటుంబం. మా నాన్న చిత్రకారుడు, శిల్పి. మా అన్నయ్యల్లో కూడా  చాలామంది చిత్రకారులు ఉన్నారు. నాన్న, అన్నయ్యల ప్రభావంతో నాకూ చిన్నతనంలోనే  చిత్రలేఖనం మీద ఆసక్తి ఏర్పడింది. నేను ఆరో తరగతి చదివే రోజుల నుంచీ బొమ్మలు వేయడం ప్రారంభించాను. జోసఫ్‌ అని మాకు ఓ డ్రాయింగ్‌ మాస్టారు ఉండేవారు. బొమ్మలు వేయాలనే నాలోని ఆసక్తిని గమనించి ప్రోత్సహించింది ఆయనే! ఆ రోజుల్లో ప్రత్యేకంగా డ్రాయింగ్‌ క్లాసులు ఉండేవి. బొమ్మ ఎలా వేయాలో ఆ క్లాసులో డ్రాయింగ్‌ మాస్టారు వేసి చూపించేవారు. చిన్న చిన్న మెలకువలు నేర్పించేవారు. అవి నిశితంగా గమనించి నేనూ ప్రయత్నించేవాడిని. నేను వేసిన మొదటి బొమ్మ ఏమిటో తెలుసా... మహాత్మాగాంధీ. ఆ రోజుల్లో  గాంధీ, నెహ్రు, నేతాజీ.. వీళ్లే కదా మాకు హీరోలు. అందుకే నేనే కాదు చాలా మంది వాళ్ల బొమ్మలు వేయడానికి ప్రయత్నించేవాళ్లు. 


బహుమతులూ పొందా!

స్కూల్లో డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించేవారు. దాదాపు ప్రతి సంవత్సరం నాకు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చేది. జింకా రామారావు అని ప్రసిద్ధ చిత్రకారుడు సత్తెనపల్లిలో ఉన్నారు. ఆయన  బొమ్మలు వేస్తుంటే ఆసక్తిగా గమనించేవాడిని.  ‘ప్రతి దాంట్లో వేలు పెట్టడం, బాగా చేస్తున్నాడు రా’ అనిపించుకోవడం చిన్నతనం నుంచి నాతో పెరిగిన అలవాటు. వేమన పద్యాలు, పోతన పద్యాలు పాడడం, చిన్న చిన్న నాటికలు వేయడం... వాటిలో బహుమతులు పొందడం.. చాలా సరదాగా, థ్రిల్లింగ్‌గా అనిపించేది. నటన, చిత్రలేఖనం అనేవి చదువుతో పాటు ఆసక్తిగా నేర్చుకొనేవే తప్ప అవి సబ్జెక్ట్స్‌లో ఓ భాగం కాదు. ఇందులో ఇన్ని మార్కులు వస్తేనే పాస్‌ అవుతారని ఉండేది కాదు. అందుకే ఇలాంటి వాటిని ఆ రోజుల్లో ‘ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌’ అనే వారు. ఎంత అభిమానమున్నా వాటికే పరిమితమైతే ఎలా కుదురుతుంది!  అందుకే జీవన భుక్తికి చదువు కూడా ఉండాలి కనుక కొంతకాలం ఇవన్నీ పక్కన పెట్టేసి  ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. పూర్తి చేశాను.


లెనిన్‌ బొమ్మ వేసి ఇచ్చా

భీమవరం డీఎన్‌ఆర్‌ కాలేజీలో బి.ఎ. చదువుతున్నప్పుడు కూడా బొమ్మలు వేసేవాడిని. కాలేజీలో సున్నం ఆంజనేయులు మాస్టారు నాకు అన్నివిధాలా సాయం చేసేవారు. కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి ఆయన. అది గ్రహించి ఆయనకు లెనిన్‌ బొమ్మ వేసి ఇచ్చా. భీమవరంలోని ‘అంకాళ ఆర్ట్‌ అకాడెమీ’ తరుఫున ప్రతి ఏడాది చిత్రలేఖనం పోటీలు జరుగుతుండేవి. ఆ పోటీల్లో ఒకసారి నాకు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. ఆ సంస్థ నుంచి బహుమతి అందుకోవడం ఆ రోజుల్లో గర్వంగా భావించేవాళ్లం. కాలేజీలో సంజీవరావు అని నాకు సీనియర్‌ ఉండేవాడు. చాలా బాగా బొమ్మలు వేసేవాడు. అతనితో స్నేహం చేశా. తర్వాత అతను కాలేజ్‌ ప్రిన్సిపాల్‌గా చేసి రిటైర్‌ అయ్యాడు.  


బొమ్మలు వేసుకుని ఎలా బతుకుతావురా అనేవారు... 

బి.ఎ. పూర్తి అయింది. మంచి ఉద్యోగం కావాలంటే ఎం.ఎ. చదవాలి. కానీ డబ్బు లేని కారణంగా దానికి ఎంతో ఆలోచించాల్సి వచ్చింది.   మాది లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కావడంతో డబ్బుకు ఎప్పుడూ ఇబ్బంది ఉండేది. అందుకే మా వాళ్లందరినీ అతికష్టం మీద ఒప్పించి, ఎం.ఎ.లో చేరా. అక్కడ ఎస్వీ జోగారావు తెలుగు డిపార్ట్‌మెంట్‌కు హెడ్‌గా ఉండేవారు. ఆయనకు కూడా కొన్ని బొమ్మలు వేసి ఇచ్చాను. ఆ రోజుల్లోనే నేను వేసిన దశావతారాలు బొమ్మకు ప్రశంసలు లభించాయి. ఇప్పుడైతే చిత్రలేఖనానికి, ఆర్టిస్టులకు పేరు, డబ్బు వస్తున్నాయి కానీ ఆ రోజుల్లో బొమ్మలు వేస్తున్నానంటే జాలిగా చూసేవారు. ‘బొమ్మలు వేసుకొని ఎలా బతుకుతావురా’ అనేవారు. డ్రాయింగ్‌ మాస్టర్లంటే అందరికీ అప్పుడు లోకువే. అందుకే చిత్రలేఖనానికి అంతగా ప్రాముఖ్యం ఇవ్వకుండా చదువు మీద దృష్టి పెట్టేవాడిని. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనేది నా లక్ష్యంగా ఉండేది ఆ రోజుల్లో. నేను పట్టించుకోకపోయినా చిత్రలేఖనం మాత్రం నాతో సహజీవనం చేసింది. నాతో పాటే ప్రయాణించింది! 


బాపు బొమ్మలు వేశా!  

ఎం.ఎ. చదువుతున్నప్పుడే బాపుగారి బొమ్మలంటే ఇష్టం. ఆయన వేసిన బొమ్మల్ని మళ్లీ వేసేవాడ్ని. చిన్న గీతతో గొప్ప భావాన్ని పలికించిన మహోన్నత చిత్రకారుడు బాపు. అలాగే మరో మంచి చిత్రకారుడు వడ్డాది పాపయ్య బొమ్మలు కూడా నన్ను బాగా ఆకట్టుకొనేవి. వాళ్లలా కావాలనే కోరిక నాకు ఉండేది కాదుకానీ ‘మనలో కూడా ఆర్ట్‌ ఉంది కదా! మంచి బొమ్మలు వేద్దాం’ అనుకొనేవాడిని. 


నాన్నతో దెబ్బలు తిన్నా 

ఆర్ట్‌ లైన్‌లో వెళదామని మొదట్లో  అనుకొన్నాను కానీ నాన్న ఒప్పుకోలేదు. ఆ విషయాన్ని ఆయన మాములుగా చెప్పలేదు. గట్టిగా నాలుగు దెబ్బలు వేసి మరీ చెప్పాడు. నెలసరి సరుకులతో పాటు లావుపాటి చాంతాడు కూడా ఆయన కొనేవారు. ఆరుగురు పిల్లల్ని చేత్తో కొట్టాలంటే ఆయన మాత్రం అలసిపోడూ! అందుకే చాంతాడుకు పని చెప్పేవారు. తప్పు చేస్తే ఆయన ఎవరినీ వదిలేవాడు కాదు. నేను కూడా ఆ చాంతాడు దెబ్బల్ని చాలాసార్లు తిన్నాను. నాన్నంటే ఉండే భయమే శ్రీరామరక్షలా నన్ను ఇప్పటికీ కాపాడుతోంది. సెకండ్‌ షో సినిమాకి వెళ్లొస్తే కొట్టేవాడు. సిగరెట్‌ కానీ, మందు కానీ, ఇతర పిచ్చి వేషాలు అలవాటు కాకుండా ఉండడానికి నాన్నే కారణం! ఏదైనా అలవాటు చేసుకోవాలంటే పెద్దల అనుమతి తప్పనిసరిగా ఉండాలనే భావన మదిలో బలంగా నాటుకుపోవడం వల్ల దురలవాట్లకు దూరంగా ఉన్నా. నేనే కాదు నా పిల్లలు కూడా. 


మా నాన్న హాస్యప్రియుడు కూడా. ఒకసారి క్లాసులో కొందరు పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్లని కొట్టి, పనిలో పనిగా పక్కనే ఉన్నవాడిని కూడా ఓ దెబ్బ వేశాడు. దాంతో వాడు ‘నేనేం చేశానండీ.. నన్ను ఎందుకు కొట్టారు?’ అని ఉక్రోషంతో అడిగాడట. ‘నువ్వు అల్లరి చేసినప్పుడు సెపరేట్‌గా వచ్చి కొడతానేంట్రా. అందరితోపాటు కొట్టానులే పో’ అన్నారట నాన్న. 


లాక్‌డౌన్‌ మళ్లీ ఆ పని చేయించింది

అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత చిత్రకారుడిగా గ్యాప్‌ వచ్చింది. 35 ఏళ్ల నటనాజీవితంలో మొత్తం మీద ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు సెలవులు ఉంటాయేమో! మిగతా అన్ని రోజులూ గ్యాప్‌ లేకుండా నటిస్తూనే ఉన్నా. అంత బిజీ జీవితంలో బొమ్మలు వేయడానికి తీరిక చిక్కలేదు. సమయమే కాదు సందర్భమూ కుదరలేదు. లాక్‌డౌన్‌ పుణ్యమాని ఇప్పుడు తీరిక సమయం దొరికింది. మొదటి నెల్లో ఏం చెయ్యాలో తెలీలేదు. పుస్తకాలు చదువుకుందామనుకున్నాను. పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ అదేపనిగా పుస్తకాలు చదవలేం కదా. అలాగే టీవీని కూడా ఎక్కువ సేపు చూడలేం కదా. ఇక ఎవరితోనన్నా మాట్లాడాలి. మనం బోర్‌ కొడుతోందని మాట్లాడడం మొదలు పెడితే అవతలి వాడికి కూడా బోర్‌ కొట్టవచ్చు కదా! అందుకే ఇవన్నీ కాదు ఏదొక వ్యాపకం ఉండాలి అని ఆలోచించి, రచనా వ్యాసాంగం మొదలుపెట్టా. కొన్ని కవితలు రాశాను. అవి చదివి బాగుంటే నన్ను నేనే మెచ్చుకున్నా, బాగోకపోతే తిట్టుకున్నా.


‘కళ్లకు కనిపించేది నిజం కాదు.. చెవులకు  వినిపించేది నిజం కాదు. మాట్లాడిన ప్రతి మాటా నిజం కాదు.. మరేది నిజం? మానవుని అంతరాంతరాల్లో నిద్రిస్తున్న  మనసును చెప్పమంటే,  ఆ మనసు మనిషికి చెబుతుందే అదే నిజం... ’  ‘నువ్వు ఓ కన్నీటి బిందువుని నాకు ఇవ్వు.. దాన్ని నేను ఆనందభాష్పంగా  మార్చి నీకు ఇస్తా’... ఇలా ఉంటాయి నా కవితలు. 


ఖురాన్‌, బైబిల్‌ అధ్యయనం చేస్తున్నా ..  

మా ఫ్రెండ్‌ యూసఫ్‌ఖాన్‌ హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యాడు. అతని దగ్గర ఖురాన్‌ తెలుగులో ఉంది. అది చదువుతున్నా. అయితే  నాకు అర్ధం కాక రోజుకు ఓ అధ్యాయం చొప్పున అతను చెబుతుంటే నేర్చుకుంటున్నా. 35 అధ్యాయాలు ఉంటాయట. అవి వింటూ నాకు కలిగే సందేహాలు తీర్చుకుంటున్నా. అలాగే రాజు అనే బ్యాంక్‌ ఉద్యోగి ఉన్నాడు. అతన్ని అడిగి బైబిల్‌ తెప్పించుకొన్నా. బైబిల్‌లో జీసస్‌  ఏం చెప్పాడో తెలుసుకుంటున్నా. 


రాఘవేంద్రరావు గారికి ఇచ్చా 

చిత్రలేఖనంతో పాటు శిల్పం కూడా చెయ్యాలని తపన. వెంకటేశ్వరస్వామి బొమ్మ తల వరకూ తయారు చేసి రాఘవేంద్రరావుగారికి పంపించాను. ఆయన  ఆఫీసులో ఉంది అది. గౌతమబుద్ధుడి బొమ్మ చేశాను. అది నా దగ్గరే ఉంది. వివేకానందుడి బొమ్మ తయారు చేసి ఓ మిత్రుడికి ఇచ్చా. 


ఆ ఆలోచనతోనే.. 

రాముడు, ఆంజనేయుడు... భగవంతుడికి, భక్తికి ప్రతీకలు. వాళ్లు ఉన్నారో లేదో మనకు తెలీదు. వాళ్లది పురాణమో, చరిత్రో కూడా చెప్పలేం. ఒకవేళ అది చరిత్ర అయి ఉంటే ఇన్ని వందల సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణం చేస్తున్నారనే విషయం ఆంజనేయుడికి తెలిస్తే, ‘ఆహా! నా స్వామి ఆలయనిర్మాణానికి శంకుస్థాపన ఇవాళ జరుగుతోంది కదా’ని ఎంతో సంతోషిస్తాడు. ఆ భక్తిపారవశ్యంలో శ్రీరాముని  ఆలింగనంలో కరిగిపోయినప్పుడు ఆంజనేయుడి  కళ్లలోనుంచి వచ్చే ఆనందభాష్పాలు చిత్రీకరించాలని ఆ బొమ్మ వేశాను. రోజుకు గంట చొప్పున ఆ బొమ్మ వేయడానికి  ఐదు రోజులు పట్టింది. బొమ్మకు సౌందర్యం తీసుకురావడం కంటే, ఆ బొమ్మ ద్వారా  సమాజానికి ఏదొకటి చెప్పాలన్నదే చిత్రకారుడిగా  నా తపన. 

చిత్రలేఖనం అనేది లలితకళల్లో ఒకటి. దాని గురించి వివరంగా చెప్పాలంటే.. బురదలో పొర్లాడుతున్న పందిని చూస్తే చీదరించుకొంటాం.  ముక్కు మూసుకుని దూరంగా వెళ్లిపోతాం. దాన్నే ఓ చిత్రకారుడు అద్భుతంగా బొమ్మ  గీసి, ఫ్రేమ్‌ కడితే, నిలబడి మరీ ఆ బొమ్మను చూస్తాం. చిత్రలేఖనానికి ఉన్న గొప్పతనం అది!వెంకటేశ్వరస్వామి, శివుడు.. ఇద్దరు కారు.. ఒక్కరే! ‘శివాయా విష్ణు రూపాయా.. విష్ణు రూపాయా శివవే నమ:’ అంటారు. ఆ తత్వంతో ఒక పక్క శివుడు, మరో పక్క విష్ణువు అంటే వెంకటేశ్వరస్వామి ఉన్న బొమ్మను గీసి, ‘వెంకట ప్లస్‌ ఈశ్వర.. వెంకటేశ్వర’ అని కాప్షన్‌ రాసి, ఏడేనిమిదేళ్ల క్రితం చిరంజీవిగారికి ప్రజెంట్‌ చేశాను. ఆ బొమ్మను చూసి ఆయన ఎంతో మురిసిపోయారు.
బాపుగారు మంచి చమత్కారి. ‘రాధాగోపాళం’ షూటింగ్‌ కోసం ఆయన హైదరాబాద్‌ వస్తే నేను వేసిన కొన్ని బొమ్మల్ని ఆయనకు చూపించాను.  ‘ఏవో బొమ్మలు వేసుకుని బతుకుతున్నాం. మీరు కూడా  ఇలా బొమ్మలు గీసి మా నోట్లో రాయి కొడితే ఎలాగండి!’ అని నవ్వుతూ కామెంట్‌ చేశారాయన.   ఒకసారి ఆయన్ని మా ఇంటికి భోజనానికి పిలిచాను. తిన్న తర్వాత ‘వంటకాలు ఎలా ఉన్నాయండి’ అని అడిగాను. ‘నువ్వే వండినట్లు అడుగుతావేమిటయ్యా’ అని ఆయన నవ్వుతూ అన్నారు. బాపుగారి బొమ్మలే కాదు ఆయన బొమ్మ కూడా వేసిచ్చాను.


- వినాయకరావు


Advertisement
Advertisement
Advertisement