ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది

ABN , First Publish Date - 2022-01-08T07:30:58+05:30 IST

‘‘జగన్‌ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. అధికారం చేపట్టిన

ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది

    • జగన్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారు
    • ఓటీఎస్‌ రిజిస్ట్రేషన్‌ చెల్లదు... డబ్బులు కట్టకండి
    • వైసీపీ నేతలు చెప్పినట్లే పోలీసులు ఆడుతున్నారు
  • ఓటీఎస్‌ రిజిస్ట్రేషన్‌ చెల్లదు... డబ్బులు కట్టకండి
  •   కుప్పం నియోజకవర్గం పర్యటనలో చంద్రబాబు


కుప్పం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్లకే ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం కుప్పం మండలంలో పర్యటించారు. స్థానిక 100 పడకల ఆసుపత్రిలో ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా రూ.50 లక్షలతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ ప్లాంటును ప్రారంభించిన అనంతరం పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో రోడ్‌ షో చేస్తున్నప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


‘‘ప్రజలు నచ్చిన పార్టీకి సపోర్ట్‌ చేసే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ సపోర్ట్‌ చేస్తే ఉద్యోగాలు తీసేయడం, పథకాలు నిలిపేయడం వంటి పనులు చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టి పథకాలు రద్దు చేసేవారిని గుర్తుంచుకుని, అధికారంలోకి వచ్చాక అలాంటివారికి అన్నీ శాశ్వతంగా రద్దు చేస్తాం. వైసీపీని ఓడించి శంకరగిరి మాన్యాలకు పంపించి, రెండేళ్లలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎన్నికల సమయంలో రూ.1,000 పంపిణీ చేసి, ఇప్పుడు ధరలన్నీ పెంచేసి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. అమ్మఒడి డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వకుండా వాయిదాలు వేస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంంలో రూ.3.14 లక్షల కోట్లు అప్పుంటే.. జగన్‌ రెండున్నరేళ్లలోనే దాన్ని రూ.7 లక్షల కోట్లకు పెంచారు. ఓటీఎస్‌ రిజిస్ర్టేషన్లు చెల్లవు. ఎవ్వరూ డబ్బులు కట్టొద్దు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రుణాలను మాఫీ చేస్తాం. భారీ వర్షాలకు రైతులు పెద్దఎత్తున పంటలను నష్టపోతే.. నేటికీ నష్టపరిహారం ఇవ్వలేదు. పోలీసులు పూనకం వచ్చినట్లు వైసీపీ నేతలు చెప్పినట్లే చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.



మోదీని కొనియాడి...

‘‘ఇజ్రాయిల్‌ వెళ్లి అక్కడి సాగు విధానాన్ని పరిశీలించి కుప్పంలో అమలుచేశా. రైతులు సత్ఫలితాలు సాధించారు. 2004లో వైఎస్సార్‌ ఇజ్రాయిల్‌ సాగు విధానాన్ని ప్రోత్సహించలేదు. అదే సమయంలో గుజరాత్‌లో సీఎంగా ఉన్న ప్రస్తుత పీఎం నరేంద్ర మోదీ ఇజ్రాయిల్‌ విధానంపై ఆసక్తి చూపి స్టడీ చేశారు. కుప్పంలోని ఇజ్రాయిల్‌ విధానాన్ని గుజరాత్‌లో అమలుచేశారు. అదీ నాయకత్వం అంటే’’ అని కొనియాడారు.


వారి తప్పుతోనే నేను తల దించుకోవాల్సి వస్తోంది

‘‘కుప్పంలో టీడీపీకి ఓటర్లున్నారు. ఓట్లు వేయించుకునే సత్తా ఉంది. అయినా.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయాం. కుప్పంలో కొందరు నాయకులు చేసిన తప్పునకు నేను రాష్ట్రంలో తలదించుకోవాల్సి వస్తోంది. వైసీపీ నేతల నుంచి మాటలు పడాల్సి వస్తోంది. 7 వార్డుల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాం. లేకుంటే టీడీపీకే చైౖర్మన్‌ పీఠం దక్కేది. కుప్పంలో నాయకులు తప్పుచేస్తే ఇక నుంచి నిలదీయండి. నాకు నేరుగా ఫిర్యాదు చేయండి. కుప్పం నుంచే పార్టీని ప్రక్షాళన చేస్తా’’ అని చెప్పారు.


పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు

‘‘వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ఇప్పటి నుంచే చాలామంది అడుగుతున్నారు. అప్పటి పరిస్థితులను బట్టి వాటికి అనుగుణంగా పొత్తులు ఉంటాయి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా సామాజిక ప్రయోజనాల గురించి ఆలోచించి టీడీపీని గెలిపించాల్సిన అవసరం ఉందని బాబు అన్నారు.


సభలోకి జొరబడిన వైసీపీ కార్యకర్త

కుప్పం మండలం గరిగచిన్నేపల్లెలో శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతుండగా.. ఓ వైసీపీ కార్యకర్త సభలోకి వచ్చి, కాస్త అలజడి సృష్టించాడు. దీంతో చంద్రబాబు స్పందిస్తూ ‘‘బుద్ధి ఉందా! కావాలనే వైసీపీ ఇలా నాటకాలు ఆడుతోంది. వైసీపీ సభల్లోకి టీడీపీ కార్యకర్తలు ఎప్పుడైనా వెళ్లారా? కావాలని ఇతరులను రెచ్చగొట్టి చంద్రబాబు నిలదీశారని పబ్లిసిటీ చేసుకోవాలని చూస్తున్నారు’’ ని ఆగ్రహించారు.


టీడీపీ మద్దతుదారులమని ఉద్యోగం తొలగించారు

‘నిజాయితీగా పనిచేసినా.. టీడీపీ సానుభూతిపరుడనే కారణంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నా ఉద్యోగాన్ని తొలగించారు’ అని ఓ మాజీ వలంటీరు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నాననే కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపొమ్మని బెదిరిస్తున్నట్లు ఓ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తన అవేదనను చెప్పుకున్నారు. 


చంద్రబాబుకు ఫిర్యాదు చేయలేదు

హౌసింగ్‌లో అవినీతి జరిగిందని తామెవరూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయలేదని రామకుప్పం మండలం నారాయణపురం తండాకు చెందిన వలంటీర్లు బాలనాయక్‌, దేవేంద్రనాయక్‌, రోజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రాత్రి తమ గ్రామానికి వచ్చిన చంద్రబాబుకు టీడీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు హౌసింగ్‌ బిల్లుల కోసం రూ.15 వేలు చొప్పున వసూలు చేశారంటూ పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారన్నారు. గ్రామస్తుల ఫిర్యాదులతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు.




పవన్‌ ప్రజాదరణ కలిగిన నేత: అమరనాథరెడ్డి

పవన్‌తో కలిసి పోటీ చేయాలని గురువారం రాత్రి వీర్నమల గ్రామంలో ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు చంద్రబాబు వన్‌సైడ్‌ లవ్‌ చేస్తున్నామని చమత్కరించిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. శుక్రవారం కూడా కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ నిజాయితీపరుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు. అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకుంటే తప్పు లేదు. ఇది నా సొంత అభిప్రాయం’’ అని అన్నారు.


Updated Date - 2022-01-08T07:30:58+05:30 IST