అజాత శత్రువు

ABN , First Publish Date - 2021-05-27T05:47:01+05:30 IST

చేకూరి కాశయ్య మరణంతో ఒక తరం నిష్క్రమించినట్లయింది. హైదరాబాద్‌ రెడ్డి హాస్టల్‌లో ఉంటూ ఆయన చదువుకున్నారు....

అజాత శత్రువు

చేకూరి కాశయ్య మరణంతో ఒక తరం నిష్క్రమించినట్లయింది. హైదరాబాద్‌ రెడ్డి హాస్టల్‌లో ఉంటూ ఆయన చదువుకున్నారు. అది నిజాం వ్యతిరేక పోరాటానికి కేంద్ర బిందువు. నిత్యం సమావేశాలు జరిగేవి. కెవి రంగారెడ్డి, నూకల రామచంద్రారెడ్డి, స్వామి రామానందతీర్థ, డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య వంటి అగ్రశేణి నాయకులందరూ విద్యార్థులను, యువకులను చైతన్యపరిచేవారు. అలా మర్రి చెన్నారెడ్డి దృష్టిలో పడ్డారు కాశయ్య. పాఠశాల ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి కొత్తగూడెం పంచాయితీ సమితి విస్తరణ విభాగంలో కొంత కాలం పనిచేశారు. ఆ సమయంలో సమితిలోని గ్రామాలన్నింటిలో పరిచయాలు, సంబంధాలు పెంచుకున్నారు. 1964లో కొత్తగూడెం పంచాయితీ ‍సమితి అధ్యక్షనిగా ఎన్నికయ్యారు. 1969లో ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లాలో నాయకత్వం వహించారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు. అప్పట్లో వరంగల్‌ జిల్లాలోని డోర్నకల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం లోక్‌సభలో ఉండటంతో ఈ తేడా పడింది. జి.కె. మేల్కోటే, యస్‌.బి. గిరి, మల్లికార్జున్‌, జె. రామేశ్వరరావు, యం. సత్యన్నారాయణరావు, తులసీరామ్‌, జి. వెంకటస్వామి వంటివారు ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి పేరుతో పార గుర్తుపై గెలిచారు. కాశయ్య కూడా గెలిచి ఉంటే హిందీ ఉర్దూ భాషల ప్రవేశం, ఉపాధ్యాయునిగా పనిచేసిన అనుభవంతో పార్లమెంట్‌లో రాణించి, సీనియర్‌ పార్లమెంటేరియన్‌గా నిలిచేవారనటంలో సందేహం లేదు. కాని కాశయ్య నిరుత్సాహపడకుండా 1972లోనే కొత్తగూడెం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1975–‍77 అత్యవసర పరిస్థితి కాలంలో జలగం వెంగళరావు పాలనపై కేంద్రంలో వున్న జనతాపార్టీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ‘విమద్‌లాల్‌ కమిషన్‌’ను వేయించారు. 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరిగి జనతాపార్టీ అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి ఎన్నికయ్యారు. జనతాపార్టీ చీలికతో గౌతు లచ్చన్న, సుంకర సత్యన్నారాయణ, వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి మా అందరితో పాటు లోక్‌దళ్‌ పక్షానికొచ్చారు. ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావుపై సత్తుపల్లి శాసనసభకు కవి కాళోజీ నారాయణరావును అభ్యర్థిగా నిలిపి, వారి తరఫున తీవ్రంగా ప్రచారం చేశారు. ‘విమద్‌లాల్‌ కమిషన్‌’ వెంగళరావు పాలనను వేలెత్తి చూపడంతో ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అటువంటి ఉన్నత సంప్రదాయాలు ఆ రోజులలో ఉండేవి. 1987లో జిల్లా పరిషత్‌కు ప్రత్యక్షంగా గ్రామీణ ఓటర్లు ఎన్నుకొనే పద్ధతిలో చైర్మన్‌గా (అధ్యక్షుని) కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న జలగం వెంగళరావు కుమారుడు ప్రసాదరావు, సిపిఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు వంటి హేమాహేమీలు పోటీలో వున్నారు. తుమ్మల నాగేశ్వరరావు చేకూరి కాశయ్యను బరిలోకి దించి గెలిపించారు.


‍ఖమ్మంలో ‘గురుదక్షిణ’ పేరుతో ఒక ట్రస్టును నెలకొల్పి పట్టణ ప్రాంతంలో నలభై ఎకరాల స్థలాన్ని సేకరించి ప్రకృతి, ఆయుర్వేద వైద్యశాలలు, వృద్ధాశ్రమం వంటివి నెలకొల్పడానికి శ్రీకారం చుట్టారు కాశయ్య. నేడు అది రూ.400కోట్ల ఆస్తి. అన్యాక్రాంతం కాకుండా ఆ ఆస్తిని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చారు. జిల్లాలో ఉపాధ్యాయులు, రిటైరైనవారు, ఇంకా పనిచేస్తున్నవారు, వారి బిడ్డలు దానికి సాయం చేస్తున్నారు. దానిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చి ‘చేకూరి కాశయ్య’ గారి ఆత్మకు శాంతి కలిగేటట్లు కలకాలం కళకళలాడేటట్లు రూపొందించటం అభిలషణీయం. నాటి ప్రధాని పి.వి. నరసింహారావు, నాటి ముఖ్యమంత్రులు జలగం, చెన్నారెడ్డి, విజయ భాస్కరరెడ్డి, జనార్దనరెడ్డి, అంజయ్య వంటి వారికి కాశయ్య ఆత్మీయుడు, ఆంతరంగికుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం కాశయ్యను స్వాతంత్ర సమరయోధునిగా గుర్తించి సత్కరించింది.


చేకూరి కాశయ్య అజాతశత్రువు. శుభంలోకాని, అశుభంలోకాని ఎవరు పిలిచినా తప్పకుండా హాజరై ఆ కుటుంబ కష్ట సుఖాలలో భాగస్వామిగా ఉండేవారు. ప్రతివారిలోనూ మంచినేగాని, చెడును అసలు పట్టించుకోని తత్వం. పరుషపద ప్రయోగం లోపించిన వాదనా పటిమకు తార్కాణం ఆయన. ‍ధన బలం, కుల బలం, కుటుంబ నేపథ్యం వంటి హంగులేమీ లేకుండా కేవలం తనకున్న వ్యక్తిత్వ బలంతో రాణించిన కాశయ్య మార్గం నేటి యువతరానికి ఆదర్శం. వారి జీవిత చరిత్రను గ్రంథస్థం చేసి పాఠ్యాంశంగా పొందుపరచి బోధించడం అవసరం.

డాక్టర్‌ యలమంచిలి శివాజి

రాజ్యసభ మాజీసభ్యులు

Updated Date - 2021-05-27T05:47:01+05:30 IST