వైద్య రంగం రూపురేఖలు మూడేళ్లలో మార్చేస్తాం

ABN , First Publish Date - 2020-02-19T09:18:25+05:30 IST

రాష్ట్రంలో మరో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. మూడో దశ వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని

వైద్య రంగం రూపురేఖలు మూడేళ్లలో మార్చేస్తాం

3 దశల్లో 15,337 కోట్ల వ్యయం

మరో 16 కొత్త వైద్య కళాశాలలు

లోక్‌సభ నియోజకవర్గానికో బోధనాస్పత్రి

అదనంగా 3 కేన్సర్‌, 6 అనుబంధ కాలేజీలు

8 సూపర్‌, 16 నర్సింగ్‌ కాలేజీలు కూడా..

తొలిదశలో 7,548 ఆరోగ్య కేంద్రాలు

రెండో విడత 1,145 పీహెచ్‌సీల అభివృద్ధి

చివరిగా కొత్త ఆస్పత్రులు, నర్సింగ్‌ కాలేజీలు

సచివాలయాల్లోనే ఉచిత కంటి వైద్యసేవలు

1 నుంచి అందుబాటులోకి శస్త్రచికిత్సలు

అవసరమైనవారికి ఇళ్లకే కళ్లజోళ్లు పంపిణీ

కర్నూలులో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన

మూడో దశ కంటి వెలుగుకు శ్రీకారం

న్యాయ రాజధాని ఏర్పాటుపై మౌనం


కర్నూలు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. మూడో దశ  వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం ఆయన కర్నూలులో ప్రారంభించారు. రాష్ట్రమంతటా దాదాపు రూ.1,129 కోట్లతో నిర్మించబోయే ఆరోగ్య  ఉపకేంద్రాల నమూనా భవనాన్ని పరిశీలించి.. దానికి సంబంఽధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్థానిక ఎస్టీబీసీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికో బోధనాస్పత్రి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం అవి 11 మాత్రమే ఉన్నాయని, వీటిని 27కి పెంచబోతున్నామని తెలిపారు. దీనివల్ల వైద్య పీజీ సీట్లు పెరగడమే గాక ప్రతి పేదవాడికీ వైద్యం అందించడం సులువవుతుందన్నారు.


‘ప్రస్తుతం ఉన్న బోధనాస్పత్రులకు అదనంగా 6 అనుబంధ ఆస్పత్రులు, 8 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, 3 కేన్సర్‌ ఆస్పత్రులు, 16 కొత్త మెడికల్‌ కాలేజీలు, 16 నర్సింగ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేసి రాష్ట్ర వైద్య రంగం రూపురేఖలు మారుస్తాం’ అని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు బోధనాస్పత్రుల వరకు మూడేళ్లలో 3 దశల్లో వాటి బలోపేతం, అవసరమైన చోట మరమ్మతులు, కొత్త ఆస్పత్రుల నిర్మాణం చేపడతామని చెప్పారు. ‘తొలిదశలో రూ.1,129 కోట్ల వ్యయంతో 7,548 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం. 4,906 శాశ్వత భవనాల నిర్మాణానికి, 2,552 పాత భవనాల మరమ్మతుల కోసం ఈ నిధులు వెచ్చిస్తున్నాం. రెండోదశలో 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయబోతున్నాం.


వీటిలో కొత్తవి 149 కాగా.. మిగతా 989 పాతవాటికి మరమ్మతులతో పాటు 169 కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లను కూడా అభివృద్ధి చేయిస్తాం. 52 ఏరియా ఆస్పత్రులను కూడా ఆధునికీకరిస్తున్నాం. ఇందుకు రూ.700 కోట్లు ఖర్చు చేయనున్నాం. మూడో దశలో జిల్లా ఆస్పత్రుల బలోపేతంతోపాటు కొత్తగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, కొత్తగా మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణానికి మరో రూ.12,300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇలా మూడు దశల్లో రూ.15,337 కోట్లు వెచ్చించి వైద్యరంగం రూపురేఖలు మార్చుతాం’ అని వివరించారు. కంటివెలుగు పథకంలో భాగంగా గ్రామ సచివాలయాల్లోనే ఉచిత కంటి వైద్యసేవలు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో శస్త్రచికిత్సలు అవసరమైనవారికి మార్చి 1 నుంచి అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలోని టీచింగ్‌ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, 28 ఏరియా ఆస్పత్రులు.. ఇలా దాదాపు 133 కేంద్రాల్లో కంటి శస్త్ర చికిత్సలు చేస్తారని, అనంతరం రెండు వారాల్లో కళ్లజోళ్లు వారి ఇంటి వద్దకే వెళ్లి అందించే ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.


చంద్రబాబుకు కడుపుమంట..

రాష్ట్రమంతటా కంటివెలుగు ద్వారా 56.88 లక్షల మందికి కంటివైద్య పరీక్షలు చేశామని, నాడు-నేడు కింది పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని సీఎం అన్నారు. జాతీయ స్థాయి ప్రమాణాలకు దీటుగా ఆస్పత్రులను మెరుగుపరుస్తూ మంచి పరిపాలన అందిస్తుంటే ఓర్చుకోలేక చంద్రబాబు కడుపు మంటతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేన్సర్‌ వంటి భయంకరమైన వ్యాధికి వైద్యం అందుబాటులో ఉందని, అసూయతో కూడిన కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదన్నారు. 


న్యాయ రాజధాని ఊసెత్తని జగన్‌

కర్నూలుకు హైకోర్టు ప్రకటించిన తర్వాత మొదటిసారిగా కర్నూలుకు సీఎం జగన్‌ వస్తున్నారని వైసీపీ శ్రేణులు, న్యాయవాదులు అట్టహాసంగా స్వాగతం పలికారు. న్యాయవాదులు ‘థాంక్యూ సీఎం సార్‌’ అంటూ స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. సభలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా న్యాయ రాజధాని ఇచ్చినందుకు ‘థాంక్యూ సీఎం’ అని పదేపదే చెబుతున్నా.. జగన్‌ ఒక్కసారి కూడా స్పందించలేదు. తన ప్రసంగంలో ఆ ఊసే ఎత్తలేదు. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2020-02-19T09:18:25+05:30 IST