వాతావరణ మార్పులపై ‘వాణిజ్య’ పోరు

ABN , First Publish Date - 2021-08-06T06:28:22+05:30 IST

యూరోపియన్ యూనియన్ ప్రతిపాదిస్తున్న కార్బన్ బోర్డర్ ట్యాక్స్ (హరిత గృహ వాయువుల ఉద్గారాలను నిరోధించే కఠిన చట్టాలు) అమలులో లేని దేశాల నుంచి అల్యూమినియం, ఉక్కు, సిమెంట్ మొదలైన...

వాతావరణ మార్పులపై ‘వాణిజ్య’ పోరు

యూరోపియన్ యూనియన్ ప్రతిపాదిస్తున్న కార్బన్ బోర్డర్ ట్యాక్స్ (హరిత గృహ వాయువుల ఉద్గారాలను నిరోధించే కఠిన చట్టాలు) అమలులో లేని దేశాల నుంచి అల్యూమినియం, ఉక్కు, సిమెంట్ మొదలైన వస్తువుల దిగుమతులపై విధించే సుంకాన్ని భారత్ వ్యతిరేకించి తీరాలా? దీనికి సమాధానంగా అవును, కాదు అని రెండూ చెప్పవలసి ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్యం హరిత గృహ వాయువుల ఉద్గారాలతో ముడివడి ఉంది. ఇతరదేశాలు కూడా కార్బన్ బోర్డర్ ట్యాక్స్ విధించేలా చేయడం ద్వారా కాలుష్యకారక వాయువుల ఉద్గారాలను నిరోధించడమే యూరోపియన్ యూనియన్ ప్రతిపాదన లక్ష్యం. అయితే, అసమానతలు అంతకంతకూ పెరిగిపోతున్న ప్రస్తుత ప్రపంచంలో వాతావరణ మార్పులపై పోరుకు దేశాల మధ్య అవసరమైన సహకారాన్ని పెంపొందించడానికి ఆ ప్రతిపాదన తోడ్పడుతుందా అనేది అసలు ప్రశ్న. 


1990 దశకం తొలినాళ్ళలో ప్రపంచదేశాల నాయకులు సమావేశమై వాతావరణ మార్పుల విషమ ప్రభావాలను నిరోధించే విషయమై కూలంకషంగా చర్చించారు. పర్యావరణ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న వాస్తవాన్ని గుర్తించి ‘ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’పై సంతకాలు చేశారు. కాలుష్యకారక వాయువుల ఉద్గారాల వల్ల భూమి వేడెక్కిపోతోందని, ఈ పరిణామం వికృత వాతావరణ వైపరీత్యాలకు దారితీస్తుందనే భయానక సత్యాన్ని వారు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో శతాబ్దాల పాటు ఉంటుంది. 19వ శతాబ్దం మధ్యనాళ్ళలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన కాలంలో వెలువడిన కార్బన్ ఉద్గారాలు ఇప్పటికీ వాతావరణంలో ఉండిపోయి భూ ఉష్ణోగ్రతలు పెచ్చరిల్లిపోయేందుకు కారణమవుతున్నాయి. ఇది, అందరికీ తెలిసిన వాస్తవమే. అయితే విశ్వవ్యాప్తమవుతున్న పర్యావరణ సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు కలసికట్టుగా ఎదుర్కోవలసి ఉందనే విషయాన్ని గుర్తు చేయడానికే నేను దాన్ని పునరుద్ఘాటించాను. 


వాతావరణ విపత్తు తీవ్రమవుతున్న ప్రస్తుత యుగంలోనే ప్రపంచదేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ముమ్మరంగా చేసుకొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అనుసంధానమవుతున్నాయి. భారీగా పెరిగిపోయిన ఉత్పత్తి కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించుకునేందుకే సంపన్న దేశాలు పనిగట్టుకుని ప్రపంచీకరణను ప్రోత్సహిస్తున్నాయనేది ఒక కఠోర వాస్తవం. ఈ కారణంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రపంచీకరణ పట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది. శ్రమ శక్తి చౌకగా లభించే చైనాలో తమ ఫ్యాక్టరీలను నెలకొల్పడం లాభదాయకంగా భావించిన పాశ్చాత్య సంపన్నదేశాలు, ముఖ్యంగా అమెరికా ఆ దేశంలో భారీ పెట్టుబడులు పెట్టాయి. సత్వర ఆర్థికాభివృద్ధికి ఆరాటపడుతున్న చైనా, ఆ మాటకు వస్తే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు పర్యావరణ పరమైన భద్రతలను ఉపేక్షిస్తున్నాయి. సంపన్నదేశాల లక్ష్యం ఫలించింది. ఆ దేశాలలో ఉత్పత్తి వ్యయాలు తగ్గాయి. వినియోగం పెరిగింది. చైనా, భారత్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో గణనీయమైన ఆర్థికాభివృద్ధి సుసాధ్యమయింది. 


ఇప్పుడు చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారు. ఆర్థికాభివృద్ధి సాధనలో అమెరికాను సైతం అధిగమించి గొప్ప ముందంజలో ఉంది. కరోనా మహమ్మారి కారణంగా అనేక దేశాల ఆర్థికవ్యవస్థలు కుదేలయిపోయాయి. అయితే అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా వాటా అంతకంతకూ పెరుగుతోంది. మరి హరిత గృహ వాయువుల ఉద్గారాలలో చైనా ఇప్పుడు ప్రపంచ అగ్రగామిగా ఉండడంలో ఆశ్చర్యమేముంది? 2020 సంవత్సరంలో చైనా 10.35గిగాటన్నుల బొగ్గుపులుసు వాయువును వాతావరణంలోకి విడుదల చేసింది. అమెరికా కంటే రెట్టింపు స్థాయిలో వాతావరణ కాలుష్యానికి చైనా కారణమవుతుండడం గమనార్హం. అయితే దీనివల్ల పాశ్చాత్య సంపన్నదేశాలకు వివిధ సరుకులు చాలా చౌకగా లభ్యమవుతున్నాయి. ఆ మేరకు ఆ దేశప్రజల వినియోగమూ పెరిగిపోతోంది. 2015లో అమెరికాలో ఒక్కో వ్యక్తి 1990లో కంటే 50 శాతం అధికంగా వస్తువులు, సేవలను వినియోగించుకున్నాడు. ఇదంతా ఆర్థికవ్యవస్థల ప్రపపంచీకరణ ఫలితమేననడంలో సందేహం లేదు. 


విషాదమేమిటంటే సంపన్నదేశాలు తమ కార్బన్ ఉద్గారాలను తగ్గించలేదు. వస్తూత్పత్తి కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించినప్పటికీ వస్తుసేవలు, విద్యుత్ వినియోగం పెరుగుదల కొనసాగుతోంది. అదే సమయంలో చైనా, భారత్, బ్రెజిల్, వియత్నాం మొదలైన దేశాలలో కూడా హరిత గృహ వాయువుల ఉద్గారాలు భారీగా పెరిగిపోతున్నాయి. కార్బన్ బోర్డర్ ట్యాక్స్ ద్వారా ఆ పర్యావరణ విపత్తును నివారించేందుకు యూరోపియన్ యూనియన్ పూనుకుంది. సంకల్పం మంచిదే. అయితే ఆ ప్రతిపాదనలో అనేక లోపాలు, లొసుగులు ఉన్నాయి. గతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి అనుకూలంగా వ్యవహరించిన దేశాలు ఇప్పుడు అందుకు విరుద్ధమైన ప్రతిపాదనలు ఎందుకు చేస్తున్నాయి? తమ స్వంత ఆర్థిక వ్యవస్థలను పరిరక్షించుకునేందుకే కాదూ? వస్తూత్పత్తి కార్యకలాపాలను దేశీయంగా నిర్వహించుకునేందుకు అమెరికా, యూరోపియన్ దేశాలు నిర్ణయించుకున్నాయి. ఆ నిర్ణయంలో భాగమే కార్బన్ బోర్డర్ ట్యాక్స్.


అయితే వర్తమాన ప్రపంచం నిన్నటి ప్రపంచం కాదు. సరుకులను చౌకగా ఉత్పత్తి చేసి ఎగుమతి చేసినప్పుడే సత్వర అర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు విశ్వసిస్తున్నాయి. మరి వాతావరణ ముప్పుకు కారణమవుతున్న ప్రపంచ వాణిజ్యవ్యవస్థను కార్బన్ బోర్డర్ ట్యాక్స్ మొదలైన చర్యలతో సంస్కరించడం సాధ్యమవుతుందా? ఆ చర్యలు సమస్య పరిష్కారానికి కాకుండా మరింత సంక్లిష్టమవడానికే తోడ్పడుతాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే కార్బన్ బోర్డర్ ట్యాక్స్ ద్వారా యూరోపియన్ యూనియన్‌కు భారీ ఆదాయం సమకూరుతుంది. అసమానతలు మరింతగా పెరగడానికే అది దారితీస్తుంది. ఉత్పత్తి-–వినియోగం పద్ధతుల్లో ఎటువంటి మార్పుకు దోహదం జరగదు. కాలుష్యకారక వాయువుల ఉద్గారాలు యథావిధిగా పెరిగిపోతుంటాయి. అంతర్జాతీయ వాణిజ్యం, వినియోగం సమస్యలను ప్రపంచం ఇంకెంత మాత్రం ఉపేక్షించలేదు. వినియోగాన్ని తగ్గించేందుకు, ఉత్పత్తి వ్యవస్థలను పర్యావరణ అనుకూలమైనవిగా చేసేందుకు కార్బన్ బోర్డర్ ట్యాక్స్ లాంటి వాటిని విధించడం తప్పనిసరి. తద్వారా సమకూరే ఆదాయాన్ని, వాతావరణ మార్పులతో అధికంగా ప్రభావితమవుతున్న దేశాలలో పర్యావరణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వెచ్చించి తీరాలి. వాతావరణ మార్పు ప్రపంచ సమస్య అయినప్పుడు దానికి పరిష్కారం కూడా ప్రపంచస్థాయిలోనే ఉండాలి.


సునీతా నారాయణ్

‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు

Updated Date - 2021-08-06T06:28:22+05:30 IST