టీపీసీసీ పదవిని అమ్మేశారు
ABN , First Publish Date - 2021-06-28T08:29:46+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకంపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
- తమిళనాట సీట్లలాగే ఇక్కడ పదవులను రాష్ట్ర ఇన్‌చార్జి అమ్మారు
- పార్టీలు మారినవారికి పదవిచ్చారు.. నేను మారలే.. కాబట్టే ఇవ్వలే
- గాంధీభవన్‌కు పోను.. హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోండి
- కోమటిరెడ్డి వ్యాఖ్యలు.. అధిష్ఠానం సీరియస్.. నివేదికకు ఆదేశం
- ఆయన కేసీఆర్ ఎజెండాను అమలు చేస్తున్నట్లే: షబ్బీర్ అలీ, మల్లు రవి
హైదరాబాద్/శంషాబాద్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకంపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తకు టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తారని భావించానని, కానీ.. ఓటుకు నోటు కేసు మాదిరిగానే అమ్ముకున్నారని అన్నారు. పార్టీలు మారే వారికి పదవి ఇచ్చారని, తాను పార్టీ మారలేదు కాబట్టి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కోమటిరెడ్డి.. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇన్‌చార్జి చేసిన రాజకీయాల వల్లనే పదవి రాలేదని, తమిళనాడులో సీట్లు అమ్ముకున్నట్లుగానే ఇక్కడ పదవులను అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీలు మారిన వారికి పదవి ఎలా వచ్చిందో అధిష్ఠానానికి ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. కొత్తగా పీసీసీ కార్యవర్గంలో నియమితులైన వారెవరూ తన వద్దకు రావద్దన్నారు. తాను గాంధీభవన్ మెట్లు ఎక్కేదిలేదని ప్రకటించారు.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఎటువంటి విమర్శలు చేయబోనని తెలిపారు. ఇకపై పదవులతో సంబంధం లేకుండా, ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటే కోమటిరెడ్డికి అన్యాయం జరిగినట్టే.. తమకూ అన్యాయం చేస్తారని కార్యకర్తలు అనుకునే ప్రమాదం ఉందని, అందుకే సోమవారం నుంచి భువనగిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తానని అన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తానన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇకపై టీటీడీపీలాగా మారుతుందని జోస్యం చెప్పారు. కొత్త కార్యవర్గం హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలన్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కార్యాచరణను కార్యకర్తలే నిర్ణయిస్తారని చెప్పారు. ఎల్బీనగర్ నుంచి ఆందోల్ వరకు జాతీయ రహదారిని తాను చెబితేనే మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ పార్లమెంటు చెప్పారని తెలిపారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్
టీపీసీసీ చీఫ్ ఎంపిక, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై, పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలను అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకుంది. దీనికి సంబంధించిన నివేదిక పంపాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఆదేశించింది. దీంతో కోమటిరెడ్డి మాట్లాడిన వీడియో టేపులను, ఆయన వ్యాఖ్యల ఆంగ్ల అనువాదాన్నీ ఆయన అధిష్ఠానానికి పంపారు. టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నారని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏఐసీసీ నిర్ణయం తమకు శాసనమన్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. అధిష్ఠానం ప్రజాస్వామ్య బద్ధంగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని టీపీసీసీ చీఫ్‌పై నిర్ణయం తీసుకుందన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియమ్మ నిర్ణయాన్ని తప్పుబట్టడమంటే లోపాయికారీగా కేసీఆర్ ఎజెండాను అమలు చేస్తున్నట్టేనని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సంఘం పదవికి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా
టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి మర్రి శశిదర్‌రెడ్డి రాజీనామా చేశారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పునర్‌నియమించేందుకు వీలుగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.