Abn logo
Apr 11 2021 @ 00:03AM

ముప్పు తప్పేలా లేదు

కరోనా వైరస్‌ సెకెండ్‌ వేవ్‌ మొదలైంది. దీని ప్రభావం అతి వేగంగా ఉంది. అయితే  గతంలో లా ఇప్పుడు చాలా మంది  కరోనా అంటే భయపడడం లేదు.  ఉపద్రవం ముంచుకొస్తున్నా కంగారు పడకుండా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ ప్రభావం మెల్లిమెల్లిగా అన్ని రంగాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా వినోద పరిశ్రమ కు మళ్లీ ముప్పు తప్పేలాలేదు. 


గత ఏడాది తొమ్మిది నెలల పాటు కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయిన సినిమా పరిశ్రమ  ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే  కరోనా కేసులు పెరుగుతుండడంతో చిత్ర పరిశ్రమకు ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాదిలో తమిళ, కన్నడ సినీ పరిశ్రమలు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపిస్తున్నాయి. కర్నాటకలోని కొన్ని జిల్లాల్లో నైట్‌ కర్ఫ్యూ విధించడడంతో అది సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోంది. అలాగే  మహారాష్ట్రలో  పరిమిత లాక్‌డౌన్‌ విధించడంతో థియేటర్లు మూతపడ్డాయి.  కరోనా కారణంగా ఎన్నో   హిందీ చిత్రాల విడుదలలు  వాయిదా పడ్డాయి. తెలుగునాట కూడా ప్రస్తుతం  ‘వకీల్‌సాబ్‌’ విడుదలతో కళకళలాడుతున్న థియేటర్లు 50శాతం ఆక్యుపెన్సీతో  నడిచే పరిస్థితి రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా  పలు చిత్రాల నిర్మాతలు  విడుదల వాయిదా వేశారు.  అయితే ఇప్పటికే విడుదల తేదీలు ప్రకటించిన తమ  సినిమాల పరిస్థితి ఏంటి? అన్న డైలామాలో నిర్మాతలు ఉన్నారు. 


కోర్టు కన్నెర్ర

చాప కింద నీరులా విస్తరిస్తూ  కరోనా కేసులు పెరుగుతుంటే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందని తెలంగాణ  హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదని కన్నెర్ర చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో  మళ్లీ నైట్‌  కర్ఫ్యూ విధించే  అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.ఈ పరిస్థితి ఎంత కాలం ఇలా కొనసాగుతుందో, మళ్లీ ఎన్ని రోజులు కరోనాతో ఇబ్బంది పడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.   చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదల  సిద్ధమైన సినిమాల విడుదలలపై నీలినీడలు కమ్ముకున్నాయి.  నాగచైతన్య, శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లవ్‌స్టోరి’ చిత్రం ఈ నెల 16న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సినిమాను వాయిదా వేస్తున్నామని ఇటీవల నిర్మాతలు ప్రకటించారు. తిరిగి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేసేదీ నిర్మాతలు  ఇంకా ప్రకటించలేదు. అలాగే  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథతో తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రాన్ని కూడా వాయిదా వేశారు.


ఈ నెల 23న విడుదల కానున్న ‘టక్‌ జగదీష్‌’, 30న విడుదల కావలసిన ‘విరాటపర్వం’ చిత్రాలు అనుకున్న ప్రకారం విడుదల అవుతాయా లేక వాయిదా పడతాయా అనే విషయంలో క్లారిటీ లేదు.  మే నెలలో విడుదల కావాల్సిన  చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘బీబీ3’, వెంకటేశ్‌ ‘నారప్ప’, రవితేజ ‘ఖిలాడి’  చిత్రాల పరిస్థితి కూడా ప్రశ్నార్ధకంగా మారింది.  ఒకవేళ సీటింగ్‌ విషయంలో  50 శాతం ఆక్యుపెన్సీని మళ్లీ ప్రకటిస్తే ఈ భారీ చిత్రాల పరిస్థితి ఏమిటో!  ఈ చిత్రాల బడ్జెట్‌కు తగ్గ వ్యాపారం జరిగి భారీ  వసూళ్లు రాబట్టాలంటే పరిస్థితులు మెరుగుపడే వరకూ విడుదల విషయంలో వేచి చూడడం మంచిదనే అభిప్రాయం ట్రేడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 


బాలీవుడ్‌కీ గడ్డు కాలమే! 

మహారాష్ట్రలో కరోనా ఉదృతి తీవ్రంగా ఉంది.  రోజురోజుకీ వందల సంఖ్యలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం కర్య్ఫూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 30 వరకూ థియేటర్లు మూసి వేయాలని అంక్షలు విధించారు. ప్రభుత్వు నిర్ణయం  బాలీవుడ్‌పై మరోసారి తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన పలు భారీ చితాల్రు  ప్రభుత్వ నిర్ణయంతో  విడుదల వాయిదా వేసుకున్నాయి.   రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ వల్ల  ఒక్కో థియేటర్‌కు సగటున నెలకు రూ.2 లక్షల వరకూ నష్టం వాటిల్లనుందని.. ఇప్పటివరకు బాలీవుడ్‌ రూ.400 కోట్ల వరకూ నష్టపోయినట్లు ఎగ్జిబ్యూటర్లు చెబుతున్నారు. 


బడా హీరోలు వెనక్కి తగ్గుతున్నారు...

అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’ చిత్రం విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.  అమితాబ్‌ ‘చెహ్రీ’, సైఫ్‌ అలీఖాన్‌ నటించిన ‘బంటీ ఔర్‌ బబ్లీ-2’ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. జాన్‌ అబ్రహాం ‘సత్యమేవ జయతే’తోపాటు సల్మాన్‌ఖాన్‌ ‘రాధే’ చిత్రాలు కూడా  వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో విడుదలైన ‘అరణ్య’  హిందీ వెర్షన్‌ ‘హాతీ మేరా సాతీ’ కూడా   వాయిదా పడింది. భారీ చిత్రాలే కాదు లో  బడ్జెట్‌ చిత్రాలు కూడా వెనకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  


అది పరిష్కారం కాదు...

దాదాపు 8 నెలలపాటు మూతపడి ఉన్న థియేటర్‌లను తిరిగి ప్రారంభించేందుకు, కొవిడ్‌ నిబంధనల అమలు పరచడానికి భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు థియేటర్‌ యాజమాన్యాలు చెబుతున్నాయి. సంవత్సర కాలం సినిమా హాళ్లు మూసి ఉంచినా కేసులు పెరిగాయనీ, కొవిడ్‌ కట్టడికి థియేటర్ల మూసివేత పరిష్కారం కాదనీ, అందుకే ప్రభుత్వం పునరాలోచించి, చిత్ర పరిశ్రమను ఆదుకోవాలని  బాలీవుడ్‌ ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.