మూడో ముప్పు

ABN , First Publish Date - 2021-07-25T07:19:02+05:30 IST

కరోనా వైరస్‌ తొలిదశ విజృంభణ రాష్ట్రాన్ని కుదిపేసింది. సెకండ్‌ వేవ్‌.. ప్రాణ భయం పుట్టిస్తూ హడలెత్తించింది. తాజాగా మూడో దశ ముప్పు భయపెడుతోంది. రాష్ట్రంలో రెండు వారాలుగా పాజిటివ్‌ కేసులు..

మూడో ముప్పు

ఆగస్టులో థర్డ్‌ వేవ్‌ సంక్షోభం? 

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

జిల్లాల్లో స్థానికంగా కర్ఫ్యూ అమలు

రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తున్న ప్రభుత్వం

హెర్డ్‌ఇమ్యూనిటీ ఉన్నా ప్రమాదం తప్పదు

థర్డ్‌వేవ్‌పై హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కరోనా వైరస్‌ తొలిదశ విజృంభణ రాష్ట్రాన్ని కుదిపేసింది. సెకండ్‌ వేవ్‌.. ప్రాణ భయం పుట్టిస్తూ హడలెత్తించింది. తాజాగా మూడో దశ ముప్పు భయపెడుతోంది. రాష్ట్రంలో రెండు వారాలుగా పాజిటివ్‌ కేసులు.. పాజిటివిటీ రేటు నిలకడగా ఉన్నాయి కానీ.. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. జూన్‌ 21న ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల కేసులు వెలుగుచూస్తే.. బుధవారం ఒక్కరోజే 5.55 లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పాజిటివిటీ రేటు నెమ్మదిగా పెరుగుతోంది. మన దేశంలో కూడా ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. దేశంలో మొదటి, రెండో దశలు తొలుత కేరళ తర్వాత మహారాష్ట్ర అనంతరం ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కూడా కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. కేరళలో బుధవారం పాజిటివిటీ రేటు 10 శాతంగా నమోదైంది. మహారాష్ట్రలో ప్రతిరోజూ 9 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ కేసుల నమోదులో కేరళ, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మే నెలలో కరోనా భీభత్సం సృష్టించింది. జూన్‌ 20 నుంచి కేసులు తగ్గుతూ వచ్చాయి. జూలై 8 నుంచి 22 వరకూ ప్రతి రోజూ సగటు 2 వేల కేసులు బయటపడ్డాయి.


పాజిటివిటీ రేటు 2.1 నుంచి 2.6 శాతం వరకూ నమోదైంది. తొలిదశలో కేసుల సంఖ్య వంద లోపు నమోదవడం మొదలైన తర్వాత రెండో దశ వ్యాప్తి ప్రారంభమైంది. కానీ ప్రస్తుతం రెండో దశలో రోజుకు సగటున 2వేల కేసులు నమోదవున్నాయి. ఇదిలా కొనసాగుతుండగానే థర్డ్‌ వేవ్‌ ప్రారంభమయ్యేలా ఉంది. కేరళ, మహారాష్ట్రల్లో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే.. ఆగస్టులోనే మూడో దశ ప్రారంభం అవుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదు. ఇదే క్రమంలో ఆయా జిల్లాల్లో కేసులు పెరుగుతాయి తప్ప.. తగ్గే అవకాశం లేదని వైద్యులు అంచనా వేస్తున్నారు. 


కర్ఫ్యూ కొనసాగింపు..

ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ప్రభుత్వం కూడా కర్ఫ్యూ నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంది. ఏ వారానికి ఆ వారం కర్ఫ్యూను పొడిగించుకుంటూ వస్తోంది. మూడోదశను దృష్టిలో పెట్టుకునే కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కర్ఫ్యూ అమలులో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరుజిల్లాల్లో కేసుల ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో కొ న్నిగ్రామాల్లో స్వచ్ఛందంగా కర్ఫ్యూ అమలుచేస్తున్నారు.  


హెర్ట్‌ ఇమ్యూనిటీ ఉపయోగమేనా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 67 శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీ ఉందని సీరో సర్వే ద్వారా వెల్లడవుతుంది. ఏపీలో కూడా దాదాపు 70శాతంపైన హెర్డ్‌ ఇమ్యూనిటీ ఉన్నట్లు సీరో సర్వే ద్వారా తేలింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ప్రశ్నార్థమే!. ఏపీలో రెండో దశ ప్రారంభ సమయంలో 30-50 శాతం ఇమ్యూనిటీ ఉన్నట్లు ఆరోగ్యశాఖ గుర్తించింది. దేశవ్యాప్తంగా 50శాతంపైన ఇది ఉన్నట్లు సీరో సర్వే తెలిపింది. కానీ రెండో దశ భీభత్సాన్ని హెర్డ్‌ ఇమ్యూనిటీ నియంత్రించలేకపోయింది. మూడో దశ ప్రభావం తొలి రెండుదశల స్థాయిలో ఉండొచ్చని వైద్యులు అంచనావేస్తున్నారు. జాగ్రత్త వహించకపోతే మాత్రం మరింత ప్రమాదస్థాయిని చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-07-25T07:19:02+05:30 IST