విద్యార్థిని వాతలు తేలేట్టు కొట్టిన ఉపాధ్యాయుడు

ABN , First Publish Date - 2021-12-04T07:48:57+05:30 IST

స్టడీ అవర్‌లో నవ్వాడని ఏడో తరగతి విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు బెల్టుతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆ ఉపాధ్యాయుడిపై కేసు పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

విద్యార్థిని వాతలు తేలేట్టు కొట్టిన ఉపాధ్యాయుడు

మిర్యాలగూడ బీసీ గురుకుల పాఠశాలలో ఘటన

మిర్యాలగూడ అర్బన్‌, డిసెంబరు 3: స్టడీ అవర్‌లో నవ్వాడని ఏడో తరగతి విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు బెల్టుతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆ ఉపాధ్యాయుడిపై కేసు పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. త్రిపురారం మండలం రాగడప గ్రామపంచాయతీ కుంకుడుచెట్టు తండాకు చెందిన పానుగోతు నాగేందర్‌ నల్లగొండ జిల్లా  మిర్యాలగూడ నాగార్జుననగర్‌లోని బీసీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం సోషల్‌ సబ్జెక్ట్‌ గెస్ట్‌ ఉపాధ్యాయుడు జానీపాషా స్టడీ అవర్‌ నిర్వహించేందుకు విద్యార్థులను వరుస క్రమంలో కూర్చోబెడుతున్నారు. ఆ సమయంలో తోటి  విద్యార్థి వేసిన జోక్‌కు నాగేందర్‌ గట్టిగా నవ్వాడు. దీంతో ఉపాధ్యాయుడు జానీపాషా నాగేందర్‌ను క్లాస్‌రూంలోకి లాక్కెళ్లి దండించేందుకు సహ ఉపాధ్యాయుడిని బెత్తం అడిగాడు. ఆయన  లేదనడంతో పక్కనే ఉన్న స్టాఫ్‌ రూంలోకి తీసుకెళ్లి నడుముకు ఉన్న బెల్టుతీసి విచక్షణా రహితంగా కొట్టాడు.  వీపుపై ఎర్రగా వాతలు తేలాయి. మర్మావయవాల వద్ద గట్టి దెబ్బతగిలి విద్యార్థి సొమ్మసిల్లిపడిపోయాడు. దాంతో ఉపాధ్యాయుడు వెనక్కుతగ్గి విద్యార్థికి సపర్యలు చేశాడు. ఇక్కడ జరిగినది ఎవరితోనైనా చెబితే తోలు తీస్తానని విద్యార్థులను బెదిరించడంతో విషయం బయటకు పొక్కలేదు. విద్యార్థి తల్లి జయమ్మ వసతిగృహంలో ఉంటున్న తన కుమారుడిని పలకరించేందుకు శుక్రవారం గురుకుల పాఠశాల వద్దకు వచ్చారు. ఉపాధ్యాయుడు కొట్టిన విషయాన్ని నాగేందర్‌  తల్లికి వివరించాడు.  విషయం తెలుసుకున్న విద్యార్థి, బీసీ సంఘాల నాయకులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థిని దారుణంగా కొట్టిన  ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-04T07:48:57+05:30 IST