కూలిన కూలీల బతుకు!

ABN , First Publish Date - 2021-05-09T08:08:00+05:30 IST

కడప జిల్లాలో ఘోరం జరిగింది. ముగ్గురాళ్ల క్వారీలో పేలుళ్ల కోసం తెచ్చిన మందుగుండును దించుతుండగా.. అవి ఒక్కసారిగా భారీ శబ్దాలతో పేలాయి. మందుగుండును దించుతున్న కూలీల శరీరాలు విస్ఫోట తీవ్రతకు

కూలిన కూలీల బతుకు!

కడపలోని ముగ్గురాళ్ల క్వారీలో భారీ పేలుళ్లు 10 మంది మృతి

గుర్తుపట్టలేనివిధంగా మృతదేహాలు ఛిద్రం

మందుగుండు దించుతుండగా విస్ఫోటం

నెత్తుటి ముద్దలుగా మృతదేహాలు

చెల్లాచెదురుగా శరీర భాగాలు

వైసీపీ నేత చేతుల్లో క్వారీ

లైసెన్సు రద్దుకు ఏడాది క్రితం సిఫారసు

పేలుళ్లకు ఎలా అనుమతి ఇచ్చారు: బాబు

ముఖ్యమంత్రి, గవర్నర్‌ తీవ్ర దిగ్ర్భాంతి


కడప, మే 8 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో ఘోరం జరిగింది. ముగ్గురాళ్ల క్వారీలో పేలుళ్ల కోసం తెచ్చిన మందుగుండును దించుతుండగా.. అవి ఒక్కసారిగా భారీ శబ్దాలతో పేలాయి. మందుగుండును దించుతున్న కూలీల శరీరాలు  విస్ఫోట తీవ్రతకు ఛిద్రమయ్యాయి. పేలుడు ధాటికి దట్టమైన మంటలు ఎగసిపడ్డాయి. మృతదేహ భాగాలూ చెల్లాచెదురుగా పడ్డాయి. నెత్తుటి ముద్దలు తప్ప అవయవాలకు ఆకారమే లేదు. ఎవరిది ఏ భాగమో తెలియదు..ఎన్ని మృతదేహాలనేదీ గుర్తించలేని పరిస్థితి. లోడు దించడానికి 12మందిని తెచ్చారు. ప్రమాద సమయంలో పదిమంది కూలీలు ఉన్నారు. వారంతా ఈ ప్రమాదంలో మృత్యువాతపడినట్టు భావిస్తున్నారు. మృతదేహాలను బట్టి ఆరుగురు చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ఘోరం కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని క్వారీలో చోటుచేసుకొంది. వైసీపీ నేత చేతుల్లోని ఈ క్వారీ నిబంధనలను ఉల్లంఘించిందంటూ 2020లోనే లైసెన్సు రద్దుకు సిఫారసు చేయడం గమనార్హం! ఆ వివరాల్లోకి వెళితే.. మామిళ్లపల్లి గ్రామం శివార్లలో సర్వే నంబర్‌. 1,133లో ఉన్న క్వారీలో 30హెక్టార్లలో ముగ్గురాళ్ల గనులు ఉన్నాయి. ఈ క్వారీని వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య భార్య కస్తూరీబాయికి 2001 నవంబర్‌ 2న 20 ఏళ్లకు లీజుకు ఇచ్చారు.


2013లో ఆమె నుంచి మైదుకూరు నియోజకవర్గం బి.మఠం మండలానికి చెందిన వైసీపీ నేత నాగేశ్వరరెడ్డి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) తీసుకున్నారు. ముగ్గురాళ్ల కోసం కొండల్ని పిండిచేస్తున్నారు. బ్లాస్టింగ్‌, ఇతర ప్రమాదకర పనులను పులివెందుల నియోజకవర్గంలోని వేముల, వేంపల్లి మండలాల నుంచి కూలీలను తెప్పించి చేయిస్తున్నారు. వారికి బ్లాస్టింగ్‌లో అనుభవం, లైసెన్సు లేవని తెలుస్తోంది. శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వేంపల్లి నుంచి వాహనంలో దాదాపు 150 కిలోలకుపైగా జిలెటిన్‌ స్టిక్స్‌, పేలుళ్లకు ఉపయోగించే మందుగుండు సామగ్రి క్వారీకి తీసుకువచ్చారు. కూలీలు ఆ మందుగుండును దింపుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు జరిగాయి. భీతిల్లిపోయిన పరిసర పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు పరుగులు తీశారు. 


మూటలుగా తెగిన భాగాలు..

క్వారీలో ఎటుచూసినా ఛిద్రమైన మృతదేహాలే! ప్రమాదం జరిగిన స్థలానికి దాదాపు 200-300 మీటర్ల దూరంలో కూలీల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అవి మృతదేహాల్లా కాకుండా రక్తపు ముద్దల్లా కనిపించాయి. కొందరి శరీర భాగాలు తెగిపోయి.. అక్కడో భాగం ఇక్కడో భాగం పడిపోయాయి. మృతదేహాలు నుజ్జునుజ్జు అయిపోవడంతో వాటిని గుర్తించడం పోలీసులకు చాలా కష్టంగా మారింది. శరీర భాగాలను ఘటనాస్థలం నుంచి ఏరి దుస్తుల్లో మూటగట్టారు. అతికష్టం మీద మృతదేహాలను బట్టి ఆరుగురు చనిపోయినట్టు గుర్తించారు. అయితే, వారెవరనేది చెప్పలేకపోతున్నారు. మరో నలుగురి వివరాలు తెలియాల్సి ఉంది. వారు కూడా చనిపోయి ఉంటారని, వారి మృతదేహాల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. లోడు దించే సమయంలో అక్కడ ఉన్న కలసపాడు మండలానికి చెందిన ప్రసాద్‌ (40), పులివెందుల నియోజకవర్గం వేముల మండలానికి చెందిన సుబ్బారెడ్డి (45), గంగులు (35), వెంకటరమణ (25), వెంకటేశ్‌ (25), ఈశ్వరయ్య (45), గంగిరెడ్డి (50), లక్ష్మయ్య (60), అబ్దుల్‌, పోరుమామిళ్లకు చెందిన డ్రైవర్‌ కొరివి ప్రసాద్‌ మృతి చెందారని భావిస్తున్నారు. కేసు నమోదు చేశామని, ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.  


రద్దయిన క్వారీలో పేలుళ్లు ఎలా?:పుట్టా 

కడప జిల్లాలోని మామిళ్లపల్లి ముగ్గురాళ్ళ క్వారీ రద్దయిందని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు  అధికారులు సమాధానం ఇచ్చారని, రద్దయిన క్వారీలో పేలుళ్లు ఎలా జరిగాయని తెలుగుదేశం పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ‘‘క్వారీలోకి జిలెటిన్‌ స్టిక్స్‌ ఎవరు తెచ్చారు... ఎక్కడి నుంచి వచ్చాయో అధికారులు సమాధానం చెప్పాలి. క్వారీ నిర్వహణలో వైసీపీ నేతల పాత్ర ఉంది. అందుకే అధికారులు దానిని పట్టించుకోకుండా వదిలేశారు. ఇందులో నిజానిజాలను స్థానిక అధికారులు నిష్పక్షపాతంగా వెలికితీసే పరిస్ధితులు లేనందువల్ల సిటింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి’’ ఆయన డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇప్పించాలని సుధాకర్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.


గవర్నర్‌, సీఎం దిగ్ర్భాంతి

్జకడప క్వారీ ప్రమాదంలో 10మంది మృతిచెందిన ఘటన పట్ల రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని శనివారం అఽధికారులను ఆదేశించారు. క్వారీ పేలుళ్ల దుర్ఘటనపై సీఎం జగన్‌  దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గనులు, భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌తో క్వారీ పేలుళ్ల ఘటనపై ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. 


కర్ఫ్యూలో అనుమతులా?: చంద్రబాబు

పేలుడు పదార్థాలు పేలి పెద్ద సంఖ్యలో కూలీలు మృత్యువాత పడటం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొవిడ్‌ కర్ఫ్యూ సమయంలో మైనింగ్‌కు ప్రభుత్వం ఎలా అనుమతించింది? పేలుడు పదార్థాలు అనుమతి లేకుండా అక్కడకు ఎలా చేరాయన్నదానిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని, దీనిపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరోనా రెండో దశలో ఇప్పటికే భారీగా మరణాలు సంభవిస్తున్న సమయంలో ఈ ప్రమాదంలో మరి కొందరు మరణించడం దారుణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. క్వారీ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. 


రద్దు చేస్తాం : మైనింగ్‌ ఏడీ రవిప్రసాద్‌

‘‘పేలుడు పదార్థాల నిర్వహణలో అజాగ్రత్తగా వ్యవహరించడంవల్లే ప్రమాదం జరిగింది. లీజుదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు, లీజును రద్దు చేస్తాం. జేసీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటుచేసి ఘటనపై దర్యాప్తు జరిపిస్తాం. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున చెల్లిస్తాం’’ 


రద్దుకు సిఫారసు చేసినా..

ప్రమాదం జరిగిన క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు 2019 జనవరి 15లో ఒకసారి, అక్టోబరు 18లో మరోసారి, 2020 ఆగస్టు 21న చివరిసారి తనిఖీలు జరిపారు. ఏపీఎంఎంసీ నిబంధనల ప్రకారం కౌలుదారు నిబంధనలు అతిక్రమించడంతో రద్దు చేయాలని 2020 సెప్టెంబరు 26న లేఖ నంబర్‌ 3423/ఎం1/2002 కింద గనుల, భూగర్భవనరుల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ మేరకు బి.మఠం మండలానికి చెందిన ముడుమాల పోలిరెడ్డి ఆర్టీఐ కింద అడిగిన దానికి కడప మైనింగ్‌ ఏడీ రవిప్రసాద్‌ సమాధానం ఇచ్చారు. పర్యావరణ అనుమతులు కూడా లేవని అందులో పేర్కొన్నారు. అదేరోజు ఈ క్వారీని రద్దుచేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని స్థానికులు అంటున్నారు.

Updated Date - 2021-05-09T08:08:00+05:30 IST