నిర్మాణం మరింత భారం

ABN , First Publish Date - 2022-04-03T08:07:04+05:30 IST

భవన నిర్మాణం మరింత భారం కానుంది. ఇప్పటికే పెట్రో

నిర్మాణం మరింత భారం

  • అన్ని రకాల ఫీజులను పెంచిన గనుల శాఖ..
  • అర్ధరాత్రి ఎనిమిది ఉత్తర్వుల విడుదల
  •  తాజా పెంపు శుక్రవారం నుంచే అమల్లోకి
  •  గ్రానైట్‌ డెడ్‌రెంట్‌ ఫీజు రెండింతలు
  •  లక్ష నుంచి రూ. 2 లక్షలకు డెడ్‌రెంట్‌
  •  ఇసుక, కంకరపైనా భారీ మోత
  •  మొరం మట్టిపైనా సర్కారు వడ్డింపు
  •  కొత్తగా సీనరేజీలో 80ు పర్మిట్‌ ఫీజు
  •  కుదేలవుతున్న గనుల లీజుదారులు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణం మరింత భారం కానుంది. ఇప్పటికే పెట్రో ధరల మోతతో రవాణా చార్జీలు పెరిగి.. భవన నిర్మాణ సామగ్రి ధరలకు రెక్కలు రాగా.. రాష్ట్ర ప్రభుత్వం గనుల శాఖలో దాదాపుగా అన్ని రకాల ఫీజులను పెంచింది. తెలంగాణ మైన్స్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం అర్ధరాత్రి 2 గంటలకు ఈ మేరకు ఫీజులను సవరిస్తూ జీవోనెం. 18, 19, 20, 21, 22, 23, 24, 25లను విడుదల చేశారు. పెరిగిన చార్జీలను శుక్రవారం నుంచే అమల్లోకి తీసుకువచ్చారు.


చిన్నతరహా గనుల్లో వెలికితీసే ఖనిజాలపై ఇప్పటి ఇప్పటి వరకు ఉన్న డెడ్‌రెంట్‌(వార్షిక ఫీజు), సీనరేజీ, దరఖాస్తు రుసుం, లీజు బదిలీ, లీజు పునరుద్ధరణ(రెన్యూవల్‌) ఫీజులు, రిఫండబుల్‌, నాన్‌-రిఫండబుల్‌ డిపాజిట్ల మొత్తాన్ని పెంచేశారు. దీంతో.. ఇళ్ల నిర్మాణాలకు వినియోగించే గ్రానైట్‌, పాలరాయి(మార్బుల్‌), రాతి ఇసుక, భవన నిర్మాణాలకు ఉపయోగించే బెందెడ్‌, గ్రానైట్‌(రాతి), కంకర, చివరకు మొరం ధరలు పెరగనున్నాయి. దీంతో ఇళ్ల నిర్మాణ వ్యయం తడిసిమోపెడు కానుంది. అదేవిధంగా రహదారి నిర్మాణంలో వినియోగించే కంకర ధరలూ పెరగనున్నాయి. నిజానికి గనుల శాఖలో పైన పేర్కొన్న కేటగిరీల ఫీజులను మూడేళ్లకోసారి పెంచాలి. కానీ, తెలంగాణలో ఈ ఫీజులు 2015 సెప్టెంబరు నుంచి పెరగలేదు. ప్రభుత్వం ఆరున్నరేళ్ల తర్వాత ఒక్కసారిగా రెట్టింపు మోత మోగించింది.


సీనరేజీ ఫీజులూ మోత మోగించాయి

సీనరేజీ ఫీజులు కూడా మోత మోగించాయి. భవన నిర్మాణానికి వినియోగించే రాళ్లు, రఫ్‌స్టోన్‌(బెందడ్‌), రహదారి నిర్మాణ కంకరపై మెట్రిక్‌ టన్నుకు రూ. 50గా ఉండే సీనరేజీ ఫీజులను రూ. 65కు పెంచారు. మెట్రిక్‌ టన్ను మార్బుల్స్‌పై సీనరేజీ రూ. 130కి, మొసాయిక్‌ చిప్‌పై రూ.58, మొరం మట్టిపై రూ.20, సాధారణ ఇసుకపై రూ.27, లైమ్‌స్టోన్‌ స్లాబుపై రూ.130లు, లాటరైట్‌పై రూ.130లు, లైమ్‌ కంకరపై రూ.123, మైకాపై రూ.2600, సిలికా సాండ్‌పై రూ.78, స్లేట్‌పై రూ.169కి చేరాయి. ఇలా మొత్తం 46 రకాల మైనర్‌ మినరల్స్‌పై సీనరేజీ ఫీజుల మోత మోగించారు.


ఇక పర్మిట్‌కు సీనరేజీ ఫీజులో 80 శాతాన్ని వసూలు చేస్తారు. గతంలో ఈ విధానం లేదు. అంటే లీజుదారులు చెల్లించాల్సిన సినరేజీ ఫీజుతో పాటు 80ు పర్మిట్‌ ఫీజు మోతను భరించాల్సిందే. అంతేకాకుండా.. రాయల్టీని 80ు పెంచారు. లీజుపై నాన్‌ రిఫండబుల్‌(తిరిగి చెల్లించడానికి వీల్లేని) డిపాజిట్‌ను నిర్ణయించారు. దీని కింద డెడ్‌రెంట్‌పై నాలుగు రెట్లు కట్టాలి. రిఫండబుల్‌(తిరిగి చెల్లించే) డిపాజిట్‌ అయితే రెండు రెట్లు చెల్లించాలి. ఇక 55 రకాల మైనర్‌ మినరల్స్‌, బ్లాక్‌ గ్రానైట్‌, మార్బుల్‌తోపాటు 31 రకాల ఖనిజాలకు రూ.5 వేలుగా ఉన్న ఫీజును రూ.2 లక్షలకు పెంచారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మార్బుల్స్‌, గ్రానైట్‌, ఇసుక, కంకర, గృహనిర్మాణానికి వినియోగించే రాతి, మొరం మట్టి వంటి వాటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.




డెడ్‌రెంట్‌ రెండింతలు


తాజా పెంపులో ప్రభుత్వం డెడ్‌రెంట్‌పై రెండింతల మోత మోగించింది. ఒక హెక్టార్‌ గని లీజుకు గ్రానైట్‌పై వార్షికఫీజు రూ. లక్ష ఉండగా.. దాన్ని రూ. 2 లక్షలకు పెంచింది. కలర్‌ గ్రానైట్‌ విషయంలో రూ. 80 వేలుగా ఉన్న ఫీజు రూ. 1.60 లక్షలకు.. మార్బుల్‌, భవన నిర్మాణ రాళ్లు, కంకర(భవన నిర్మాణం, రహదారి నిర్మాణాలకు వినియోగించేది), మాన్యుఫాక్చర్డ్‌ ఇసుకపై వార్షిక ఫీజను రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. అంటే.. ఒక 5 హెక్టార్లలో మార్బుల్స్‌ గనిని నిర్వహించే లీజుదారుడు రూ. 10 లక్షలు చెల్లించాల్సిందే. లీజు పునరుద్ధరణకు ఈ ఫీజు మరింత భారంగా మారిందని.. ఆరు రెట్ల దాకా రిఫండబుల్‌, నాన్‌-రిఫండబుల్‌ ఫీజులు చెల్లించాల్సిందేనని లీజుదారులు వాపోతున్నారు. చివరకు మొరం మట్టి లీజులోనూ డెడ్‌రెంట్‌ను రూ. 40 వేలుగా నిర్ణయించారు. మిగతా మైనర్‌ మినిరల్స్‌పైనా రూ. 40 వేల మోత తప్పనిసరిగా మారింది.


Updated Date - 2022-04-03T08:07:04+05:30 IST